వీడ్కోలు చెప్పేందుకు రైలెక్కి రూ.36 వేల జరిమానా కట్టారు! | 13 Relatives Accidentally Trapped In Vande Bharat Express After Doors Close, Rs 36,140 Fine Imposed, Check More Details Inside | Sakshi
Sakshi News home page

వీడ్కోలు చెప్పేందుకు రైలెక్కి రూ.36 వేల జరిమానా కట్టారు!

Nov 20 2026 3:43 PM | Updated on Nov 20 2026 4:24 PM

indian railway Vande Bharat 13 Relatives Board Train and Fined full details

ఆత్మీయులకు రైల్వే స్టేషన్‌లో వీడ్కోలు పలకడానికి వెళ్లిన బంధువులకు చేదు అనుభవం ఎదురైంది. సామాన్లు సర్దిపెట్టి, రైలు కదిలేలోపు కిందకు దిగిపోవచ్చనుకున్న వారి అంచనా తలకిందులైంది. ఆధునిక సౌకర్యాలు కలిగిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లోని ఆటోమేటిక్ డోర్లు మూసుకుపోవడంతో 13 మంది అనుకోకుండా రైలులోనే ఉండిపోవాల్సి వచ్చింది. చెల్లుబాటు అయ్యే టికెట్లు లేకుండా ప్రయాణించినందుకు రైల్వే అధికారులు వారి నుంచి ఏకంగా రూ.36,140 జరిమానా వసూలు చేశారు.

కాన్పూర్‌లో మొదలై..

ఈ ఘటన నవంబర్ 15న కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. వారణాసి–న్యూఢిల్లీ మధ్య రాకపోకలు సాగించే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 22415) ఉదయం 9.26 గంటలకు కాన్పూర్ స్టేషన్‌కు చేరుకుంది. కేవలం నాలుగు నిమిషాల విరామం అనంతరం 9.30 గంటలకు తిరిగి బయలుదేరేందుకు సిద్ధమైంది. తమ కుటుంబ సభ్యులను సాగనంపేందుకు వచ్చిన 13 మంది బంధువులు (12 మంది పెద్దలు, ఒక చిన్నారి) లగేజీని భద్రపరిచేందుకు బోగీలోకి ఎక్కారు.

అయితే, సమయం మించిపోవడంతో వారు తిరిగి ప్లాట్‌ఫామ్‌పైకి దిగలేకపోయారు. భద్రతా కారణాలతో ఈ రైలులో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్ వ్యవస్థ పనిచేయడంతో తలుపులు పూర్తిగా మూసుకుపోయాయి. రైలు కదిలిన వెంటనే ఆందోళనకు గురైన కొందరు అత్యవసర అలారం చైన్ లాగేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో కాన్పూర్ నుంచి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇటావా జంక్షన్ వరకు ప్రయాణించారు.

కంట్రోల్ రూమ్ ఆదేశాలతో తనిఖీలు

బోగీలో టికెట్లు లేని వ్యక్తులు ఉన్నట్లు సిబ్బంది గుర్తించి వెంటనే టుండ్లా కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. కంట్రోల్ రూమ్ ఆదేశాల మేరకు ఇటావా జంక్షన్‌లో రైలుకు హాల్టింగ్‌ ఇచ్చారు. అక్కడ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్), ప్రభుత్వ రైల్వే పోలీసు (జీఆర్పీ), టికెట్ తనిఖీ అధికారులు సంయుక్తంగా విచారణ చేపట్టారు. ఈ ఘటనపై నార్త్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వో డాక్టర్ శివమ్ శర్మ స్పందిస్తూ వీరిని అనధికార ప్రయాణికులుగా పరిగణించినట్లు తెలిపారు. ప్రయాణ ఛార్జీలు, నిబంధనల ప్రకారం విధించే అదనపు జరిమానా కలిపి మొత్తం రూ.36,140 వసూలు చేసినట్లు వెల్లడించారు.

చట్టం ఏం చెబుతోంది?

రైల్వే నిబంధనల పట్ల ప్రయాణికుల్లో అవగాహన లేకపోవడమే ఇటువంటి ఇబ్బందులకు ప్రధాన కారణమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. భారతీయ రైల్వే చట్టం–1989లోని కీలక నిబంధనలు ప్రయాణికులకు హెచ్చరికలు చేస్తున్నాయి.

సెక్షన్ 55: సరైన ప్రయాణ టికెట్, పాస్ లేదా అధికారం కలిగిన రైల్వే ఉద్యోగి అనుమతి లేకుండా ఎవరూ రైలు బోగీలోకి ప్రవేశించకూడదు.

సెక్షన్ 138: టికెట్ లేకుండా ప్రయాణించే వారి నుంచి ప్రయాణ దూరానికి వర్తించే సాధారణ ఛార్జీతో పాటు, దానికి సమానమైన మొత్తం లేదా కనీసం రూ.250 (ఏది ఎక్కువైతే అది) అదనపు ఛార్జీగా వసూలు చేస్తారు. జరిమానా చెల్లించడానికి నిరాకరిస్తే న్యాయస్థానం ద్వారా వసూలు చేసే అధికారం రైల్వే శాఖకు ఉంది.

కమర్షియల్ మాన్యువల్ నిబంధన 302: కేవలం ప్లాట్‌ఫామ్ టికెట్ లేదా పాస్ ఉన్నంత మాత్రాన రైలు బోగీలోకి ప్రవేశించే హక్కు ఉండదు. ప్లాట్‌ఫామ్ టికెట్ కేవలం స్టేషన్ ఆవరణలో ఉండటానికి మాత్రమే పరిమితం.

ప్రయాణికులకు కీలక సూచనలు

వందేభారత్, తేజస్ వంటి ఆధునిక సెమీ-హైస్పీడ్ రైళ్లలో తలుపులు ఆటోమేటిక్‌గా తెరుచుకుని, మూసుకుంటాయి. రైలు బయలుదేరడానికి కొన్ని క్షణాల ముందే డోర్లు లాక్ అవుతాయి. కదులుతున్న రైలులో తలుపులను బలవంతంగా తెరిచే ప్రయత్నం చేయడం ప్రాణాపాయానికి దారితీస్తుంది. కాబట్టి ఆత్మీయులకు వీడ్కోలు పలికేవారు ప్లాట్‌ఫామ్ టికెట్ తీసుకుని, ప్లాట్‌ఫామ్ పైనుంచే సామాన్లు అందించాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ బోగీల్లోకి అడుగుపెట్టకూడదు.

ఇదీ చదవండి: 25 రోజుల్లో 52 లక్షల పెళ్లిళ్లు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement