జాబ్ మానేసినా జీతం ఇస్తాం.. CEO సంచలన నిర్ణయం! | ID Fresh Food CEO Encourages Employees To Start Their Own Businesses Offers Salary Support After Resignation, Read Story Inside | Sakshi
Sakshi News home page

జాబ్ మానేసినా జీతం ఇస్తాం.. CEO సంచలన నిర్ణయం!

Nov 12 2026 11:27 AM | Updated on Nov 12 2026 12:17 PM

This Indian Founder Is Paying His Employees To Leave And Start Their Own Business

సాధారణంగా ఒక సంస్థలో పనిచేసే ఉద్యోగి.. ఉద్యోగం మానేసి సొంతంగా వ్యాపారం ప్రారంభిస్తానంటే యాజమాన్యం అంతగా ఇష్టపడదు. కానీ.. కర్ణాటకకు చెందిన ఐడీ ఫ్రెష్ ఫుడ్ ఇండియా కంపెనీ సీఈఓ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచించారు.

ఐడీ ఫ్రెష్ ఫుడ్ ఇండియా గ్లోబల్ సీఈఓ ముస్తఫా పీసీ.. తన దగ్గర పనిచేసే ఉద్యోగులు సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి జీవితంలో ఎదగాలని కోరుకుంటున్నారు. అంతేకాదు, ఉద్యోగం వదిలి వెళ్లే సమయంలోనూ వారికి కొంతకాలం జీతం చెల్లిస్తూ అండగా నిలవాలని నిర్ణయించారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

రూ.50వేల పెట్టుబడితో మొదలై..
ముస్తఫా తన లింక్డ్‌ఇన్ పోస్టులో ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాన్ని వివరించారు. ఒకప్పుడు తాము కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ వ్యాపారాన్ని ప్రారంభించామని గుర్తుచేసుకున్నారు. బెంగళూరులో కేవలం రూ.50 వేల పెట్టుబడితో ఒక చిన్న వంటగదిలో ఐడీ ఫ్రెష్ ఫుడ్ సంస్థను మొదలుపెట్టినట్లు తెలిపారు. ప్రారంభంలో.. ఎన్నో తప్పులు చేశామని, నిద్రలేని రాత్రులు గడిపామని చెప్పారు. అయితే తమ ఆలోచనపై నమ్మకం ఉంచిన కొందరు వ్యక్తులు ప్రోత్సహించడంతోనే ఈ స్థాయికి చేరుకోగలిగామని వివరించారు.

ఉద్యోగులకు అవకాశం
ఇప్పుడు తమ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా అలాంటి అవకాశమే కల్పించాలని ముస్తఫా భావిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా 'ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పాలసీ'ని తీసుకొచ్చారు. ఈ విధానం ద్వారా ఉద్యోగులు సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే కంపెనీకి చెందిన వ్యాపార భాగస్వాముల నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవచ్చు. అలాగే.. కంపెనీ ఉన్నతాధికారుల నుంచి సలహాలు, మార్గదర్శకత్వం పొందవచ్చు. ముఖ్యంగా తమ కలలను నిజం చేసుకునేందుకు ఉద్యోగాన్ని వదిలి వెళ్లే సమయంలో కొంతకాలం పాటు పాక్షికంగా జీతం కూడా అందిస్తారు.

ఈ నిర్ణయంపై ముస్తఫా మాట్లాడుతూ.. ఉద్యోగులు తమ కలలను నిజం చేసుకోవాలంటే ఆర్థిక భద్రతను పూర్తిగా వదులుకోవాల్సిన అవసరం ఉండకూడదని చెప్పారు. ఒకవేళ సొంతంగా వ్యాపారం ప్రారంభించిన తర్వాత.. అనుకున్నంతగా విజయం సాధించలేకపోతే తిరిగి తన దగ్గరకు రావచ్చని ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. మంచి ఉద్యోగులు కంపెనీని వదిలి వెళ్లడం బాధ కలిగించినా, వారే భవిష్యత్తులో సొంత సంస్థలను నిర్మించి సమాజానికి ఉపయోగపడితే అంతకంటే ఎక్కువ సంతోషం ఉండదని పేర్కొన్నారు.

గతంలో ఇలా..
ఇలాంటి ఆలోచనతో.. ఉద్యోగులను ప్రోత్సహించిన వారు విదేశాల్లోనూ ఉన్నారు. 2021లో అమెరికాకు చెందిన లాటిస్ సంస్థ సహ వ్యవస్థాపకుడు జాక్ ఆల్ట్‌మన్ కూడా తన కంపెనీలో ఉద్యోగం మానేసి సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి లక్ష డాలర్ల పెట్టుబడి అందిస్తానని ప్రకటించారు. గతంలో తాను ఉద్యోగం చేస్తున్న సమయంలో తన బాస్ ఇచ్చిన ప్రోత్సాహంతోనే సొంతంగా కంపెనీ ప్రారంభించగలిగానని, ఇప్పుడు అదే అవకాశాన్ని ఇతరులకు కల్పించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: కుప్పకూలిన బంగారం ధరలు.. ఒక్కరోజులోనే భారీగా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement