ధనం మూలం ఇదం జగత్ అంటారు. మానవులకు డబ్బు, సంపద ఒసంగే సిరుల తల్లి లక్ష్మీదేవి. ఒకవిధంగా చెప్పాలంటే అదృష్టానికి ఆలవాలం. నిండైన ఆమె రూపాన్ని చూసినంతనే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. లక్ష్మి అంటే లక్ష్యానికి దారిచూపే దేవత అని అర్థం. మనః సంకల్పంతో ఆ లక్ష్యాన్ని సాధిస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధించినట్లే. అలాంటి లక్ష్యాలు అష్టలక్ష్ములుగా అవతరించాయి. వారిలో ఆద్యురాలు మహాలక్ష్మి. ఆమెను శ్రావణంలో వరలక్ష్మీ దేవిగా పూజించి వ్రతాలు ఆచరిస్తే.. ఆశ్వయుజ మాసం దేవీ శరన్నవరాత్రుల్లో శ్రీచక్రార్చన, కుంకుమ పూజలు నిర్వహిస్తారు. కార్తీక మాసం దీపావళి పర్వదినాన లక్ష్మీపూజ చేయడం హిందువుల్లో అనాదిగా వస్తున్న ఆచారం. అలా చేస్తే తరగని సిరి సంపదలు, ఐశ్వర్యం, ఆరోగ్యం ప్రసాదిస్తుందని భక్తుల నమ్మిక. దీన్ని అత్యంత శుభప్రదం, శ్రేయోదాయకంగా భావిస్తారు. దీనివెనుక గల పురాణ కథనం ఏమిటంటే...
దేవతలు, రాక్షసులు క్షీరసాగర మథనం జరిపినప్పుడు కామధేనువు, కల్పవృక్షం, ఐరావతం తదితరాలతోపాటు మహాలక్ష్మి కూడా అవతరిస్తుంది. ఒక్కొక్క వస్తువును ఒక్కొక్కరు తీసుకోగా మహాలక్ష్మి శ్రీమహావిష్ణువును ఆశ్రయిస్తుంది. ఆ విధంగా కార్తిక అమావాస్య రోజున క్షీరసాగరం నుంచి అవతరించిన లక్ష్మీదేవిని పూజించడం సాంప్రదాయంగా వస్తోంది. తిమిరంతో నిండిన విశ్వమంతా దివ్వెల వెలుగులతో నిండి΄ోయి అంధకారం తొలగి΄ోతుంది. అదే లక్ష్మీదేవి రాకగా భావిస్తారు.
ఏ గృహంలో అయితే శుచి, శుభ్రత పిటిస్తారో అక్కడ లక్ష్మీదేవి కాలుమోపుతుంది. ఇంటిని గోపంచకంతో శుద్ధిచేసి.. అవకాశం ఉంటే ఆవుపేడతో పెరటిని అలికి బియ్యం పిండితో అందంగా రంగవల్లులు తీర్చిదిద్దితే సిరులతల్లి సంతసిస్తుంది. ఆమెను ఆరాధిస్తూ చేసే స్తోత్ర పారాయణకు ముగ్ధురాలై నట్టింట అడుగుపెడితే మట్టిప్రమిదల్లో వెలిగించిన దీపాలవెలుగులో లక్ష్మీ స్వరూపం తేజోమయంగా కనిపిస్తుంది.
ఎవరి శక్తికొలదీ వారు బంగారు, వెండి, రాగి, ఇత్తడి లేదా రూపాయి నాణేలతో పూజిస్తే తల్లి కనికరిస్తుంది. రుణబాధలు తొలగిపోయి రాబడి అధికమవుతుంది. అంటే ఆర్థిక స్థిరత్వం లభిస్తుందన్నమాట. ఇంట్లో శాంతి, కుటుంబ సభ్యుల నడుమ సఖ్యత నెలకొంటాయి. ఉద్యోగోన్నతి, వ్యాపారంలో లాభాలు, చేపట్టిన ప్రతికార్యంలోనూ విజయం తథ్యం. లక్ష్మీదేవి ముందు కళ్లుమూసుకుని ధ్యానం చేస్తే మనసుకు ఉల్లాసం, శరీరానికి ఉత్సాహం లభిస్తాయి. తద్వారా ఆరోగ్య్రప్రాప్తి చేకూరుతుంది. చివరగా భక్తితో సమర్పించే నివేదన సకల పాపలను హరిస్తుందని చెప్పాలి.
లక్ష్మీపూజ ముగిశాక తులసి కోట వద్ద దీపాలు వెలిగించి పసుపు, కుంకుమలు సమర్పిస్తే సకల శుభాలు చేకూరతాయి. అంతకుమించి మనలోని అరిషడ్వర్గాలైన కామ, క్రోధ. లోభ, మోహ, మద, మాత్సర్యాలను పటాపంచలు చేసి అంధకారం నుంచి బయటపడేస్తుంది. దానం, ధర్మం, శాంతి, ప్రేమ, భక్తి, కృతజ్ఞత వంటి వెలుగులతో జీవితం ఆనందభరితంగా మారుతుంది. కృత, త్రేతా, ద్వాపర యుగాలలో సకల దేవతలు, రుషుల పూజలందుకున్న లక్ష్మీదేవికి కలియుగంలోనూ అంతే ప్రాధాన్యత ఇస్తుండడం మానవాళికి దక్కిన అదృష్టం.
–చెన్నాప్రగడ శర్మ
ఇదీ చదవండి: ఎల్లలు లేని వెలుగుల దివ్వెలు..! ఆయా దేశాల్లో ఎలా జరుపుకుంటారంటే..


