సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ పాలనలో కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోకుండా కేవలం ప్రచార ఆర్భాటాలు, వాగ్దానాలు, నిందారోపణలకే పరిమితమయ్యారని ఆరోపించారు.
గతేడాది ఏక్యూఐ కేంద్రాల చుట్టూ నీటిని స్ప్రే చేయగా ఈసారి 36 కేంద్రాల్లో పీఎం2.5 రీడింగ్స్ కనిపించకుండా పోయాయని ఆయన విమర్శించారు. 2019లోనే వాయు కాలుష్యాన్ని ప్రధాన సవాలుగా ప్రధాని మోదీ పేర్కొన్నారనీ, అయితే తన 12 ఏళ్ల పాలనలో ఆశించిన చర్యలు మాత్రం లేవన్నారు.
ఢిల్లీలో 2023లో కాలుష్యం కారణంగా ఏకంగా 17,188 మంది మరణించారని, అంతకుముందు 2021లో ఐదేళ్లలోపు పిల్లల్లో 1.69 లక్షల మరణాలు నమోదయ్యాయని గణాంకాలను ప్రస్తావించారు. అంతేకాదు ఢిల్లీలో క్లీన్ ఎయిర్ నిధుల్లో రూ.1,154 కోట్లు ఖర్చు చేయలేదని, అందులో కేవలం 17 శాతం నిధులే వినియోగించారని ఖర్గే పేర్కొన్నారు.
కాగా నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేసి, కాలుష్య ఉద్గారాలను తగ్గించడంతో పాటు నిబంధనలను కూడా కఠినంగా అమలు చేయాలని ఖర్గే డిమాండ్ చేశారు. స్వచ్ఛమైన గాలి ప్రజల ప్రాథమిక హక్కు అని, అది ఎవరో ఇచ్చే వరం కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని మోదీ కాలుష్యంపై ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: రాజీవ్‌ను వేడుకున్నా.. కానీ రాహుల్‌ను అడ్డుకోలేదు: సోనియా


