ఢిల్లీని కమ్మేసిన కాలుష్య మేఘం  | Delhi recorded highest AQI Delhi has crossed 1700 plus AQI level | Sakshi
Sakshi News home page

ఢిల్లీని కమ్మేసిన కాలుష్య మేఘం 

Nov 10 2026 5:21 AM | Updated on Nov 10 2026 5:21 AM

Delhi recorded highest AQI Delhi has crossed 1700 plus AQI level

దీపావళి రోజు ఏకంగా 1,760కి చేరిన ఏక్యూఐ  

పంజాబ్‌లో ఒక్కరోజే 1,152 పంట వ్యర్థాల దహనం 

గణాంకాలతో ప్రభుత్వం మోసం చేస్తోందంటూ కాంగ్రెస్, ఆప్‌ ఆరోపణలు

ఆప్‌ నేతలే పంటలకు నిప్పంటించారంటూ బీజేపీ ఎదురుదాడి 

ప్రభుత్వ సైట్‌లో మాత్రం 400 దాటని ఏక్యూఐ

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీపావళి పండుగ వేళ నగరాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. పలు చోట్ల వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 400 మార్కును దాటేసింది. స్వచ్ఛమైన గాలి లభించక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

ఆదివారం దీపావళి పండుగ ఒక్కరోజే ఏక్యూఐ 1,760గా నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మరోవైపు కాలుష్య నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యం, ఏక్యూఐ గణాంకాల వెల్లడిలో అవకతవకలు, పంజాబ్‌లో పంట వ్యర్థాల దహనం వంటి అంశాలు రాజకీయ దుమారానికి దారితీశాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) మధ్య పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలతో కాలుష్య సమస్య రాజకీయ యుద్ధంగా మారింది. 

ఆదివారం రాత్రి నుంచి పెరిగిన ఏక్యూఐ 
ఆదివారం సాయంత్రం నుంచి ఢిల్లీ వ్యాప్తంగా బాణసంచా కాల్చడం నెమ్మదిగా ప్రారంభమైంది. రాత్రి 8 గంటల ప్రాంతంలో ఏక్యూఐ 460గా నమోదైంది. 9.30 గంటలకు ఏక్యూఐ 960కు చేరింది. 11 గంటలకు 1,552, 11.30 గంటలకు 1,686, అర్ధరాత్రి 12 గంటలకు 1,747, ఒంటిగంటకు 1,760 గా నమోదు అయింది. రాత్రి 12 గంటలకు వెయ్యి దాటిన ఏక్యూఐ ఉదయం 6 గంటల వరకు ఇదే స్థాయిలో కొనసాగడం ఢిల్లీ వాసులను భయాందోళనలకు గురి చేసింది. 

400 దాటని ఏక్యూఐ 
ఢిల్లీ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రం ఏక్యూఐ 400 దాటకపోవడం ఆశ్చర్యకరం. ఆదివారం రాత్రి 8గంటలకు 340గా నమోదైన ఏక్యూఐ, సోమవారం తెల్లవారుజాము 5గంటల వరకు 390 దాటకపోవడం విడ్డూరమంటూ సోషల్‌ మీడియాలో ప్రభుత్వంపై నెటిజన్లు వ్యంగ్యా్రస్తాలు సంధిస్తున్నారు. ఏక్యూఐ వెయ్యి దాటినా ప్రభుత్వ లెక్కల్లో మాత్రం 400 దాటకపోవడమేంటని ప్రతిపక్షాలు సైతం అగ్రహం వ్యక్తం చేశాయి 

గణాంకాలపై కాంగ్రెస్, ఆప్‌ అనుమానాలు 
కాలుష్య గణాంకాలు అందుబాటులో లేకపోవడంపై కాంగ్రెస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తెల్లవారుజామున 2–3 గంటల మధ్య ఢిల్లీలోని 39 పర్యవేక్షణ కేంద్రాలకు గాను 25 కేంద్రాల నుంచి పీఎం 2.5 గణాంకాలు అందుబాటులో లేకపోవడంపై కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి పవన్‌ ఖేరా అనుమానం వ్యక్తం చేశారు. ‘కాలుష్య తీవ్రతను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దాచిపెడుతోందా? పర్యవేక్షణ పరికరాలను కావాలనే నిలిపివేశారా? లేదా పరికరాలు కొలిచే సామర్థ్యాన్ని కూడా కాలుష్యం మించిపోయిందా? అని’ ప్రశ్నించారు. గణాంకాలు కనిపించకుండా పోయినంత మాత్రాన కాలుష్యం మాయమైపోదని ఆయన వ్యాఖ్యానించారు. ఆప్‌ నేత సౌరభ్‌ భరద్వాజ్‌ కూడా ఢిల్లీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. అధికారికంగా వెల్లడిస్తున్న ఏక్యూఐ గణాంకాలకు, క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులకు పొంతన లేదని ఆరోపించారు. 

పంజాబ్‌లో పంట వ్యర్థాలకు నిప్పు 
ఢిల్లీ కాలుష్యానికి పంజాబ్‌లో పంట వ్యర్థాలను తగులబెట్టడమే ప్రధాన కారణమని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. ఢిల్లీ మంత్రి, బీజేపీ నేత కపిల్‌ మిశ్రా ఈ అంశంపై ఆప్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. పంజాబ్‌లో పొలాల్లో వ్యర్థాలకు రాత్రివేళల్లో నిప్పు పెడుతున్నారంటూ ఫిర్యాదులు అందాయని వెల్లడించారు. ఈ ఘటనల వెనుక ఆప్‌ నేతల ప్రమేయం ఉందని, రైతులను, ఢిల్లీ ప్రజలను ఇబ్బందులకు గురిచేసే కుట్ర జరుగుతోందని మిశ్రా ఆరోపించారు.

ఒక్కరోజే పెరిగిన దహనాలు
పంజాబ్‌లో పంట వ్యర్థాల దహనానికి సంబంధించిన గణాంకాలు పరిస్థితి తీవ్రతను వెల్లడిస్తున్నాయి. నవంబర్‌ 8న ఒక్కరోజే 1,152 వ్యవసాయ క్షేత్రాల్లో మంటలు నమోదయ్యాయి. ప్రస్తుత సీజన్‌లో రోజువారీ అత్యధికం ఇదే. 7వ తేదీ వరకు రాష్ట్రంలో మొత్తం 3,307 అగి్నప్రమాద ఘటనలు నమోదయ్యాయి. గత ఏడాది ఇదే తేదీ వరకు నమోదైన 3,384 ఘటనలతో పోలిస్తే కొంత తక్కువే.

నిబంధనలు బేఖాతరు.. 
కాలుష్యంపై రాజకీయ వివాదం కొనసాగుతుండగానే ఢిల్లీలో దీపావళి రాత్రి పెద్ద ఎత్తున బాణసంచా కాల్చిపడేశారు. ముఖ్యంగా బురారీలో బాణసంచా మోతలు తీవ్రంగా వినిపించినట్లు స్థానికులు తెలిపారు. మయూర్‌ విహార్, ల్యూటెన్స్‌ ఢిల్లీలోని బిషంబర్‌ దాస్‌ మార్గ్‌ తదితర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నవంబర్‌ 7, 8 తేదీల్లో నిర్దిష్ట సమయాల్లో ధ్రువీకరించిన గ్రీన్‌ క్రాకర్స్‌ కాల్చేందుకు మాత్రమే అనుమతి ఉంది. ఆసుపత్రులు, నర్సింగ్‌ హోమ్‌లు, ఆరోగ్య కేంద్రాలు, వృద్ధాశ్రమాలు, విద్యాసంస్థలు, తదితర ప్రాంతాలకు 300 మీటర్ల పరిధిలో బాణసంచా కాల్చడాన్ని న్యాయస్థానం నిషేధించింది. సీఎస్‌ఐఆర్‌–నీరీ ధ్రువీకరించిన గ్రీన్‌ క్రాకర్స్‌ను కూడా ఢిల్లీ పోలీసుల పర్యవేక్షణలో నిర్దేశిత కేంద్రాల్లోనే విక్రయించాల్సి ఉంది. ఈ నిబంధనలు ఉన్నప్పటికీ బాణసంచా కాల్చడం యథేచ్ఛగా కొనసాగింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement