హువాంగ్ రాజీనామా : అనూహ్య పరిణామం, బోర్డు అంగీకరిస్తుందా? | Bring Back The Boss Why Nvidia Employees Want Jensen Huang Back | Sakshi
Sakshi News home page

హువాంగ్ రాజీనామా : అనూహ్య పరిణామం, బోర్డు అంగీకరిస్తుందా?

Nov 13 2026 3:21 PM | Updated on Nov 13 2026 3:27 PM

Bring Back The Boss Why Nvidia Employees Want Jensen Huang Back

టెక్ దిగ్గజం ఎన్విడియా (Nvidia) సహ వ్యవస్థాపకుడు, సీఈఓ జెన్సన్ హువాంగ్ వివాహేతర సంబంధాలు, చైనా గూఢచర్యం ఆరోపణల వివాదంలో మరో కీలక పరిణామం  చోటు  చేసుకుంది. ఈ వ్యవహారం గ్లోబల్‌గా సంచలనం రేపడంతో  హువాంగ్‌  తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన ఉద్యోగులు ఆయనను వెనక్కి  తీసుకోవాలంటూ  పెద్ద ఎత్తున ఉద్యమించడం ఆసక్తికరంగా ఉంది. ఆయనపై  అభిమానం తగ్గని ఉద్యోగులు 'బాస్‌ను తిరిగి తీసుకురండి' అంటూ గళం విప్పారు. ఈ మేరకు బోర్డుకు ఒక లేఖ  రాశారు.  కొత్త సీఈఓ కోసం అన్వేషిస్తున్న  బోర్డు , ఫైనాన్స్ చీఫ్ కోలెట్ క్రెస్‌ను తాత్కాలిక సీఈఓగా నియమించింది. మరి బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.


తాజా నివేదికల ప్రకారం ఎన్విడియా అంతర్గత 'సజెషన్ బాక్స్' (suggestion box) లో సుమారు 1,600 కామెంట్లు వెల్లువెత్తాయి. ఎన్విడియాను ఏఐ (AI) దిగ్గజంగా తీర్చిదిద్దిన జెన్సెన్ హువాంగ్‌కు అండగా నిలుస్తూ చాలామంది ఉద్యోగులు ఆయనను తిరిగి నియమించాలని కోరుతున్నారు.   హువాంగ్‌ను తిరిగి జట్టులోకి తీసుకురావడానికి ఒక మార్గాన్ని కనుగొనాలని చాలా మంది ఉద్యోగులు బోర్డు సభ్యులను కోరారు.    లింక్డ్‌ఇన్ (LinkedIn) వేదికగా కూడా దాదాపు రెండు డజన్ల మంది ఉద్యోగులు హువాంగ్‌కు తమ మద్దతును ప్రకటించారు. అంతేకాకుండా, ఆయన ఎందుకు తప్పుకున్నారనే విషయంపై మరింత పారదర్శకత (openness) కావాలని కోరుతూ ఏకంగా  ఒక ఉద్యోగి సంస్థలోని అందరికీ (companywide) ఇమెయిల్ పంపినట్లు  సమాచారం.

 "బాస్‌ను వెనక్కి తీసుకురండి": "మీరు కంపెనీ లక్ష్యాన్ని నమ్మితే, మన బాస్‌ను తిరిగి తీసుకురండి" అని ఒక అజ్ఞాత ఉద్యోగి వ్యాఖ్యానించారు. "మనమందరం మనుషులమే, తప్పులు చేయడం సహజం. జెన్సెన్ ఎన్నో మంచి పనులు చేశారు, ఆయనకు మరో అవకాశం ఇవ్వాలి" అని మరొకరు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఎన్విడియా కొత్త సీఈఓ ఎవరు? రేసులో భారత సంతతి దిగ్గజాలు

కుప్పకూలిన షేర్లు

జెన్సన్ హువాంగ్ వ్యవహారంతోవాల్ స్ట్రీట్‌లో ఎన్విడియా షేర్లు కుప్పకూలిపోయాయి.  కేవలం నాలుగు ట్రేడింగ్ రోజుల్లోనే ఎన్విడియా మార్కెట్ విలువ సుమారు 490 నుంచి 500 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 47,10,050 కోట్లు) ఆవిరైంది. గురువారం ముగింపు నాటికి, ఎన్విడియా షేర్లు 11  శాతం పడిపోయాయి . వరుసగా ఆరవ వారం కూడా క్షీణత దిశగా పయనిస్తున్నాయి. 2012 తర్వాత ఇంత భారీ స్థాయిలో నష్టాలురావడం ఇదే తొలిసారి.  ఈ ఏడాదిలో చాలా కాలం పాటు ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా కొనసాగిన ఈ చిప్ దిగ్గజం, గురువారం మార్కెట్ ముగిసేనాటికి తన విలువలో 29 శాతం  కోల్పోయింది. దీనివల్ల మార్కెట్ క్యాప్‌లో సుమారు 1.6 ట్రిలియన్ల  డాలర్ల నష్టం వాటిల్లింది. ఫలితంగా  మార్కెట్‌ క్యాప్‌లో ఆపిల్ కంటే కూడా దిగువకు పడిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement