దత్తబోధ
కొందరు సద్గురువులు ఈ జన్మలో ఎవరెవరు ఏమి చేయబోతున్నారో తెలుసు కోగలరు. చెడ్డపనులు చేసేవారిని ఈ జన్మలోనే చేరదీసి, చక్కదిద్ది, వారిచేత అద్భుతమైన పనులు చేయిస్తారు. తరువాతి జన్మలోనైనా సమాజానికి ఉపయోగ పడే వ్యక్తులుగా తీర్చిదిద్దుతారు.
అవంతీపురంలో భద్రాయువు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. వివాహ మయిన తర్వాత భార్యనెందుకో వదిలి పెట్టాడు. ఒక వేశ్యతో సంబంధం పెట్టు కొన్నాడు. దీంతో నిష్ఠ, నియమం, సత్కర్మాచరణం అన్నీ వదిలేశాడని ఆయన్ని వెలివేశారు. ఒకరోజున ఋషభుడనే మహాయోగి ఈ వేశ్య ఇంటికే వెళ్ళాడు. భ్రష్టుడు అనుకొంటున్న ఆ బ్రాహ్మణుని చేతి మీదుగా పాదపూజ చేయించుకొన్నాడు.
కొంతకాలం తర్వాత ఆ బ్రాహ్మణుడు చనిపోయాడు. తిరిగి వజ్రబాహుడనే చక్రవర్తికి జన్మించాడు. భద్రాయువు పూర్వజన్మలో చేసిన పాపాల ఫలితంగా పసితనంలోనే పురుగులు పట్టి అతని శరీరం కుళ్ళిపోయింది. దాంతో తల్లీ బిడ్డలిద్దరినీ అడవిలో వదిలేశారు. అదే సమయంలో ఋషభుడు అక్కడికి రావటం తటస్థించింది. పూర్వజన్మలో భద్రాయువు ఉదంతం తెలిసినవాడైనందున అతడికి తెలివిని, తేజస్సును, ఆరోగ్యాన్ని, ఒక కత్తిని, శివకవచాన్ని అనుగ్రహించాడు.
భద్రాయువు ఉన్న మగధ దేశాన్ని శత్రురాజు ఆక్రమించాడు. ఋషభుని ఆదేశానుసారం భద్రా యువు రాజుకు సహాయకుడుగా వెళ్ళి శత్రురాజును యుద్ధంలో ఓడించి ఆ రాజ్యాన్ని యథాప్రకారం రాజు కప్పగించాడు. భద్రాయువు అతడి కుమారుడేనని ఋషభుడు చెప్పడంతో సంతసించి తన సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుని చేశాడు. ఇలా సద్గురువైన ఋషభయోగి... మూర్ఖుడు, భ్రష్టుడు, పాపి అయిన వాడి వెంటబడి తన కృపతో దేవేంద్ర వైభవాన్ని అతని కనుగ్రహించాడు.
- శ్రీ గణపతి సచ్చిదానందస్వామి
ఇదీ చదవండి: నేటి అసురులపైనా నాటాలి శరం


