మన(సు)లో మాట
మా చెల్లెలికి 35 ఏళ్లు. పెళ్లయి 12 సంవత్సరాలయింది. ఇద్దరు పిల్లలు. గత రెండేళ్లుగా తన భర్తను, ‘నీవు నా భర్తవు కాదు, అదే రూపంలో వచ్చిన డూప్లికేట్’ అంటుంది. అప్పట్నుండి భర్తను దగ్గరకు రానివ్వదు, మాట్లాడదు, భోజనం పెట్టదు, వేరే గదిలో పడుకుంటుంది.
తన సొంత భర్తను ఎవరో కిడ్నాప్ చేసి, ఆయన స్థానంలో డూప్లికేట్‌ను పెట్టారంటుంది. ఆమె ప్రవర్తనతో మా బావ విసిగిపోవడంతో చివరకు విడాకుల వరకు వచ్చింది. ఈ ఒక్క విషయం తప్ప మిగతా ఆమె ప్రవర్తన అంతా బాగానే ఉంటుంది. మాకేం చేయాలో తెలియటం లేదు. మా చెల్లెలి కాపురం నిలబెట్టేందుకు మీరే ఏదైనా పరిష్కారం సూచించగలరు.
– రఘురాం, నెల్లూరు
‘కాప్‌గ్రాస్ సిండ్రోమ్’ అనే అరుదైన మానసిక జబ్బుతో బాధపడేవారు మీ చెల్లెలి లాగా మాట్లాడుతారు. తమకు ఆప్తులైన వారిని నిజమైన వారు కాదని, అదే పోలికతో, మారువేషంలో వచ్చారని గాఢంగా నమ్ముతారు. మెదడులో వచ్చే కొన్ని లోపాల వల్ల ఇలాంటి వ్యాధి వచ్చే అవకాశముంది. ఒక వ్యక్తిపై ‘లవ్ అండ్ హేట్’విపరీతంగా ఉన్న పరిస్థితుల్లో కూడా కొందరు ఇలాంటి మానసిక స్థితికి లోనవుతారు.
ఆత్మీయులైన వారి ముఖం చూసినప్పుడు మన మెదడులో వచ్చే భావోద్వేగాలు వీరికి డిస్ కనెక్ట్ అవుతాయి. ఇలాంటి వారితో వాదించడం, వారిని బలవంతంగా ఒప్పించడం వల్ల సమస్య పరిష్కారం కాకపోగా, మరింత జటిలమయ్యే అవకాశముంటుంది. మీ చెల్లెలిని వెంటనే దగ్గరలోని సైకియాట్రిస్టుకు చూపించి తగిన వైద్యం చేయించండి.
ఈ మానసిక సమస్య నుండి బయట పడేందుకు మంచి మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. భర్త, ఆమె ప్రవర్తతో విసిగిపోకుండా, అతడికి కూడా కౌన్సెలింగ్ ఇప్పించాలి. నా అనుభవంలో ఇలాంటి కేసులు పూర్తిగా కోలుకునే అవకాశముంటుంది. ఆల్ ది బెస్ట్!
- డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com


