దేశ ఆర్థిక వ్యవస్థలో వినియోగ ఆధారిత వృద్ధికి వివాహ వేడుకలు ప్రధాన చోదకశక్తిగా నిలుస్తున్నాయి. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 15, 2026 వరకు కేవలం 25 రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా సుమారు 52 లక్షల వివాహాలు జరగనున్నాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) అంచనా వేసింది. ఈ సీజన్ ద్వారా సుమారు రూ.7.5 లక్షల కోట్ల వ్యాపార కార్యకలాపాలు చోటుచేసుకోనున్నాయి. సగటున రోజుకు రెండు లక్షలకు పైగా వివాహాలు జరగనుండటంతో రిటైల్, సేవా రంగాల్లో మునుపెన్నడూ లేని సందడి నెలకొంది.
వస్తువుల కొనుగోళ్లదే సింహభాగం
సీఏఐటీ గణాంకాల ప్రకారం మొత్తం రూ.7.5 లక్షల కోట్ల వ్యాపారంలో వస్తువుల విక్రయాల వాటా 54 శాతంగా (రూ.4.05 లక్షల కోట్లు), సేవల రంగం వాటా 46 శాతంగా (రూ.3.45 లక్షల కోట్లు) ఉండనుంది. విభాగాల వారీగా అంచనాలు ఇలా ఉన్నాయి:
| వ్యాపార విభాగం | అంచనా విలువ (రూ. కోట్లలో) |
|---|---|
| బంగారం, ఆభరణాలు | 1,20,000 |
| వస్త్రాలు, చీరలు, దుస్తులు | 90,000 |
| క్యాటరింగ్, ఆహార సరఫరా | 75,000 |
| వివాహ మండపాలు, హోటళ్లు | 60,000 |
| ఈవెంట్ మేనేజ్‌మెంట్, ప్లానింగ్ | 37,500 |
| పూల అలంకరణలు, డెకరేషన్ | 37,500 |
| పెళ్లి కానుకలు, ఉపకరణాలు | 37,500 |
| కిరాణా, ఆహార పదార్థాలు | 37,500 |
| ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, స్వీట్లు, డ్రైఫ్రూట్స్ (ఒక్కొక్కటి) | 30,000 |
| ప్రయాణం, రవాణా, వినోదం (ఒక్కొక్కటి) | 30,000 |
| ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, బ్యూటీ సేవలు (ఒక్కొక్కటి) | 22,500 |
1.25 కోట్ల మందికి ఉపాధి
ప్రాంతీయంగా చూస్తే ఒక్క ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలోనే సుమారు 5 లక్షల వివాహాల ద్వారా రూ.2.5 లక్షల కోట్ల వ్యాపారం జరగనుంది. చాందినీ చౌక్, సదర్ బజార్, కరోల్ బాగ్ వంటి మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. మరోవైపు, ఈ 25 రోజుల్లో క్యాటరర్లు, డెకరేటర్లు, ఫొటోగ్రాఫర్లు, మేకప్ ఆర్టిస్టులు, రవాణా సిబ్బంది రూపంలో దేశవ్యాప్తంగా 1.25 కోట్ల తాత్కాలిక, సీజనల్ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
నాలుగేళ్లలో రెట్టింపైన మార్కెట్ విస్తరణ
2022లో 32 లక్షల వివాహాలతో రూ.3.75 లక్షల కోట్లుగా ఉన్న మార్కెట్ అంచనా, 2026 నాటికి 52 లక్షల వివాహాలతో రూ.7.50 లక్షల కోట్లకు చేరడం గమనార్హం. 2023లో రూ.4.74 లక్షల కోట్లు, 2024లో రూ.5.90 లక్షల కోట్లు, 2025లో రూ.6.50 లక్షల కోట్లుగా నమోదైన ఈ వృద్ధి, వివాహాల సంఖ్యతో పాటు పెరిగిన వ్యయ సామర్థ్యాన్ని సూచిస్తోంది.
డిజిటల్ బాటలో పెళ్లిళ్లు..
ప్రస్తుత సీజన్‌లో సంప్రదాయ కొనుగోళ్లతో పాటు ఏఐ ఆధారిత వెడ్డింగ్ ప్లానింగ్, డిజిటల్ ఆహ్వానాలు, వ్యక్తిగత కానుకల తయారీ వంటి ఆధునిక ధోరణులు ఎంఎస్‌ఎంఈ రంగానికి కొత్త ఊపిరి పోస్తున్నాయి. అయితే, ఈ రూ.7.5 లక్షల కోట్ల అంచనా కేవలం వాణిజ్య కార్యకలాపాల విలువ మాత్రమేనని, దీన్ని నేరుగా జీడీపీకి అదనపు చేరికగా కాకుండా దేశీయ వినియోగ సామర్థ్యానికి, స్థానిక తయారీ రంగానికి లభించే ఉద్దీపనగా ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇదీ చదవండి: ‘ప్రైవేటు బైక్ ట్యాక్సీకి అనుమతులివ్వండి’


