ఇంటర్నెట్, విద్యుత్ సౌకర్యం లేని చోట విద్యా దీపం వెలగించేందుకు తపనపడ్డాడు ఈ గురువు. అందుకోసం ఏకంగా మూడువేల కిలోమీటర్లు దాటి మరీ.. ఆ మారుమూల ప్రాంతానికి చేరుకుని అక్కడ పసివాళ్లకు విద్యా సంపదను అందిస్తున్నాడు. అతడి కథ..ఓ పండుగ కారణంగా ప్రపంచానికి తెలిసింది. ‘గురువే దైవం’, ‘గురువే మార్గదర్శి’ అన్నమాటకు అతడు నిలువెత్తు ఉదాహరణ.
29-year-old teacher Ali AshQar: అతడే కేరళకు చెందిన ఉపాధ్యాయుడు అలీ అష్కర్. అక్కడే తన బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసి, పంజాబ్‌లో మాస్టర్ డిగ్రీని పూర్తి చేశారు. పుదుచ్చేరిలో బీఎడ్ పట్టా పొందారు. కొంతకాలం కాశ్వీర్‌లో పనిచేశారు కూడా. దేశంలో వివిధ ప్రాంతాలకు పర్యటించడం, బోధన పట్ల ఉన్న ఆసక్తి అతడిని అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా సరిహద్దుల్లోని మారుమూల ప్రాంతమైన షి-యోమి జిల్లాలోని ఎన్‌ఎస్‌సిబిఎవి కరోలోకి తీసుకువచ్చింది.
అలా ఆయన ఏకంగా 3 వేల కిలోమీటలర్లు దాటి మరి ఈ మారుమూల కరో అనే గ్రామాని వచ్చారు. ఈ 28 ఏళ్ల ఉపాధ్యాయుడు అధ్వాన్నమైన రోడ్లు, కొండచరియలు విరిగిపడిపోవడం, విద్యుత్-ఇంటర్‌నెట్ కొరత వంటి కష్టాలు ఉన్న ప్రాంతాని ఎందుకు వచ్చాడంటే..అక్కడ ఉన్న పాఠశాలలో పనిచయడానికి. నిజానికి ఎలాంటి సౌకర్యాలు లేని చోటుకి ఎవ్వరు రారు. కానీ ఈయన 2022-2024 మధ్య షి-యోమిలోని ఒక విశ్వవిద్యాలయంలో తన ఎం.ఎడ్. చదువుతున్నప్పుడే ఆ ప్రాంతంతో పరిచయం పెంచుకుని, కరోలో పనిచేయాలని నిర్ణయించుకున్నారు.
అయితే అతడు ఓ ఎన్జీవో సాయంతో ఆ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చాడు. అతను వచ్చినప్పుడు పాఠశాల తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటోంది. అక్కడ హాస్టల్ సౌకర్యం లేదు, పైగా విద్యార్థులు చదువు మానేస్తున్నారు కూడా. చెప్పాలంటే స్కూల్ మూసివేత అంచున ఉంది. ఎప్పుడైతే అష్కర్ భాషా ఉపాధ్యాయుడిగా చేరాడు, తక్షణమే ప్రభుత్వ, ఎన్జీవోలు రంగంలోకి దిగాయి. అలా వాటి సహకారంతో పిల్లలు స్కూల్‌కి వచ్చేలా తనవంతు కృషిచేశాడు.
దాని ఫలితంగా ప్రస్తుతం ఆ పాఠశాలలో దాదాపు 102 మంది విద్యార్థులు ఉండటం విశేషం. అక్కడ అధ్వాన్నమైన రోడ్లు, కొండచరియలు పడటం, విద్యుత్ సౌకర్యం వంటి కఠిన పరిస్థితుల కారణంగానే విద్యార్థుల పాఠశాలకు రావడం కష్టతరంగా ఉండేది. ఆ సవాళ్లన్నింటిని అధిమించి స్టూడెంట్స్ స్కూల్‌కి వచ్చేలా కృషి చేశాడు అష్కర్ భాష. అతడి బోధన కేవలం తరగతి గదులకే పరిమితం కాదు, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం, పాఠశాల కార్యక్రమాలను నిర్వహించడం, సమాజంతో మమేకమవడం, పేరెంట్స్‌తో కలిసి పనిచేయడం వంటివి కూడా ఉన్నాయి.
ఇన్ని సవాళ్లను ఎదుర్కొంటునే తన విద్యార్థులు వాళ్లు పడుతున్న కష్టాల గురించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ ఉండేవాడు. అయితే ఒక రోజు స్కూలో జరిగిన ఓనం వేడుక ఆయన్ను సెలబ్రిటీగా మార్చి యావత్తు ప్రపంచం ఆ ఉపాధ్యాయుడు, అతడి విద్యార్థుల వైపుకి తిరిగి చూసింది. ఒక మళయాళీ ఉపాధ్యాయుడు అరుణాచల్ విద్యార్థులకు ఓనం పండుగను పరిచయం చేయడమే సన్సేషన్‌గా మారింది. ఓనం అనేది మతం లేదా నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రజలందరూ ఒకచోట చేరే వేడుక కావడంతో వారిలో ఐక్యత భావాన్ని పెంపొందించేలా ఈ పండుగను నిర్వహించినట్లు తెలిపారు అష్కర్.
ఈ పండుగలో భాగంగా చిన్నారులకు మళయాళం పాటలు, సాంప్రదాయ ఆహారాన్ని పరిచయం చేశారు. అందుకోసం కావాల్సిన సామాగ్రిని సమకూర్చుకోవడం కష్టతరమైనా..స్థానిక గ్రామస్తుల సాయంతో ఈ ఉపాధ్యాయుడు నిర్వహించడం విశేషం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అది కాస్తా..కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మనసుని కూడా హత్తుకుంది. ఒక ఉపాధ్యాయుడు మారుమూల ప్రాంతాలను కూడా తన బోధనలతో వెలుగులోకి తీసుకురాగలడు అనేందుకు అష్కర్ భాషానే నిదర్శనం కదూ..!.
ఇదీ చదవండి: గృహిణి నుంచి అంతర్జాతీయ గుర్తింపు వరకు..! ఇద్దరు పిల్లల తల్లి సక్సెస్ స్టోరీ


