కార్తీక మాసమంటే శివుడికి అత్యంత ఇష్టమైనదిగా చెబుతారు. ప్రతి రోజూ ఒక పండుగలా ఉండే ఈ మాసంలో చల్లని గాలులతో మొదలయ్యే ఉదయం, మనసును ప్రశాంతంగా మార్చే సాయంత్రాలు అర్చకుల మంత్రోచ్ఛారణలు, గుడి గంటల శబ్దాలు...
ఇవన్నీ మనల్ని ఒక ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ఈ మాసంలో మహాదేవుడి దర్శనం కోసం చాలా మంది వివిధ ఆలయాలను సందర్శిస్తుంటారు. ఈసారి యాత్రలో మనం కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ తీరాల వైపు వెళ్లి .. అక్కడి శివుని రూపాలను దర్శించుకుందాం..
మురుడేశ్వర్
కర్ణాటకలోని మురుడేశ్వర్ ఆలయంలో సముద్ర తీరంలో పద్మాసనంలో కూర్చుని ఉన్న మహా శివుడిని దర్శించుకోవచ్చు. ప్రపంచంలో రెండవ ఎత్తౌన శివ విగ్రహం ఇదే. సముద్ర తీరం నుంచి గుడి గోపురాన్ని చూస్తే ఆధ్యాత్మిక భావంతో పాటు ఆశ్చర్యం కూడా కలుగుతుంది.
శివోహం
ఈ ప్రయాణాన్ని బెంగళూరులోని ‘శివోహం’ శివాలయంతో మొదలుపెట్టవచ్చు. ఈ ఆలయ నిర్మాణం ఆధునికంగా ఉన్నా, లోపలికి ప్రవేశించగానే ఒక రకమైన ప్రశాంతత లభిస్తుంది. పాలరాతి రంగులో తెల్లగా మెరిసే 65 అడుగుల శివుడు, వెనుక కైలాస పర్వతాల నేపథ్యం మనల్ని కదలకుండా చేస్తాయి. కార్తీక దీపాల వెలుగులో ఈ గుడి మరింత అందంగా కనిపిస్తుంది.
ఆళిమల
కేరళలోని ఆళిమల ఆలయం అరేబియా సముద్ర తీరాన, బీచ్ పక్కన ఉన్న కొండపై ఉంది. కొండ మీద నిలబడితే అరేబియా సముద్రం కనిపిస్తుంది. ఇక్కడ 58 అడుగుల గంగాధరేశ్వర రూపంలో ఉన్న శివుని విగ్రహాన్ని సూర్యాస్తమయంలో చూడటానికి చాలా మంది వస్తుంటారు.
త్రయంబకేశ్వర్
తెలుగు రాష్ట్రాల నుంచి మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ ఆలయానికి వెళ్లే భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ ఆలయం కార్తీక మాసంలో భక్తులతో కిటకిటలాడుతుంది. బ్రహ్మగిరి పర్వతాల మధ్య ఉన్న ఆలయాన్ని, ఆలయ శిల్పకళా వైభవాన్ని చూడటం మరచి΄ోలేని అనుభూతిగా మిగిలి΄ోతుంది. కార్తీక మాసంలో ఇక్కడి హారతి చూడటం అదృష్టంగా భావిస్తారు.
ఎక్కడ ఉండాలి?
మీరు అన్ని ఆలయాలను కవర్ చేసినా, లేదా ఒక్క గుడికే వెళ్లినా, బస కోసం చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఆలయాలే. బెంగళూరులో గుడికి దగ్గరలో ఉన్న
బొటిక్ స్టేలలో ఉంటే ఉదయం గుడి గంటల శబ్దంతో మేల్కోవచ్చు. కోయంబత్తూరులో ఈషా యోగా సెంటర్ దగ్గర ఉన్న కాటేజీలలో బస చేయడానికి చాలా మంది ఇష్టపడతారు.
త్రయంబకేశ్వర్ లో బ్రహ్మగిరి కొండ కనిపించేలా ఒక చిన్న హోమ్ స్టేను ఎంచుకోవాలి. ఉదయం మంచులో గుడి గోపురాన్ని చూడవచ్చు. ఆళిమలలో కొండ అంచున ఉన్న రిసార్ట్స్ నుంచి సముద్రాన్ని చూస్తూ రిలాక్స్ అవ్వడాన్ని చాలా మంది ఇష్టపడతారు. మురుడేశ్వర్ లో బీచ్ కు దగ్గరలో ఉన్న రూమ్స్‌లో అలల సవ్వడి వింటూ నిద్రపోవడం చాలా బాగుంటుంది.
ఎలా వెళ్లాలి?
హైదరాబాద్ నుంచి ఈ యాత్ర మొదలుపెడితే, ఒక మంచి సర్క్యూట్ లా ప్లాన్ చేయవచ్చు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు డైరెక్ట్ ఫ్లైట్ ఉంటుంది. గంటన్నరలో చేరుకోవచ్చు. రైలులో వెళితే రాత్రి ప్రయాణం చేసి ఉదయానికి బెంగళూరు చేరుకోవచ్చు. బెంగళూరులో శివోహం దర్శనం తర్వాత, రోడ్డు మార్గంలో కోయంబత్తూరు వెళ్లవచ్చు. దారి పొడవునా పచ్చని పొలాలు, చిన్న చిన్న ఊర్లు కనిపిస్తాయి.
విజయవాడ నుంచి ప్లాన్ చేస్తే కూడా బెంగళూరుకు డైరెక్ట్ ట్రైన్లు, విమానాలు ఉన్నాయి. రోడ్డు మార్గంలో వెళ్లాలనుకుంటే గుంటూరు, ఒంగోలు మీదుగా ΄్లాన్ చేసుకోవచ్చు. మంచి హైవే ట్రిప్ చేసినట్లు కూడా ఉంటుంది.
కోయంబత్తూరు నుంచి మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్‌కు వెళ్లాలంటే ఫ్లైట్‌లో ముంబై వెళ్లి అక్కడి నుంచి నాసిక్ చేరుకోవచ్చు. కేరళలోని ఆళిమల కోసం త్రివేండ్రం చేరుకుని, అక్కడి నుంచి కోస్టల్ రోడ్డులో వెళితే సముద్రపు గాలి మనతో పాటు ప్రయాణిస్తున్నట్లు అనిపిస్తుంది. ఇక మురుడేశ్వర్ కు మంగళూరు మీదుగా వెళ్లడం సులభం.
ఏం తినాలి?
ప్రయాణాల్లో స్థానిక భోజనాన్ని ఆస్వాదించడం కూడా ఒక భాగమే. బెంగళూరులో గుడి దగ్గర దొరికే బిసిబేలే బాత్, ఫిల్టర్ కాఫీని ఎంజాయ్ చేయవచ్చు. కోయంబత్తూరులో వాజ ఇలైలో అంటే అరటి ఆకులో వడ్డించే భోజనాన్ని నెయ్యితో కలిపి ఆస్వాదించవచ్చు.
నాసిక్, త్రయంబకేశ్వర్ లో మహారాష్ట్రీయన్ థాలీ, జొవార్ భాక్రీ, థెచా, సబుదానా కిచిడీ తినవచ్చు. కార్తీక మాసంలో ఉపవాసం ఉన్నవారికి కొన్ని ఆలయాల్లో ఫలాహారంగా కూడా ఇస్తారు. అయితే దానిపై గ్యారంటీ చెప్పలేము.
కేరళలోని ఆళిమల దగ్గర అప్పం, స్ట్యూ దొరుకుతాయి. అప్పం అంటే బియ్యం పిండితో చేసిన మెత్తటి అట్టు లాంటిది, పైన పొంగినట్లు ఉంటుంది. కొబ్బరి పాలతో చేసిన కూర అయిన స్ట్యూతో తింటారు. స్ట్యూ అంటే మన వెజ్ కుర్మా లాంటిదే కానీ కారం తక్కువ, కొబ్బరి పాల రుచి ఎక్కువ. అలాగే కప్ప, వెజ్ సద్య కూడా దొరుకుతుంది.
మురుడేశ్వర్ లో నీర్ దోస తినవచ్చు. ఇది చాలా పలుచగా, మెత్తగా, జాలీలా ఉంటుంది. కొబ్బరి చట్నీతో బాగుంటుంది. మంగళూరు బనానాస్ అంటే అరటి పండుతో చేసిన తియ్యటి పూరీ లాంటివి. మైదా, అరటిపండు కలిపి ఫ్రై చేస్తారు. పైన ఉబ్బి వస్తుంది, కొబ్బరి చట్నీతో తింటే చాలా బాగుంటుంది.
ఆసక్తికరమైన విషయాలు
కార్తీక మాసంలో శివుడికి దీ΄ారాధన అత్యంత ఇష్టమైన ఆధ్యాత్మిక ఆచారంగా కొనసాగుతోంది. ఈ నెలంతా గుడిలో దీపాలు వెలిగిస్తారు.
త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం మహారాష్ట్రలో గోదావరి పుట్టిన చోటికి దగ్గరలో ఉంది.
ఆదియోగి విగ్రహం 112 అడుగులు ఉంటుంది. యోగ సంప్రదాయంలో మోక్షానికి ఉన్న 112 మార్గాలకు ప్రతీకగా ఈ ఎత్తును నిర్మించారు.
ఆళిమల గుడి సముద్ర తీరంపై ఉన్న కొండ అంచు మీద ఉన్న అందమైన దేవాలయం.
మురుడేశ్వర్ లో ఉన్న శివ విగ్రహం ప్రపంచంలో రెండవ ఎత్తైన శివ విగ్రహం.
యాత్ర, బడ్జెట్ వివరాలు
ఇది ఆధ్యాత్మిక యాత్ర అయినా, ఆర్థికంగా మంచి ΄ప్లానింగ్ ఉండటం అవసరం. వీలైనన్ని ఎక్కువ ఆలయాలను చూడాలనుకుంటే, అన్నింటినీ ఒకేసారి ఐదు రోజుల్లో కవర్ చేయడం ప్రాక్టికల్ గా చాలా కష్టం. ఎందుకంటే కోయంబత్తూరు నుంచి నాసిక్, నాసిక్ నుంచి కేరళలోని ఆళిమల మధ్య దూరం వేల కిలోమీటర్లు ఉంటుంది. రూట్ జిగ్ జాగ్ అవుతుంది, ఎక్కువ సమయం ప్రయాణంలోనే పోతుంది.
అందుకే దీన్ని రెండు సర్క్యూట్ లుగా ΄్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఒకటి సౌత్ శివ సర్క్యూట్ – హైదరాబాద్ నుంచి బెంగళూరు శివోహం, కోయంబత్తూరు ఆదియోగి, మురుడేశ్వర్ లను నాలుగు నుంచి ఐదు రోజుల్లో ప్రశాంతంగా చూడవచ్చు. రెండోది వెస్ట్ కోస్ట్ సర్క్యూట్, నాసిక్ త్రయంబకేశ్వర్, కేరళ ఆళిమలలను విడిగా మూడు నుంచి నాలుగు రోజుల్లో ప్లాన్ చేసుకుంటే అలసట లేకుండా దర్శనం చేసుకోవచ్చు.
ఫ్లైట్ ఛార్జీలు సీజన్ ను బట్టి, ఎంత ముందు బుక్ చేస్తామనే దాన్ని బట్టి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఇక్కడ ఇచ్చినవి కేవలం సగటు అంచనా మాత్రమే.
హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఫ్లైట్ సాధారణంగా రూ. 4,000 నుంచి 6,000 వరకు ఉండవచ్చు. ట్రైన్ అయితే టికెట్ ధర సుమారు రూ. 800 నుంచి 1,500 వరకు ఉంటుంది.
బెంగళూరు నుంచి కోయంబత్తూరుకు బస్ లేదా ట్రైన్ ఛార్జీ సుమారు రూ. 600 నుంచి 1,200 వరకు ఉంటుంది. విజయవాడ నుంచి బెంగళూరుకు ఫ్లైట్ సుమారు రూ. 5,000 నుంచి 7,000 వరకు ఉంటుంది.
బస, భోజన ఖర్చులు కూడా లొకేషన్, సీజన్ ను బట్టి మారుతాయి. బడ్జెట్ హోటల్స్ లో ఒక్క రాత్రికి సుమారు రూ. 1,200 నుంచి 2,000, స్టాండర్డ్ హోటల్స్ లో రూ. 3,000 నుంచి 5,000, ప్రీమియం హోటల్స్ లో రూ. 7,000 పైన ఉండవచ్చు. భోజనానికి రోజుకు సుమారు రూ. 300 నుంచి 1,500 మధ్యలో మీ లైఫ్ స్టైల్, అభిరుచిని బట్టి ఖర్చు పెట్టుకోవచ్చు.
వివిధ ట్రావెల్ ప్యాకేజీల ధరలు కూడా ఇలాగే మారుతూ ఉంటాయి కాబట్టి బుక్ చేసే ముందు లేటెస్ట్ ధరలను ఒకసారి వెరిఫై చేసుకోవడం మంచిది. టికెట్ ధరలు, ఇతర చార్జీలు సీజన్ను బట్టి మారుతుంటాయి. కేవలం ఐడియా కోసం మాత్రమే అందించడం జరిగింది. ఇవే ఫైనల్ కాదు అని గమనించగలరు.
– ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు
ఇదీ చదవండి: మండలదీక్షకు వేళాయే..!


