బుకర్ విన్నర్
చాలామంది రచయితలు తమ జీవితకాల కృషిని సమీక్షించుకునే వయసులో ఉన్నారు ఆయన. బ్రిటిష్ రచయిత ఎం.జాన్ హారిసన్‌ను ప్రతిష్ఠాత్మకమైన బుకర్ ప్రైజ్ వరించింది. 81 ఏళ్ల వయసులో బుకర్ ప్రైజ్ గెల్చుకున్న పెద్ద వయసుగల రచయితగా నిలిచారు హారిసన్. ఆయన రాసిన ‘ది ఎండ్ ఆఫ్ ఎవ్రీ థింగ్’కు బుకర్ ప్రైజ్ దక్కింది. జాన్ హారిసన్‌కు బుకర్ ప్రైజ్ రావడం అనేది రాత్రికి రాత్రి జరిగిన అద్భుతం కాదు. అరవై ఏళ్ల రచనా జీవితం ఆయనది. ఈ సృజనకారుడి అంతరంగం...
చిన్నప్పటి నుంచి పుస్తకాలు పిచ్చిగా చదివేవాడిని. మా ఇంట్లో పై అంతస్తులో పుస్తకాలతో నిండిన అల్మారా ఉండేది. అందులో పల్ప్, చెత్తపుస్తకాలు, థ్రిల్లర్స్, సైన్స్‌ఫిక్షన్... ఎన్నెన్నో ఉండేవి. నాకు ఇష్టమైన హీరోలందరూ అందులోనే ఉండేవారు. పుస్తకాలు చదివే అలవాటు అలా మొదలైంది.
→ సెకండరీ స్కూల్ పాఠ్యపుస్తకంగా డబ్ల్యూహెచ్ డేవిస్ రాసిన ‘ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ సూపర్– ట్రంప్’ ఇచ్చారు. ఆ పుస్తకం ఒక సంచారి జీవితం. రైలు పట్టాలపై ప్రయాణం, దుమ్ము, ఆకలి, తెగిపోయిన అవయవాలు...ఆ పుస్తకంలో ఎన్నో ఉన్నాయి. పదమూడేళ్ల వయసులో నాకు ఇంతకంటే ఏం కావాలి? ఈ పుస్తకం నాపై బాగా ప్రభావం చూపింది.
ఇష్టపడే పుస్తకాలు పాత ప్రేమికుల్లాంటివి!
→ పదహారేళ్ల వయసులో ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ చదవడం మొదలుపెట్టాను. విశేషం ఏమిటంటే, చదవడం పూర్తయిన తరువాత కూడా మళ్లీ మళ్లీ చదువుతూ ఉండేవాడిని. ఆ తరువాత అకస్మాత్తుగా ఆ పుస్తకంపై విరక్తి కలిగింది. ఆ పుస్తకం మళ్లీ చదవాలని, కనీసం చూడాలని ఎప్పుడూ అనిపించలేదు.
మనం విపరీతంగా ఇష్టపడే పుస్తకాలు పాత ప్రేమికులలాంటివి!
కొన్ని సంవత్సరాల తరువాత వారిని మీరు కలుస్తారు. అప్పుడు అనిపిస్తుంది... వీరిని ఎందుకు ఇష్టపడ్డాను అని. పుస్తకాల విషయం కూడా అంతే!
కళ్లు తెరిపించిన పుస్తకం
→ నేను వేల పుస్తకాలు చదివాను. వాటన్నిటిలోనూ చెప్పుకోవడానికి ఏదో ఒక విషయం ఉంది. అదేమిటో నేను తెలుసుకున్నప్పుడు ఎంతో ఉద్వేగానికి గురయ్యాను. పదహారేళ్ల వయసులో ఎల్.పీ.హార్టీ రాసిన ‘ది గో–బిట్వీన్’ పుస్తకం నా కళ్లు తెరిపించింది. నేను ప్రపంచాన్ని చూసే విధానాన్ని మార్చిన పుస్తకం అది.
→ సిద్ధాంతాల వల్ల, నవలల గురించి నా ఆలోచనా విధానం ఎప్పుడూ మారుతూ ఉంటుంది. సిద్ధాంతాన్ని పనిముట్ల పెట్టెలా చూస్తాను. విడదీయడానికి, తిరిగి నిర్మించడానికి సిద్ధాంతం అనే పనిముట్ల పెట్టే ఉపయోగపడుతుంది. ఉత్తమ సిద్ధాంతం అద్భుతమైన కవిత్వం కూడా.
→ ప్రస్తుతం నేను ‘ఫన్నీ వెదర్’ అనే పుస్తకం మళ్లీ చదువుతున్నాను. ‘ఫ్రీజ్’ అనే ఆర్ట్ మ్యాగజైన్‌లో ప్రచురితమైన వ్యాసాలను ‘ఫన్నీ వెదర్’గా ప్రచురించారు. ఈ వ్యాసాలు కళ గురించి మాత్రమే కాదు అంతకుమించిన విషయాలను స్పృశిస్తాయి.
రైలులో ప్రయాణం చేస్తూ చదవడం ఇష్టం
→ నా దగ్గర ఎప్పుడూ నోట్‌బుక్స్ ఉంటాయి. ఎప్పుడు రాయాలనిపిస్తే అప్పుడు రాస్తుంటాను. ‘నేను ఎలాంటి చోట, ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాయగలను’ అనే గర్వం నాలో ఉండేది. కాని ఇప్పుడు అలా కాదు. వాతావరణం నిశ్శబ్దంగా ఉండాలి. నిశ్శబ్దంగా లేకపోతే నా ఏకాగ్రత దెబ్బతింటుంది. రాయలేను.
ది ఎండ్ ఆఫ్ ఎవ్రీథింగ్
గత జూన్‌లో ప్రచురించబడిన 198 పేజీల నవల... ది ఎండ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ప్రళయానంతర భవిష్యత్‌లోకి తీసుకువెళ్లే పుస్తకం ఇది. ఫిలిప్ టెన్నెట్, వృద్ధురాలైన అతని అత్త ఈ నవలలో ప్రధాన పాత్రలు. సముద్ర తీరంలో ఒక అసా«ధారణ, వింత వస్తువును చూస్తాడు ఫిలిప్. అది పెరిగి మాట్లాడడం మొదలుపెడుతుంది. సలహాలు ఇస్తుంటుంది. ‘ఐ ఘెట్టి’ అనే ఈ వింత జీవుల వలన సంప్రదాయ వ్యవస్థ బలహీనమవుతుంది. సామాజిక కట్టుబాట్లు కుప్పకూలి పోతాయి. చట్టాన్ని అమలు చేసే వ్యవస్థలు పరాధీనం పాలవుతాయి. ఈ నవలకు ప్రేరణ... 2008 నాటి ఆర్థిక సంక్షోభం. సమాజం తన చుట్టూ జరిగే విపత్తులను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని కోల్పోయినప్పుడు, ప్రజలు ఏదోవిధంగా జీవించాల్సి వచ్చినప్పుడు, ఏమి జరుగుతుందో ప్రతీకాత్మకంగా చెప్పే నవల ఇది.


