జైలు పాలైనా..చదవడం ఆపలేదు! కట్‌చేస్తే ఇవాళ డీఎస్పీగా.. | Success Story: How Jainendra Kumar Nigam becoming a DSP | Sakshi
Sakshi News home page

జైలు పాలైనా..చదవడం ఆపలేదు! కట్‌చేస్తే ఇవాళ డీఎస్పీగా..

Nov 7 2026 1:56 PM | Updated on Nov 7 2026 1:56 PM

Success Story: How Jainendra Kumar Nigam becoming a DSP

కష్టాలు..మనల్ని మరింత రాటుదేలాల చేస్తాయే తప్ప..కలలు కల్లలయ్యేలా.. ఆగిపోయేలా చేయవు అని ఇతడి కథ చెబుతోంది. ఏం జరిగినా..ఎంతటి కఠిన పరిస్థితులు ఎదురైనా.. తలొంచక కృషి చేస్తే..కచ్చితంగా విజయం నీకు దాసోహం అని చెబుతోంది ఇతడి విజయగాథ. ఒకవైపు ఆర్థిక కష్టాలు, మరోవైపు జైలు పాలవ్వడం, ఇవన్నీ చాలవన్నట్లు మలేరియా, టైఫాయిడ్‌ రూపంలో వ్యాధులు దాడి చేసినా.. చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి సక్సెస్‌ అందుకున్నాడు. 

అతడే జైనేంద్ర​ కుమార్‌ నిగమ్‌. మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాకు చెందిన వ్యవసాయం కుటుంబంలో జన్మించాడు. చదువు కొనసాగించడానికి ఎన్ని కష్టాలు పడ్డాడంటే..పగవాడు కూడా పడనన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు. తండ్రి కేశవ్‌ కుమార్‌ ఒక రైతు కాగా, తల్లి కుసుమ్‌ దేవి గృహిణి. కేశవ్‌ రాష్ట్ర సివిల్‌ సర్వీస్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించాడు. కానీ ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ బాధ్యతల కారణంగా తన కలను నెరవేర్చలేకపోయాడు. అందుకే తన కుమారుడిని జైనేంద్ర కుమార్‌ని ప్రోత్సహించేవాడు. అప్పుడే డీఎస్పీ కావాలనే లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాడు. 

సరిగ్గా ఇండోర్‌ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో భూవివాదాల కారణంగా జైనేంద్ర కుటుంబంపై కేసులు మోపారు. దాంతో జైనేంద్ర జైలు పాలవ్వాల్సి వచ్చింది. ఈ కష్టాలు ఆయన మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపాయి. అయినప్పటికీ తన తల్లికి డీఎస్సీగా తిరిగొస్తానని చెప్పిన మాటలకు కట్టుబడి ఉండి..జైలుపాలైన చదవడం ఆపలేదు. ఎంపీపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష సమయంలో, జైనేంద్ర జైలులో ఉన్నాడు. పరీక్ష రోజున, పోలీసులు అతనికి సంకెళ్లు వేసి పరీక్షా కేంద్రానికి తీసుకువచ్చారు. ఒక చేతిలో పెన్ను పట్టుకుని, మరో చేతికి సంకెళ్లు వేసుకోవడం అతనికి అత్యంత సవాలుతో కూడిన అనుభవంగా చెప్పొచ్చు. 

అయినా ఇంతటి స్థితిలోనూ తన కలను వదులుకోలేదు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదల అయిన వెంటనే..ఇండోర్‌ వెళ్లి చదువుని తిరిగి ప్రారంభించి..రైటింగ్‌ స్కిల్స్‌ పెంచుకున్నాడు. అక్కడే అనేక మాక్‌ టెస్ట్‌ సిరీస్‌లు పూర్తి చేసి తనను తాను మెరుగుపరుచుకున్నాడు. అలా జైనేంద్ర కానిస్టేబుల్‌, మధ్యప్రదేశ్‌ పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎడ్యుకేషన్ క్లాస్-1 వంటి పలు పరీక్షలలో విజయం సాధించారు. 

అయితే డీఎస్పీ కావడం తన లక్ష్యం కాబట్టి..నైబ్ తహసీల్దార్‌గా తన వృత్తిని ప్రారంభించినప్పటికీ, ఆయన తన లక్ష్యం కోసం నిరంతరం సిద్ధమవుతూనే వచ్చారు. చివరికి 2024లో తనపై  ఉన్న అన్ని కేసుల నుంచి విముక్తి లభించింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌  పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPPSC) పరీక్షా ఫలితాల్లో 12వ ర్యాంకును సాధించి, డీఎస్పీ కావాలనే తన కలను నిజం చేసుకున్నారు. అతడి కథ కష్టంలో కూడా పట్టుదలతో ప్రయత్నిస్తే అనుకున్నది సాధించగలమని చెబుతోంది. నేటి యువతకు తప్పక తెలుసుకోవాల్సిన విజయగాథ ఇది. 

ఇదీ చదవండి: మొట్టమొదటి సింగిల్‌ మదర్‌ ‘సీతమ్మే’..! ఆ బంధం..
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement