అస్సాం నుంచి వంతారాకు ఏనుగు కూన ‘రాజా’ ఎయిర్‌లిఫ్ట్‌ | Vantara Assam Elephant Calf Raja Critical Condition Air Ambulance | Sakshi
Sakshi News home page

అస్సాం నుంచి వంతారాకు ఏనుగు కూన ‘రాజా’ ఎయిర్‌లిఫ్ట్‌

Nov 20 2026 5:03 PM | Updated on Nov 20 2026 5:18 PM

Vantara Assam Elephant Calf Raja Critical Condition Air Ambulance

పుట్టిన కొద్దిసేపటికే తీవ్ర గాయాలపాలై, ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న నెలన్నర వయసున్న ఏనుగు కూన ‘రాజా’ను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్‌ ప్రారంభమైంది. అస్సాం నుంచి గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న వంతారా వన్యప్రాణి సంరక్షణ, పునరావాస కేంద్రానికి రాజాను ప్రత్యేక చార్టర్డ్‌ విమానంలో తరలించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వంతారా వ్యవస్థాపకుడు అనంత్‌ అంబానీ ప్రత్యేక చొరవతో ఈ అత్యవసర ఎయిర్‌లిఫ్ట్‌ ప్రక్రియను చేపట్టారు.

పుట్టిన వెంటనే తీవ్ర గాయాలు

2026 అక్టోబరు 2న అస్సాంలోని గోగాముఖ్‌ ప్రాంతంలో మఖోని అనే 11 ఏళ్ల ఏనుగుకు రాజా జన్మించాడు. అయితే ప్రసవానంతరం భయాందోళనకు గురైన తల్లి ఏనుగు, అప్పుడే పుట్టిన పిల్లను కాలితో బలంగా తన్నడంతో రాజా కుడి వెనుక కాలులోని తొడ ఎముక (ఫీమర్‌) పూర్తిగా విరిగిపోయింది. దీంతో పుట్టినప్పటి నుంచే రాజా కనీసం నిలబడలేకపోయాడు.

సంక్లిష్టంగా మారిన ఆరోగ్య పరిస్థితి

సంరక్షకుల సమాచారంతో అక్టోబరు 8న రంగంలోకి దిగిన వంతారా ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ బృందం.. ఎక్స్‌రే పరీక్షల ద్వారా తొడ ఎముక ఫ్రాక్చర్‌ను నిర్ధారించింది. ప్లాస్టర్‌ కాస్ట్‌ వేసి అక్టోబరు 10న పొహుమారాలోని యజమాని నివాసానికి తరలించి ప్రత్యేక హైడ్రోథెరపీ ద్వారా చికిత్స అందించింది. అయినప్పటికీ, రోగనిరోధక శక్తి లేకపోవడం వల్ల రాజా ఆరోగ్యం మరింత క్షీణించింది. తీవ్రమైన విరేచనాలు, ప్రాణాంతక క్లెబ్సియెల్లా న్యుమోనియే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్‌తో పాటు తరచూ రక్తంలో చక్కెర స్థాయులు పడిపోవడం (హైపోగ్లైసీమియా) వైద్యులను ఆందోళనకు గురిచేసింది. కాలేయ సూచికలు పెరగడం, ఎక్కువసేపు ఒకే వైపు పడుకోవడం వల్ల తల భాగంలో ఒత్తిడి గాయాలు ఏర్పడటం, బొడ్డు హెర్నియా వంటి సమస్యలు తోడవడంతో మెరుగైన వైద్యం కోసం జామ్‌నగర్‌ తరలించాలని వైద్య బృందం నిర్ణయించింది.

నాలుగు గంటల ప్రయాణం

గువాహటి నుంచి జామ్‌నగర్‌కు రోడ్డు మార్గంలో 2,500 కిలోమీటర్లకు పైగా ప్రయాణించడం రాజా ప్రాణాలకు ప్రమాదకరం కావడంతో సుమారు నాలుగు గంటల్లో గమ్యస్థానానికి చేర్చే ప్రత్యేక విమానాన్ని సిద్ధం చేశారు. ప్రయాణ సమయంలో గాయపడిన కాలిపై ఒత్తిడి పడకుండా ప్రత్యేక రవాణా పెట్టె, మెత్తటి పరుపు, సపోర్ట్‌ సిస్టమ్‌ను అమర్చారు. వెటర్నరీ నిపుణుల బృందం ప్రయాణమంతా రాజా శారీరక సూచికలను పర్యవేక్షించనుంది.

భారత్‌లో ఇది మూడో అతిపెద్ద ఆపరేషన్‌

అనంత్‌ అంబానీ సహకారంతో దేశంలో చేపడుతున్న అత్యవసర సహాయం కోసం ఉన్న ఏనుగుల ఎయిర్‌లిఫ్ట్‌ ఆపరేషన్లలో ఇది మూడోది కావడం విశేషం. జామ్‌నగర్‌లోని వంతారా ప్రత్యేక ఏనుగుల ఆసుపత్రికి చేరుకున్న తర్వాత రాజాకు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించి ఆర్థోపెడిక్‌ చికిత్స, నొప్పి నివారణ, ప్రత్యేక పోషకాహారం అందించనున్నారు. గాయాల తీవ్రత దృష్ట్యా రాజాకు దీర్ఘకాలికంగా, అవసరమైతే జీవితాంతం వైద్య పర్యవేక్షణ అవసరమయ్యే అవకాశం ఉందని వంతారా వెల్లడించింది.

 

ఇదీ చదవండి: ఒక్కరోజే రూ.4 లక్షల కోట్ల లాభం.. కారణాలు..

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement