చమురు ధరల పెరుగుదలతో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ప్రజలకు తీవ్ర భారంగా మారాయి. దాయాది దేశం పాకిస్థాన్‌లో పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. దీంతో ఆ దేశ ప్రభుత్వం సామాన్య వాహనదారులకు ఊరటనిచ్చే నిర్ణయాన్ని అమలు చేస్తోంది.
ఇంధన ధరల పెరుగుదలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్యులకు ఊరట కల్పించేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రత్యేక పెట్రోల్ సబ్సిడీ పథకాన్ని అమలు చేస్తోంది. ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రారంభించిన ఈ ప్రధానమంత్రి స్పెషల్ ఫ్యూయల్ రిలీఫ్ స్కీమ్ కింద మోటార్‌సైకిళ్లు, ఆటో రిక్షాలు, చింగ్చీ (Qingqi) వాహనాలతో పాటు 800 సీసీ వరకు ఇంజిన్ సామర్థ్యం ఉన్న చిన్న కార్లకు రాయితీ అందుతోంది. ప్రపంచ మార్కెట్లలో చమురు ధరలు పెరగడం, పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో దేశీయంగా ఇంధన ధరలు భారమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది.
తాజా మార్పుల ప్రకారం మోటార్‌సైకిల్, ఆటో రిక్షా, చింగ్చీ వినియోగదారులకు వారానికి రూ.500 (పాకిస్థాన్ రూపాయలు) చొప్పున, నెలకు నాలుగు టోకెన్ల ద్వారా గరిష్ఠంగా రూ.2,000 వరకు ఇంధన ఉపశమనం లభిస్తుంది. తొలుత అమలు చేసిన 5 లీటర్ల కనీస పెట్రోల్ కొనుగోలు నిబంధనను ప్రభుత్వం తొలగించింది. అంటే తక్కువ పరిమాణంలో పెట్రోల్ కొనుగోలు చేసినా అర్హత ఉన్న వినియోగదారుడికి రూ.500 రాయితీ వర్తిస్తుంది. ఈ మార్పు ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా తీసుకున్నట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది.
800 సీసీ వరకు చిన్న కార్లకు మాత్రం వేరే విధానం కొనసాగుతోంది. ప్రతి పది రోజులకు 10 లీటర్ల పెట్రోల్‌పై లీటరుకు రూ.100 చొప్పున రాయితీ లభిస్తుంది. అంటే ఒక్క టోకెన్‌కు గరిష్ఠంగా రూ.1,000 వరకు ప్రయోజనం పొందవచ్చు. ప్రభుత్వం తొలుత ప్రకటించిన విధానంలో ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు నెలకు 20 లీటర్లు, 800 సీసీ వరకు కార్లకు నెలకు 30 లీటర్ల వరకు రూ.100 చొప్పున రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. అనంతరం వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని విధానంలో మార్పులు చేసింది.
20 ఏళ్ల వాహనాలకూ అర్హత
సబ్సిడీ పరిధిని ప్రభుత్వం మరింత విస్తరించింది. తొలుత పాత వాహనాలపై ఉన్న పరిమితిని సడలిస్తూ 2006 జనవరి 1 లేదా ఆ తర్వాత రిజిస్టర్ అయిన మోటార్‌సైకిళ్లు, రిక్షాలు, చింగ్చీ వాహనాలను కూడా పథకంలోకి తీసుకొచ్చింది. అంతేకాకుండా మోటార్‌సైకిల్, రిక్షా వినియోగదారులకు తప్పనిసరిగా వాహనం తమ పేరుమీదే ఉండాలన్న నిబంధనను కూడా తొలగించినట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో అద్దె వాహనాలను ఉపయోగించే అర్హులకూ ప్రయోజనం అందే అవకాశం ఏర్పడింది.
అర్హత కలిగిన వారు 9771 నంబర్‌కు ఎస్‌ఎంఎస్ ద్వారా ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. దరఖాస్తుదారుల జాతీయ గుర్తింపు కార్డు, వారి పేరుతో ఉన్న సిమ్, వాహన రిజిస్ట్రేషన్ వివరాలను డిజిటల్ వ్యవస్థ ద్వారా తనిఖీ చేస్తున్నారు. నకిలీ దరఖాస్తులు, ఒకే వ్యక్తి పేరుతో బహుళ క్లెయిమ్‌లను అడ్డుకోవడమే దీని ఉద్దేశం.
ఇప్పటికే 60 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు
పథకం అమలులోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే భారీ స్పందన వచ్చింది. సెప్టెంబర్ 25 నాటికి 58 లక్షలకు పైగా ప్రజలు నమోదు చేసుకోగా, సుమారు 61 లక్షల టోకెన్లు జారీ అయ్యాయి. 47 లక్షల మంది ఇప్పటికే ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం వెల్లడించింది. అనంతరం సెప్టెంబర్ 27 నాటికి రిజిస్ట్రేషన్లు 60 లక్షలు దాటినట్లు పెట్రోలియం శాఖ మంత్రి తెలిపారు.
ఇదిలా ఉండగా, పాకిస్థాన్‌లో అక్టోబర్ ప్రారంభంలో పెట్రోల్ ధరలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాల ఆధారంగా అక్టోబర్ 1 నుంచి పెట్రోల్ ధర లీటరుకు రూ.387.40గా నిర్ణయించారు. అయితే అక్టోబర్ 6 నుంచి మరోసారి లీటరుకు రూ.0.88 పెంచినట్లు తాజా సమాచారం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇంధన ధరల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న సబ్సిడీ పథకం సామాన్య వాహనదారులకు కీలక ఉపశమనంగా మారింది.


