ఐరాసలో స్పీచ్‌తో అదరగొట్టిన ఎంపీ తనూజా రాణి | UN Speech: MP Thanuja Rani Represents India at Key Fifth Committee Meeting | Sakshi
Sakshi News home page

ఐరాసలో స్పీచ్‌తో అదరగొట్టిన ఎంపీ తనూజా రాణి

Oct 6 2026 8:41 AM | Updated on Oct 6 2026 8:49 AM

UN Speech: MP Thanuja Rani Represents India at Key Fifth Committee Meeting

సాక్షి, న్యూఢిల్లీ: అరకు వైఎస్సార్‌సీపీ ఎంపీ డాక్టర్‌ గుమ్మ తనూజా రాణికి అంతర్జాతీయ వేదికపై అరుదైన అవకాశం లభించింది. ఐక్యరాజ్యసమితి (ఐరాస) 81వ సర్వసభ్య సమావేశంలో పాల్గొంటున్న భారత ఎంపీల బృందంలో సభ్యురాలిగా ఉన్న ఆమె.. ఐరాస పరిపాలనా, బడ్జెటరీ కమిటీ (ఫిఫ్త్‌ కమిటీ) తొలి అధికారిక సమావేశంలో భారత్‌ తరఫున ప్రసంగించారు. ‘పని సంస్థీకరణ’ (Organization of Work) అజెండా అంశంపై భారతదేశం తరఫున తనూజా రాణి అధికారిక ప్రకటన చేశారు.

ఐరాస 81వ సర్వసభ్య సమావేశం సందర్భంగా సంస్కరణల ఎజెండాను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని యువ ఎంపీ తనూజా రాణి ప్రస్తావించారు. ఐరాస పరిపాలనా, ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత, సమర్థత పెంచేలా సంస్కరణలు కొనసాగాలని సూచించారు. ఫిఫ్త్‌ కమిటీ పనితీరులో వివిధ ఐరాస సంస్థలు, సలహా కమిటీలకు ఉన్న ప్రత్యేక అధికారాలను గౌరవించడం కీలకమని పేర్కొన్నారు.

సభ్య దేశాలు చెల్లింపులు సకాలంలో చేయాలి
ఐరాస కార్యక్రమాలు, కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సభ్య దేశాల ఆర్థిక సహకారం అత్యంత కీలకమని ఆమె స్పష్టం చేశారు. అన్ని సభ్య దేశాలు తమపై విధించిన అసెస్డ్‌ కంట్రిబ్యూషన్లను పూర్తిగా, నిర్ణీత గడువులోగా, ఎలాంటి ముందస్తు షరతులు లేకుండా చెల్లించాలని భారత్‌ తరఫున కోరారు. ఐరాస ఆర్థిక స్థిరత్వానికి ఇది ఎంతో అవసరమని పేర్కొన్నారు.

అభివృద్ధి స్తంభానికి తగినన్ని నిధులు
ఐరాసలో అభివృద్ధి స్తంభానికి తగినన్ని ఆర్థిక వనరులు అందించాల్సిన అవసరాన్ని కూడా తనూజా రాణి ప్రస్తావించారు. ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కొరత లేకుండా చూడాలని సూచించారు. ఇందుకోసం ‘యూఎన్‌80 ఇనిషియేటివ్‌’ను సమర్థంగా ఉపయోగించుకుని ఐరాస అభివృద్ధి స్తంభాన్ని మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నారు.

ఏకాభిప్రాయానికే ప్రాధాన్యం
ఫిఫ్త్‌ కమిటీ చర్చలు, నిర్ణయాల్లో సాధ్యమైనంత వరకు ఏకాభిప్రాయ (కన్సెన్సస్‌) ఫలితాలకు ప్రాధాన్యం ఇవ్వాలని భారత్‌ అభిప్రాయాన్ని ఆమె వెల్లడించారు. సభ్య దేశాల మధ్య సమన్వయం, పరస్పర సహకారంతో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఐరాస పనితీరును మరింత సమర్థవంతంగా మార్చవచ్చని సూచించారు.

ఐరాస 81వ సర్వసభ్య సమావేశానికి భారత్‌ నుంచి 18 మంది ఎంపీల బృందం హాజరవుతోంది. ఆ బృందంలో భాగమైన తెలుగు ఎంపీ తనూజా రాణి.. ఫిఫ్త్‌ కమిటీ తొలి అధికారిక సమావేశంలోనే భారత్‌ తరఫున ప్రసంగించడం విశేషంగా నిలిచింది. పరిపాలన, బడ్జెట్‌, అభివృద్ధి అంశాలపై అంతర్జాతీయ వేదికపై భారత వైఖరిని ఆమె వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement