ట్రైన్‌లో సీట్లు బ్లూ కలర్‌లోనే ఎందుకు ఉంటాయి? | Why are seats on trains blue in color | Sakshi
Sakshi News home page

ట్రైన్‌లో సీట్లు బ్లూ కలర్‌లోనే ఎందుకు ఉంటాయి?

Nov 16 2026 3:38 PM | Updated on Nov 16 2026 3:54 PM

Why are seats on trains blue in color

మనలో చాలా మంది ట్రైన్‌ లో ప్రయాణించినప్పుడు సీట్లు అన్నీ బ్లూ కలర్‌ లో ఉండటాన్ని గమనించే ఉంటాం. ఎక్కువగా జనరల్, స్లీపర్‌ కోచ్‌ లలో సీట్లు, బెర్త్‌ లు ముదురు నీలం రంగులోనే ఉంటాయి. ఎరుపు, పసుపు లాంటి పాపులర్‌ కలర్స్‌ ఉండగా, బ్లూ కలర్‌ నే ఎందుకు ఎంచుకున్నారో తెలుసా?! నిజానికి ఇది యాదృచ్ఛికంగా ఎంచుకున్న రంగు కాదు. దీని వెనక చాలా ఇంట్రెస్టింగ్‌ కారణాలు ఉన్నాయి.

1. మనసుకు ప్రశాంతతనిచ్చే రంగు: కలర్‌ సైకాలజీ ప్రకారం బ్లూ కలర్‌ ప్రశాంతతకు, నమ్మకానికి, స్థిరత్వానికి ప్రతీక. ఆకాశం, సముద్రం లాంటివి సహజంగానే నీలం రంగులో ఉండి మనసుకు హాయినిస్తాయి. భారతదేశంలో రైలు ప్రయాణాలు 15 నుండి 30 గంటల వరకు సాగుతాయి. అంతసేపు ఒకే కోచ్‌ లో ఉండే ప్రయాణికుల కళ్ళకు ఇబ్బంది కలగకుండా, ఒత్తిడి తగ్గించడానికి బ్లూ కలర్‌ పర్ఫెక్ట్‌ ఛాయిస్‌.

2. మరకలు త్వరగా కనిపించవు: ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు రైళ్లను ఉపయోగిస్తారు. తినడం, కూర్చోవడం, లగేజీ పెట్టడం వల్ల దుమ్ము, చిన్న చిన్న మరకలు పడటం సహజం. లైట్‌ కలర్స్‌ అయితే ఆ మరకలు వెంటనే కనిపిస్తాయి. ముదురు నీలం రంగు అయితే దుమ్ము, మరకలు త్వరగా కనిపించవు. దీనివల్ల శుభ్రం చేయడం సులభం, నిర్వహణ ఖర్చు కూడా తక్కువ.

3. చరిత్రలో రంగు మార్పు: పాత సినిమాల్లో చూస్తే రైలు పెట్టెలు గోధుమ, మెరూన్‌ రంగులో ఉండేవి. 1960లలో, ఆ తర్వాత 90వ దశకంలో ఎయిర్‌ బ్రేక్‌ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆధునికీకరణలో భాగంగా ఐసీఎఫ్‌ కోచ్‌లకు నీలం రంగును తీసుకువచ్చారు. సాధారణంగా నీలం రంగు కోచ్‌ లు గంటకు 70 నుండి 140 కి.మీ వేగంతో వెళ్లే స్టాండర్డ్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైళ్లు.

అన్ని రైళ్లలో బ్లూ సీట్లు ఉండవు: నీలం రంగు సీట్లు అన్ని కోచ్‌లలో కనిపించవు. ఇవి ఎక్కువగా పాత ఐసీఎఫ్‌ కోచ్‌ లలోనే ఉంటాయి. ఆధునిక ఎల్‌హెచ్‌పీ కోచ్‌లు, వందే భారత్‌ వంటి కొత్త రైళ్లలో ఎరుపు, నారింజ, బూడిద రంగు సీట్లు ఉంటాయి. అలాగే ఏసి కోచ్‌ లలో క్లాస్‌ ను బట్టి వేర్వేరు రంగులు వాడతారు. సో, మీ ప్రయాణంలో ట్రైన్‌ ఎక్కగానే బ్లూ సీటు కనిపిస్తే, అది కేవలం రంగు మాత్రమే కాదు, దాని వెనక ఒక కారణం, ఒక హిస్టరీ ఉందని గుర్తుంచుకోండి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement