యూరోపియన్ సమాజంలో ఒకప్పుడు తెల్లటి ఛాయ ఉంటేనే అందానికి, హోదాకు గుర్తుగా భావించేవారు. అందుకే ముఖం తెల్లగా, పాలరాతిలా మెరిసిపోవాలని మహిళలు ప్రత్యేకమైన ఫేస్ పౌడర్లను ఉపయోగించేవారు. అయితే వాటిలో ప్రాణాలకే ముప్పు తెచ్చే సీసం ఉండేది.
తెల్లటి సీసంతో తయారుచేసిన ఈ పౌడర్ ముఖానికి రాసుకుంటే చర్మం నునుపుగా, పాలరాతిలా కనిపించేది. అందుకని ఏళ్ల తరబడి ఉపయోగించేవారు. కానీ క్రమంగా శరీరంలోకి చేరిన సీసం తీవ్ర అనారోగ్య సమస్యలను కలిగించేది. జుట్టు రాలడం, దంతాలు దెబ్బతినడం, చర్మం పాడవడం వంటి సమస్యలు మొదలయ్యేవి. నాడీ వ్యవస్థ దెబ్బతిని, అంతర్గత అవయవాల పనితీరు కుంటుపడేది. కొందరిలో అవయవ వైఫల్యానికీ దారితీసేది.
ఆవు నేతితోమేనికి మెరుపు
ఆవునెయ్యి చర్మసంరక్షణకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. కళ్ల కింద నల్లటి వలయాలు, పొడిబారడం వంటి సమస్యలు ఉంటే రాత్రి నిద్రించే ముందు కొద్దిగా నెయ్యి తీసుకుని కళ్ల చుట్టూ సున్నితంగా రాసుకుని ఉదయం శుభ్రం చేసుకోవాలి. అయితే నెయ్యి కళ్లలోకి వెళ్లకుండా జాగ్రత్తపడాలి. అలాగే పెదవులు పొడిగా, నల్లగా కనిపిస్తుంటే, వేలిమీద కొద్దిగా నెయ్యి తీసుకుని పెదవులపై మృదువుగా మర్దన చేసి రాత్రంతా అలాగే ఉంచుకోవాలి.
నెయ్యిలోని కొవ్వు పదార్థాలు పెదవులను మృదువుగా ఉండేలా చేస్తాయి. స్నానానికి ముందు కొద్దిగా నెయ్యిని గోరువెచ్చగా చేసి శరీరానికి రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. ముఖం కాంతిహీనంగా కనిపిస్తుంటే నెయ్యితో చేసే ఫేస్ ప్యాక్ మంచి ఫలితాలనిస్తుంది. కొద్దిగా నేతిలో పచ్చిపాలు, శనగపిండి కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు రాసి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. చర్మానికి తేమ అందించడంలో ఇది సహాయపడుతుంది.
ఎల్‌ఈడీప్యాచెస్‌తో ముడతలు మాయం!
కళ్ల కింద చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ ఈ ప్రాంతంలో సన్నని గీతలు, ముడతలు కనిపిస్తాయి. నల్లటి వలయాలు, చర్మం కాంతి కోల్పోవడం వంటి సమస్యలూ ఎదురవుతాయి. వీటిని తగ్గించేందుకు ఇప్పటివరకు ఐ క్రీములు, జెల్స్, సాధారణ ఐ ప్యాచెస్ వాడేవారు. అయితే ఇప్పుడు వాటికి టెక్నాలజీ సైతం తోడైంది.
అదే ఎం.జెడ్ స్కి సంస్థ రూపొందించిన ‘లైట్‌మ్యాక్స్ మినీప్రో ఐకానిక్’ ఎల్‌ఈడీ ఐ ప్యాచెస్. కళ్ల చుట్టూ ఉన్న చర్మ సంరక్షణే లక్ష్యంగా పనిచేసే ఈ ప్యాచెస్ చర్మంలో కొలాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. తద్వారా ముడతలు, సన్నని గీతలను తగ్గించడంలో సహాయపడుతాయి. వీటిని రోజూ మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఇదీ చదవండి: అమ్మ చేస్తే అభినందించరు.. కానీ నాన్న చేస్తే..! : పిల్లల పెంపకంపై ఉసాసన కొణిదెల షాకింగ్ వ్యాఖ్యలు


