శంకర కురుప్
ఫండే
లిట్వరల్డ్
‘విద్వత్వంచ నృపత్వంచ నైవ తుల్యం కదాచన
స్వదేశే పూజ్యతే రాజా – విద్వాన్ సర్వత్ర పూజ్యతే!’
అంటుంది ఓ సుభాషితం. ‘విద్వత్తుకూ రాజరికానికీ ఏ పోలికా లేదు– రాజు తన దేశంలో మాత్రమే పూజలు పొందుతాడు; విద్వాంసుడు అన్నిచోట్లా పూజలు పొందుతాడ’న్నది ఆ సుభాషితం సారాంశం. అందుకే, ప్రపంచం నాలుగు మూలలా విద్వాంసులు గౌరవాదరాలకు పాత్రులవుతున్నారు. అలా గౌరవాదరాలు ప్రకటించే సంస్థల్లో చాలామట్టుకు ప్రపంచప్రఖ్యాతి పొందినవే!
‘నోబెల్ సాహిత్య పురస్కారం’, ‘పులిట్జర్ పురస్కారం’, ‘న్యూశ్టాడ్ అంతర్జాతీయ సాహిత్య పురస్కారం’, ‘డబ్లిన్ సాహిత్య పురస్కారం’, ‘శామ్యూల్ జాన్సన్ పురస్కారం’, ‘హ్యూగో పురస్కారం’, ‘ఫ్రాంజ్ కాఫ్కా పురస్కారం’ లాంటివి సాహిత్యాభిమానులకు తెలిసిన పేర్లే! ఈ పురస్కారాలు పొందడానికి జాతి– వర్ణ– భాషా– ప్రక్రియల పరమైన పరిమితులూ, ప్రాతిపదికలూ, గీటురాళ్ళేం లేవు. వాటికి భిన్నమైన పురస్కారాలూ లేకపోలేదు! ఉదాహరణకు ‘బుకర్ పురస్కారం’, ‘ఎడ్గార్ పురస్కారం’, ‘హ్యూగో పురస్కారం’ అన్ని ప్రక్రియల రచయితలకు సమానంగా వర్తించేవి కావు. అలాంటివీ, ఇలాంటివీ కూడా ఏయే చారిత్రక పరిస్థితుల్లో ఈ పరిమితులతో, ప్రాతిపదికలతో మొదలై ఎలా కొనసాగుతూ వచ్చాయో కాస్త వివరంగా చెప్పుకుందాం.
‘సాహిత్యరంగంలో ఆదర్శప్రాయమైన దిశానిర్దేశం చేసే అత్యుత్తమ రచనకు’ నోబెల్ సాహిత్య పురస్కారం ప్రకటించాలన్నది, నోబెల్ ధర్మనిధి సంస్థ వ్యవస్థాపకుడు, స్వీడిష్ రసాయనిక శాస్త్రవేత్త, ఆవిష్కర్త, ఇంజినీర్, వాణిజ్యవేత్త, బహుభాషావేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ ఆకాంక్ష. పందొమ్మిదో శతాబ్ది చివర్లో చెలరేగిన యుద్ధాలూ– అంతర్యుద్ధాల్లో తీవ్రప్రమాణంలో జననష్టం కలిగించినవి విస్ఫోటక పదార్థాలే. కన్నుమూసేనాటికి ఆల్ఫ్రెడ్ నోబెల్– ఆయుధ ఉత్పత్తి రంగంలో– 355 అంతర్జాతీయ పేటెంట్లు తన పేరిట నమోదు చేసుకున్నాడు. తొంభైకి పైగా ఆయుధ ఉత్పత్తి సంస్థలను సొంతం చేసుకుని, ‘మృత్యుబేహారి’ అనే బిరుదు సంపాదించుకున్నాడు.
దానితో పాటుగా, కన్నుమూసే నాటికి మూడుకోట్ల పదిలక్షల క్రోనార్ల విలువ చేసే సిరిసంపదలనూ మూటకట్టుకున్నాడు. ఈ కాలపు లెక్కల్లో ఇది రూ.2,500 కోట్లకు సమానం. చరిత్రపుటల్లో ‘మృత్యుబేహారి’గా మిగిలిపోకూడదనే ఆకాంక్షతోనే 1895లో తన వీలునామా రాశాడంటారు. భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్య శాస్త్రం, సాహిత్యం, ప్రపంచశాంతి అనే అయిదు రంగాల్లో జాతులూ ప్రాంతాలతో నిమిత్తం లేకుండా ఉత్తమ ప్రమాణాలు నెలకొల్పినవారికి ఈ పురస్కారాలివ్వాలన్నది ఆయన ఆకాంక్ష.
తన సంపదలో 94 శాతం ఖర్చుచేసి ఆ పురస్కారాలు అందించాలని తన వీలునామాలో పేర్కొన్నాడు. ఇరవయ్యో శతాబ్ది మొదటి సంవత్సరంలో– 1901లో– ఈ పురస్కారాలను ప్రకటించారు. సుప్రసిద్ధ ఫ్రెంచ్ కవి సలీ ప్రూధాం నోబెల్ సాహిత్య పురస్కారం మొట్టమొదటిసారి అందుకుని చరిత్రలో నిలిచిపోయారు. కాగా 2025లో నోబెల్ సాహిత్య పురస్కారం గెల్చుకున్న ల్యాజ్లో క్రాజ్నహార్కా పదిలక్షల డాలర్లకు మించిన ప్రైజ్ మనీ– పుచ్చుకున్నారు. రచయితలకు అందే బహుమతుల్లో, బహుశా, ఇదే పెద్దది!
పులిట్జర్ పురస్కారాల కథ కూడా చెప్పుకోదగిందే! అమెరికన్ రాజకీయవేత్త, పాత్రికేయుడు, పత్రికాధిపతి జోసెఫ్ పులిట్జర్. ఆయన హంగేరియన్–అమెరికన్; 1917లో 23 వార్షిక పురస్కారాలను నెలకొల్పారు. పత్రికా రచన, కళలు, సాహిత్యం తదితర రంగాల్లో ఈ పురస్కారాలు ఎవరెవరికి ఇవ్వాలో నిర్ణయించే బాధ్యతను న్యూయార్క్లోని కొలంబియా విశ్వవిద్యాలయానికి అప్పగించారు పులిట్జర్. ఈ పురస్కారాల ప్రకటనను ‘పరస్పర ప్రశంసాత్మక వ్యవహారం’గా విమర్శించింది ‘షికాగో ట్రిబ్యూన్.’ ఆ మాట ఎలావున్నా, ఇది ఏదో ఒక దేశానికో, భాషకో, జాతికో, ప్రక్రియకో పరిమితమైందని మాత్రం ఎవరూ అనలేదు.
అలాంటి మరో పురస్కారమే ‘ద న్యూశ్తాడ్ అంతర్జాతీయ సాహిత్య పురస్కారం’ కూడా. 1970లో మొదలైన ఈ పురస్కారాన్ని రెండేళ్ళకు ఓసారి ప్రకటిస్తారు. బహుమతి మొత్తం మాట ఎలావున్నా, దీనికి దక్కిన గౌరవం గొప్పది. న్యూశ్తాడ్ అంతర్జాతీయ సాహిత్య పురస్కారాన్ని కొందరు ‘అక్లహామా నోబెల్’గానూ; మరికొందరు దాన్ని అమెరికన్ నోబెల్ బహుమతిగానూ అభివర్ణించారు! ‘అంతర్జాతీయ బతేఫ్ సాహిత్య పురస్కారం’, ‘అమెరికన్ సాహిత్య పురస్కారం’, ‘యాన్ మిచాల్స్కీ పురస్కారం’, ‘బిగ్న్యూ హెర్బర్ట్ పురస్కారం‘ కూడా ఇలాంటివే!
వీటిలో ‘బుకర్ పురస్కారం’ విషయమే తీసుకోండి– యునైటెడ్ కింగ్డమ్, ఐర్లండ్ దేశాల్లో అచ్చయిన ఇంగ్లిష్ పుస్తకాలకే ఈ పురస్కారం పరిమితం. ఈ రెండు దేశాల్లోనూ కలిపి 300 భాషలకు పైగా వాడుకలో ఉన్నాయి. కాగా, 1945లో మొదలైన ‘ఎడ్గార్ పురస్కారం’ నిగూఢమైన అపరాధ పరిశోధన సాహిత్యం రాసే రచయితలకు మాత్రమే ఉద్దేశించినది. 1953లో మొదలైన ‘హ్యూగో పురస్కారం’ సైన్స్ ఫిక్షన్ రచయితలకే పరిమితం. ‘స్త్రూగా కవిసంధ్య’ అనే అల్బేనియన్ పురస్కారం కవిత్వానికే పరిమితం.
ఇలాంటివే మూడు జాతీయస్థాయి పురస్కారాలు మనదేశంలో కూడా వున్నాయి. ఈ వార్షిక జాతీయ పురస్కారాలూ భారతీయులకు మాత్రమే ఉద్దేశించినవి. వాటిలో మొదటిది ‘జ్ఞానపీఠ పురస్కారం.’ 1965లో సుప్రసిద్ధ మలయాళీ రచయిత శంకర కురుప్ తొలి జ్ఞానపీఠ పురస్కారం పుచ్చుకున్నారు. ఇంతవరకూ 61 మంది ప్రసిద్ధులు ఈ పురస్కారం అందుకున్నారు. ‘భారతీయ జ్ఞానపీఠం’ 1983 నుంచి ‘మూర్తిదేవి అవార్డు’ పేరిట మరో జాతీయ అవార్డును కూడా ఇస్తోంది.
ఇలాంటిదే మరో పురస్కారం ‘సరస్వతీ సమ్మాన్’ పురస్కారం. భారత రాజ్యాంగం ఎనిమిదో షెడ్యూల్లో పేర్కొన్న 23 భారతీయ భాషల్లో రాసే రచయితలకు ఉద్దేశించిన పురస్కారాలివి. భారతీయ సాహిత్య పురస్కారాలు వేటికవే గొప్పవనే విషయంలో సందేహం లేదు కానీ, ‘జ్ఞానపీఠం‘ వాటన్నింట్లోకీ విశిష్టమైంది. ముందుముందు ఆ పురస్కారం గురించిన విశేషాలను ఇక్కడ ప్రస్తావించుకుందాం.
- మందలపర్తి కిషోర్
ఇదీ చదవండి: మండపం ముందు శివతాండవం!


