ప్రాణాల కోసం వేలాది మంది చిన్నారుల పోరాటం..!! | Children in Gaza displacement humanitarian crisis | Sakshi
Sakshi News home page

ప్రాణాల కోసం వేలాది మంది చిన్నారుల పోరాటం..!!

Nov 13 2026 8:40 PM | Updated on Nov 13 2026 8:50 PM

Children in Gaza displacement humanitarian crisis
  • యుద్ధ జ్వాలల్లో అమాయక బాల్యం 

యుద్ధం ఎవరి మధ్య జరుగుతోంది..? యుద్ధరంగంలో ఉన్న ఇరుదేశాల్లో ఎవరు కరెక్ట్.. ఎవరిది తప్పు..?? ఈ రాజకీయాలు, సైనిక వ్యూహాలతో సంబంధం లేకుండా ఒక చేదు నిజాన్ని మనం అంగీకరించాలి. ఏ యుద్ధంలోనైనా ఆధిపత్యం పెద్దలదైతే.. ఆ నిప్పుల్లో కాలిపోయేది మాత్రం అమాయక చిన్నారులే..! గాజా యుద్ధం మొదలైనప్పుడు అక్కడ సగం జనాభా- అంటే దాదాపు పది లక్షల మంది 18 ఏళ్ల లోపు పిల్లలే..! అందులో మూడు లక్షల ముప్పై వేల మంది ఐదేళ్ల లోపు పసిపిల్లలు. 

ఈ చిన్నారులు ఏ తప్పూ చేయలేదు. ఏ నిర్ణయంలోనూ భాగస్వాములు కారు. కానీ చరిత్రలోనే అత్యంత దారుణమైన నరకాన్ని అనుభవిస్తున్నారు. యుద్ధం కారణంగా మరణం అంచుల వరకు వెళ్లి.. తీవ్ర అస్వస్థత, వైకల్యానికి గురైన పిల్లలను గాజా నుంచి బయటకు తెచ్చి ప్రాణాలు కాపాడేందుకు పాలస్తీనా చిల్డ్రన్స్ రిలీఫ్ ఫండ్ (PCRF) లాంటి స్వచ్ఛంద సంస్థలు చేసిన అద్భుతమైన పోరాటం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. బాంబుల వర్షంలో, సరిహద్దుల దిగ్బంధాల మధ్య పిల్లల ప్రాణాలు కాపాడటానికి ఉపయోగించిన మూడు విభిన్న మార్గాల కథ ఇది.

ఎముకల గూడులా ఆరేళ్ల బాలుడు
మొదటి కథ ఫాదీ అల్-జాంత్ అనే ఆరేళ్ల బాలుడిది. ఫాదీ 'సిస్టిక్ ఫైబ్రోసిస్' అనే అరుదైన జన్యుపరమైన ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆహారం జీర్ణం కావడానికి 'క్రియాన్' అనే ప్రత్యేక ఔషధం అవసరం. సాధారణ మనుషుల కంటే మూడు రెట్లు ఎక్కువ కేలరీలు తింటేనే ఆ పిల్లాడు బతకగలడు. కానీ యుద్ధం మొదలయ్యాక మందులు ఆగిపోయాయి, ఆకలి కేకలు మొదలయ్యాయి. ఆరేళ్ల వయసులో ఫాదీ బరువు కేవలం 11 కిలోలకు పడిపోయింది. ఎముకల గూడులా మారిన కొడుకును ఎత్తుకోవడానికి కూడా వాడి తల్లి భయపడింది. ముట్టుకుంటే.. వాడి శరీరం ఎక్కడ ముక్కలైపోతుందోనని..! చివరకు కుటుంబమంతా శిథిలాల మధ్య కాలినడకన 3 గంటలు నడిచి కమాల్ అద్వాన్ ఆసుపత్రికి చేర్చారు.

అంతే.. ఫాదీ ఫొటోలు ప్రపంచ మీడియాలో వైరల్ అయ్యాయి. గాజాలో చిన్నారుల పరిస్థితి ప్రపంచం దృష్టికి వెళ్లింది. అప్పుడే PCRF రంగంలోకి దిగింది. అప్పట్లో ఉత్తర గాజా నుంచి దక్షిణాన ఉన్న రఫా సరిహద్దుకు వెళ్లాలంటే ఇజ్రాయెల్ నిర్మించిన 'నెట్జారిమ్ కారిడార్' దాటాలి. అది దాటడానికి అనుమతి లేకపోతే కాల్చి చంపేస్తారు. WHO సహాయంతో చరిత్రలోనే మొదటిసారి ఉత్తరం నుంచి దక్షిణానికి రోగుల తరలింపు మార్గాన్ని తెరిపించారు. అంబులెన్స్‌లో రఫా దాటించి, ఈజిప్ట్ చేర్చి, అక్కడి నుంచి అమెరికాలోని న్యూయార్క్ నార్త్‌వెల్ ఆసుపత్రికి తరలించారు. నెలల చికిత్స తర్వాత ఫాదీ బతికాడు.. మళ్లీ నిలబడ్డాడు. కానీ దురదృష్టవశాత్తు, ఫాదీ బయటపడిన కొద్ది రోజులకే ఇజ్రాయెల్ సైన్యం రఫా సరిహద్దును పూర్తిగా మూసివేసింది. మొదటి మార్గం మూసుకుపోయింది..!

మిగిలిన పిల్లల పరిస్థితి ఏమిటి?
రఫా మూతపడటంతో మిగిలిన పిల్లల పరిస్థితి ఏమిటి? అప్పుడు తెరిచిన రెండో మార్గం 'కెరెమ్ షాలోమ్'. ఇది నేరుగా ఈజిప్ట్‌లోకి వెళ్లే మార్గం కాదు. ఇజ్రాయెల్ భూభాగం మీదుగా నెగెవ్ ఎడారి దాటి ఈజిప్ట్ చేరాలి. ఈ మార్గంలో ప్రాణాలు నిలబెట్టుకున్న పాప జూలియా. నాలుగేళ్ల ఈ చిన్నారి ఆల్టర్నేటింగ్ హెమిప్లెజియా ఆఫ్ చైల్డ్‌హుడ్(AHC) అనే అత్యంత అరుదైన నాడీ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా కేవలం వెయ్యి మందికే ఈ వ్యాధి ఉంది. విపరీతమైన శబ్దం వచ్చినా, ఒత్తిడి కలిగినా క్షణాల్లో ఫిట్స్, ఆ తర్వాత పక్షవాతం వస్తాయి.

యుద్ధ భూమిలో ప్రతి బాంబు పేలుడు, ప్రతి సైరన్ ఆ చిన్నారికి ప్రాణాంతకమే..! జూలియాను రక్షించడానికి ఆమె కుటుంబం, స్వచ్ఛంద సంస్థలు అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ స్థాయికి వెళ్లి పోరాడాయి. అయితే ఇజ్రాయెల్ సైనిక యంత్రాంగం (COGAT) నియమాలు ఎంత దారుణంగా ఉంటాయంటే.. పాపకు సరిహద్దు దాటే అనుమతి ఇచ్చారు కానీ, ఆమెను కనిపెట్టుకుని ఉండే తల్లిదండ్రులకు అనుమతి నిరాకరించారు..! చివరి నిమిషంలో ఆమె అత్తకు అనుమతి లభించింది. అలా కెరెమ్ షాలోమ్ మీదుగా ప్రైవేట్ అంబులెన్స్‌లలో ఆమెను బయటకు తీసుకొచ్చి, చివరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సైనిక విమానంలో అబుదాబి తరలించి అత్యవసర వైద్యం అందించారు. జూలియా ప్రాణాలు దక్కాయి కానీ, ఆమె తల్లిదండ్రులు ఇప్పటికీ గాజాలోనే బందీలుగా మిగిలిపోయారు.

జూలియా వెళ్లిన మార్గం కూడా ఒక్కసారికే పరిమితమైంది. దీంతో జోర్డాన్, అమెరికా సహకారంతో మూడో రూట్‌ను తెరిచారు. గాజా నుంచి ఇజ్రాయెల్, అక్కడి నుంచి జోర్డాన్.. ఆపై అమెరికాకు విమానం. ఇక్కడ ఇజ్రాయెల్ అధికారులు 10 మంది అంగవైకల్యం పొందిన పిల్లల పేర్లు పంపితే, 8 మందిని ఏ కారణం లేకుండా తిరస్కరించేవారు. దౌత్యపరమైన ఒత్తిళ్లు తెస్తేనే వారిని బయటకు రానిచ్చేవారు. ఈ మార్గంలో వచ్చిన బాధితుడే ఇబ్రహీం అబూదా. ఇబ్రహీం అనుభవించిన నరకం వింటే కన్నీళ్లు ఆగవు. స్కూల్ ఆవరణలో ఆడుకుంటున్నప్పుడు జరిగిన బాంబు దాడిలో చెయ్యి తెగిపోయింది.

తప్పించుకునే క్రమంలో బుల్లెట్ తగిలింది. ఆసుపత్రిలో కనీస మందులు, అనస్తీషియా లేకపోవడంతో.. ఏ విధమైన మత్తు ఇవ్వకుండానే డాక్టర్లు ఆ పసివాడి చేతిని తొలగించాల్సి వచ్చింది..! ఒక్కసారి ఊహించుకోండి.. మత్తుమందు లేకుండా చేతిని తీసేసేప్పుడు ఆ చిన్నారి ఎంత నరకయాతన అనుభవించి ఉంటాడో..? ఆ తర్వాత ఇన్ఫెక్షన్ రావడంతో మరోసారి మోచేతి దాకా నరికేశారు. ఊపిరితిత్తులు, కిడ్నీలు దెబ్బతిన్నాయి. మెరుగైన వైద్యం కోసం దేశం దాటించాలంటూ ఏడాది పాటు మూడు సార్లు దరఖాస్తులు చేయగా.. తిరస్కరణకు గురయ్యాయి. హక్కుల కార్యకర్తల చొరవతో.. చివరకు అమెరికాలోని ష్రైనర్స్ చిల్డ్రన్స్ ఆసుపత్రికి చేరాడు. అక్కడ అతనికి అమర్చిన కృత్రిమ చేతిని చూసి ఆ పసివాడు ఏడ్చిన దృశ్యం రాతి గుండెలను సైతం కరిగిస్తుంది.

ఇంకా వేలాది మంది చిన్నారుల సంగతి?
ఫాదీ, జూలియా, ఇబ్రహీం.. వీరంతా అదృష్టవశాత్తూ బయటపడ్డారు. కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వారి వెనుక.. అంబులెన్సులు, డాక్యుమెంట్లు, దౌత్య చర్చలు, కోట్ల ఖర్చుతో కూడిన వైద్య సహాయం అందించిన అసంఖ్యాకమైన మానవతావాదుల శ్రమ ఉంది. కానీ ఆలోచించండి.. ఇలా బయటపడింది కేవలం కొన్ని వందల మంది మాత్రమే. ఇంకా వేలాది మంది చిన్నారులు ఆ శిథిలాల మధ్య సరైన తిండి, మందులు లేక నరకం అనుభవిస్తున్నారు. ఆసుపత్రులు లేవు, డాక్టర్లు లేరు. బాంబుల శబ్దాలకు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. యుద్ధాలు భూభాగాల కోసం కావొచ్చు. రాజకీయ ఆధిపత్యం కోసం కావొచ్చు. కానీ పిల్లల జీవితాలను పణంగా పెట్టే ఏ యుద్ధమూ న్యాయమైనది కాదు. ఈ పిల్లల కళ్లలోని భయాన్ని తుడిచివేయడం ప్రపంచంలో ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత. సరిహద్దులు మూసుకుపోవచ్చు కానీ.. మానవత్వం ఎప్పటికీ ఆగిపోకూడదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement