పాట్నా: బిహార్ రాజకీయాలు, వివాదాస్పదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ‘బాహుబలి’ నాయకుడు, ఎమ్మెల్యే అనంత్ సింగ్ ఇంట పెళ్లి సందడి షురూ అయింది. ఆయన కూతురు శివాంగి సింగ్ వివాహం అత్యంత వైభవంగా, భారీ ఏర్పాట్ల మధ్య నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వివాహ వేడుకకు వచ్చే అతిథుల సంఖ్య ఏకంగా నాలుగు లక్షలు దాటనుందని అంచనా వేస్తుండటంతో ఈ వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
అనంత్ సింగ్ చిన్న కుమార్తె శివాంగి సింగ్ వివాహం రిషికేష్ కుమార్‌తో నవంబర్ 25వ తేదీన జరగనుంది. వీరి వివాహం బిహార్‌లోని పాట్నా జిల్లాలోని వారి సొంత గ్రామమైన లద్మా (నద్వాన్) లో అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ పెళ్లి వేడుకల కోసం దాదాపు 10 బిగాల విశాలమైన స్థలంలో భారీ టెంట్లు, విదేశీ పూలతో కూడిన అలంకరణలు సిద్ధం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మౌ నుంచి ప్రత్యేకంగా వచ్చిన నిపుణులైన డిజైనర్లతో ఈ భారీ పందిళ్లను నిర్మిస్తున్నారు.
నాలుగు లక్షల మందికి భోజన ఏర్పాట్లు.. 150 రకాల వంటకాలు
ఈ పెళ్లి వేడుకకు వచ్చే అతిథుల కోసం భారీ స్థాయిలో భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. ఏకంగా 4 లక్షల మందికి పైగా అతిథులు హాజరవుతారని అంచనా వేస్తూ ఆ మేరకు ఏర్పాట్లు సాగుతున్నాయి. అతిథుల కోసం బిహారీ సాంప్రదాయ వంటకాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 150 రకాల రుచికరమైన వంటకాలు, ప్రసిద్ధ నలంద సిలావో ఖాజా వంటి ప్రత్యేక మిఠాయిలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
పీఎం మోదీ నుంచి లాలూ వరకు
ఈ వివాహ వేడుకను రాజకీయాలకు అతీతంగా నిర్వహించనున్నట్లు అనంత్ సింగ్ స్పష్టం చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వీ యాదవ్ వంటి దిగ్గజ రాజకీయ నాయకులందరికీ ఈ పెళ్లికి ఆహ్వానాలు పంపుతున్నట్లు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా, ఈ వివాహానికి భారత్ -పాకిస్థాన్ ఎక్కడి నుంచైనా సరే ఎవరైనా అతిథులుగా రావచ్చునని, అందరికీ సాదర స్వాగతం అని అనంత్ సింగ్ వ్యాఖ్యానించడం గమనార్హం.
సినీ తారలు దిగి వచ్చిన వేళ
రాజకీయ ప్రముఖులతో పాటు బాలీవుడ్, భోజ్‌పురి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సైతం ఈ వివాహ వేడుకలో సందడి చేయనున్నారు. భోజ్‌పురి సూపర్‌స్టార్ పవన్ సింగ్, అక్షరా సింగ్, మనోజ్ తివారీ, మోస్ట్ పాపులర్ సింగర్ మైథిలీ ఠాకూర్‌తో పాటు బాలీవుడ్ నటుడు సోనూ సూద్, ఉదిత్ నారాయణ్ తదితరులు ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉంది. అలాగే వివాహ వేడుకలో భాగంగా ప్రత్యేకంగా గుర్పు పందెం నిర్వహించనుండగా, విజేతలకు లగ్జరీ ఎస్‌యూవీ కార్లు, బైక్‌లను బహుమతులుగా ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
మరోవైపు, ఈ భారీ పెళ్లి వేడుకల వెనుక కొన్ని సీరియస్ లీగల్ సవాళ్లు కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కూతురి పెళ్లి ముగిసిన వెంటనే ఆయన కోర్టులో లొంగిపోవాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య జరుగుతున్న ఈ వెడ్డింగ్ బిహార్ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.


