చాలామంది పాదాలను పట్టించుకోరు. కానీ రోజంతా చెప్పులు, బూట్లతో ఉండటం వల్లపాదాలపై మురికి పేరుకు పోతుంది.
చర్మం పొడిబారి గరుకుగా మారుతుంది. ముఖ్యంగా మడమల దగ్గర పగుళ్లు, మృతకణాలు ఇబ్బంది పెడతాయి. ఇలాంటి సమస్యలను తగ్గించుకోవడానికి ఇంట్లోనే మూడు రకాల ఫుట్ స్క్రబ్స్ తయారుచేసుకోవచ్చు.
కాఫీ స్క్రబ్
కావలసినవి: నాలుగు టేబుల్ స్పూన్ల కాఫీ పొడి, మూడు టేబుల్ స్పూన్ల ఓట్స్ పొడి, మూడు టేబుల్ స్పూన్ల కల్లుప్పు, మూడు టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె, రెండు చుక్కల లావెండర్ నూనె.
తయారీ: అన్ని పదార్థాలను ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తడి పాదాలకు రాసి వృత్తాకారంలో మృదువుగా మర్దన చేయాలి. గోరువెచ్చని నీటితో కడిగి మెత్తని వస్త్రంతో తుడుచుకోవాలి.
నిమ్మకాయ స్క్రబ్
కావలసినవి: ఒక కప్పు బ్రౌన్ షుగర్,పావు కప్పు బాదం నూనె లేదా కొబ్బరి నూనె, నాలుగు నుంచి ఐదు చుక్కల నిమ్మ ఎసెన్షియల్ ఆయిల్.
తయారీ: అన్ని పదార్థాలను కలిపి చిక్కటి మిశ్రమంలా తయారుచేయాలి. పాదాలకు రాసి ఐదు నిమిషాలపాటు మృదువుగా మర్దన చేయాలి. అనంతరం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
తేనె.. పుదీనా స్క్రబ్
కావలసినవి: అర కప్పు కల్లుప్పు, అర కప్పు బాదం నూనె, పావు కప్పు స్వచ్ఛమైన తేనె, ఒక టీ స్పూన్ వెనిల్లా ఎక్స్‌ట్రాక్ట్, పది చుక్కల పుదీనా ఎసెన్షియల్ ఆయిల్, అర కప్పు బ్రౌన్ షుగర్.
తయారీ: అన్ని పదార్థాలను బాగా కలపాలి. తడి పాదాలకు ఈ మిశ్రమాన్ని రాసి ఐదు నిమిషాల ;eటు మృదువుగా మర్దన చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. స్క్రబ్ తర్వాత మాయిశ్చరైజర్ రాసుకుంటే పాదాలు తేమగా ఉంటాయి.


