భారతదేశంలో వాయు కాలుష్యం రోజురోజుకూ పెద్ద సమస్యగా మారుతోంది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో కాలుష్యం కారణంగా ప్రజలు లెక్కలేనన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే.. దీని ప్రభావం కేవలం ఆరోగ్యంపైనే మాత్రమే కాకుండా.. కంపెనీలు, ఉద్యోగులు, దేశ ఆర్థిక వ్యవస్థపైనా పడుతోంది.
ఆఫీసుకు వచ్చే ఉద్యోగులు దగ్గు, తలనొప్పి, అలసట, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నా సెలవు తీసుకోకుండా పనిచేస్తుంటారు. కానీ.. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. అనారోగ్యం కారణంగా వారు తమ పనిని పూర్తి సామర్థ్యంతో చేయలేరు. దీనివల్ల కంపెనీల ఉత్పాదకత తగ్గి ఆర్థికంగా నష్టం జరుగుతోంది. డాల్‌బర్గ్ అడ్వైజర్స్, క్లీన్ ఎయిర్ ఫండ్ రూపొందించిన నివేదిక ప్రకారం, భారత్‌లో వాయు కాలుష్యాన్ని 20 శాతం తగ్గించగలిగితే 2030 నాటికి.. ఏడాదికి దాదాపు 85 బిలియన్ డాలర్ల ఆర్థిక నష్టాన్ని నివారించవచ్చు.
ప్రెజెంటీయిజం
వాయు కాలుష్యం వల్ల ఉద్యోగుల పనితీరు తగ్గడాన్ని 'ప్రెజెంటీయిజం' అంటారు. అంటే.. ఉద్యోగులు అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఆఫీసుకు వచ్చి పనిచేయడం. ఉదాహరణకు.. ఒక ఉద్యోగి దగ్గు, తలనొప్పి లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో బాధపడుతున్నా విధులకు హాజరవుతాడు. అయితే.. ఆ ఆరోగ్య సమస్యల కారణంగా పనిపై ఏకాగ్రత తగ్గుతుంది. పని పూర్తి చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇలాంటి నష్టాన్ని కంపెనీలు వెంటనే గుర్తించలేవు.
ఎందుకంటే ఉద్యోగి సెలవు తీసుకోలేదు కాబట్టి హాజరు రికార్డుల్లో సమస్య కనిపించదు. కానీ.. అతని పనితీరు తగ్గడం వల్ల కంపెనీకి నష్టం జరుగుతూనే ఉంటుంది. వాయు కాలుష్యం కారణంగా భారత్‌కు కలుగుతున్న ఆర్థిక నష్టాల్లో ఈ ప్రెజెంటీయిజం వాటా అత్యధికంగా ఉందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.
260 బిలియన్ డాలర్ల నష్టం
నివేదిక అంచనా ప్రకారం.. 2024లో వాయు కాలుష్యం కారణంగా భారత ఆర్థిక వ్యవస్థకు సుమారు 260 బిలియన్ డాలర్ల నష్టం జరిగింది. ఇది దేశ జీడీపీలో దాదాపు 6 శాతానికి సమానం. ఇందులో వైద్య ఖర్చులు, ఉద్యోగులు సెలవులు తీసుకోవడం, ఉత్పాదకత తగ్గడం, కాలుష్యం కారణంగా ముందస్తు మరణాలు వంటి అంశాలు ఉన్నాయి.
ఒక్క వైద్య ఖర్చుల రూపంలోనే సుమారు 12.3 బిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి. అంతేకాదు.. కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు ప్రజలు బయటకు వెళ్లడం, షాపింగ్ చేయడం, రెస్టారెంట్లకు వెళ్లడం, పర్యాటక ప్రాంతాలను సందర్శించడం తగ్గిస్తారు. దీనివల్ల హోటళ్లు, రెస్టారెంట్లు, రిటైల్ వ్యాపారాలు, పర్యాటక రంగం కూడా నష్టపోతున్నాయి. ఈ కారణంగా వినియోగదారుల ఖర్చులు, పర్యాటక కార్యకలాపాలు తగ్గి 2024లో భారత్‌కు సుమారు 74 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు నివేదిక వెల్లడించింది.
వాయు కాలుష్యం తగ్గితే..
అయితే కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా ఈ పరిస్థితిని మార్చవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా PM2.5 కాలుష్యాన్ని 20 శాతం తగ్గిస్తే 2030 నాటికి ఏడాదికి 85 బిలియన్ డాలర్ల వరకు నష్టాన్ని నివారించవచ్చని అంచనా. నిర్మాణ రంగం, డెలివరీ, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో పనిచేసే ఉద్యోగులు ఎక్కువ సమయం బయటే ఉండాల్సి వస్తుంది. దీంతో వారు కాలుష్యానికి ఎక్కువగా గురవుతున్నారు. అందువల్ల కార్యాలయాల్లో సరైన గాలి ప్రసరణ ఉండేలా చూడటం, HEPA ఎయిర్ ప్యూరిఫైయర్లు ఏర్పాటు చేయడం, బయట పనిచేసే ఉద్యోగులకు N95 లేదా N99 మాస్కులు అందించడం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం వంటి చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: మైక్రోసాఫ్ట్ యూజర్లకు షాక్.. ఇప్పట్లో పరిష్కారం కష్టమేనా?


