అమెరికా 22026 మధ్యంతర ఎన్నికల (Midterm Elections) తొలి ఫలితాల్లో డెమోక్రాట్లు కాంగ్రెస్‌పై పట్టు సాధించడం వార్తల్లో నిలవగా, మరోవైపు అమెరికా అంతటా కాంగ్రెస్‌తో పాటు రాష్ట్ర స్థాయి ఎన్నికల్లో భారతీయ-అమెరికన్ అభ్యర్థులు కీలక విజయాలు సాధించడం మరో ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఫెడరల్ స్థాయి నుంచి స్థానిక పాలనా వ్యవస్థల వరకు పలువురు భారతీయ అమెరికన్లు విజయాన్ని నమోదు చేసి తమ ముద్ర వేశారు.
ముఖ్యంగా ఈ ఎన్నికల్లో అత్యంత చారిత్రాత్మక విజయం 39 ఏళ్ల పియా దండియాది. ఫ్లోరిడా 22వ నియోజకవర్గం నుంచి అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికైన ఆమె, ఫ్లోరిడా రాష్ట్రం నుంచి కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్‌గా చరిత్ర సృష్టించారు. అమెరికా రాజకీయాల్లో భారతీయ సమాజం పెరుగుతున్న ప్రభావానికి ఇది కీలక గుర్తింపుగా భావిస్తున్నారు.
జార్జియాలో జ్యోత్ సింగ్ విజయంతో మరో చరిత్ర నమోదైంది. ఆయన జార్జియా రాష్ట్ర శాసనసభకు ఎన్నికై, ఆ రాష్ట్ర అసెంబ్లీలోకి ఎన్నికైన తొలి సిక్కు-అమెరికన్గా నిలిచారు. దక్షిణ అమెరికాలో భారతీయ వలసదారుల రాజకీయ ప్రాతినిధ్యం విస్తరిస్తోందనే సంకేతంగా ఈ విజయం కనిపిస్తోంది.
వాషింగ్టన్ డీసీలో అపర్ణ రాజ్ సిటీ కౌన్సిల్‌లోని వార్డ్-1 స్థానాన్ని గెలుచుకుని స్థానిక పాలనలో భారతీయుల ప్రాతినిధ్యాన్ని మరింత బలోపేతం చేశారు. ఇక ఇప్పటికే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సుహాస్ సుబ్రమణ్యం, రోఖన్నా, ప్రమిలా జయపాల్, అమీ బేరా తమ తమ కాంగ్రెస్ స్థానాలను తిరిగి కైవసం చేసుకొని భారతీయ అమెరికన్ల బలమైన రాజకీయ ఉనికిని కొనసాగించారు.
మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్, విస్కాన్సిన్ అటార్నీ జనరల్ జోష్ కౌల్ కూడా మరోసారి విజయం సాధించి భారతీయ మూలాలున్న నాయకులు కేవలం శాసనసభలకే పరిమితంకాదు, రాష్ట్రాల పాలనా వ్యవస్థల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారని నిరూపించారు.
ఈ ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు అమెరికా సెనేట్‌ను గెలుచుకోకపోయినా, కాంగ్రెస్, రాష్ట్ర శాసనసభలు, కార్యనిర్వాహక పదవులు , స్థానిక సంస్థల్లో నమోదైన విజయాలు అమెరికాలో భారతీయ వలసదారుల కమ్యూనిటీ రాజకీయ పరిపక్వతకు, పెరుగుతున్న ప్రభావానికి మరో మైలురాయిగా నిలిచాయి. భారత సంతతి అమెరికన్లు ఇక అమెరికా రాజకీయాల్లో ప్రభావవంతమైన రాజకీయ శక్తిగా ఎదుగుతున్నారనే సందేశాన్ని చెప్పకనే చెబుతున్నాయి.
సత్తా చాటిన భారతీయ అమెరికన్లు
పియా దండియా - ఫ్లోరిడా నుంచి కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్
జ్యోత్ సింగ్ - జార్జియా అసెంబ్లీలో తొలి సిక్కు-అమెరికన్
అపర్ణ రాజ్ - వాషింగ్టన్ డీసీ సిటీ కౌన్సిల్ సభ్యురాలు
అరుణా మిల్లర్, జోష్ కౌల్ - రాష్ట్ర స్థాయి కీలక పదవుల్లో తిరిగి విజయం
రోఖన్నా, ప్రమిలా జయపాల్, సుహాస్ సుబ్రమణ్యం, అమీ బేరా - కాంగ్రెస్‌లో భారతీయ అమెరికన్ ప్రాతినిధ్యాన్ని కొనసాగించారు.


