ట్రంప్‌కు దిమ్మతిరిగేలా.. సన్నిహిత రిపబ్లికన్ల ఆధిపత్యానికి తెర! | Five Stunning Republican Losses Shake Trumps Political Stronghold | Sakshi
Sakshi News home page

ట్రంప్‌కు దిమ్మతిరిగేలా.. సన్నిహిత రిపబ్లికన్ల ఆధిపత్యానికి తెర!

Nov 4 2026 12:55 PM | Updated on Nov 4 2026 12:55 PM

Five Stunning Republican Losses Shake Trumps Political Stronghold

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. దేశవ్యాప్తంగా ప్రతినిధుల సభ, సెనేట్‌పై డెమోక్రాట్లు పట్టు సాధించగా.. రిపబ్లికన్లకు కంచుకోటలుగా ఉన్న ఐదు రాష్ట్రాల్లో అనూహ్య పరాజయాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా టెక్సాస్‌లో 32 ఏళ్ల రిపబ్లికన్ల ఆధిపత్యానికి తెరపడటం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

టెక్సాస్‌లో 32 ఏళ్ల చరిత్రకు ముగింపు
రిపబ్లికన్లకు బలమైన రాష్ట్రంగా పేరున్న టెక్సాస్‌లో డెమోక్రటిక్ అభ్యర్థి జేమ్స్ తలారికో సంచలన విజయం సాధించారు. మాజీ ఉపాధ్యాయుడైన ఆయన.. అధ్యక్షుడు ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడైన రాష్ట్ర అటార్నీ జనరల్ కెన్ పాక్స్టన్‌ను ఓడించారు. 1994 తర్వాత టెక్సాస్‌లో రాష్ట్రస్థాయి పదవిని గెలుచుకున్న తొలి డెమోక్రటిక్ అభ్యర్థిగా చరిత్ర సృష్టించారు. పాక్స్టన్‌కు ట్రంప్ పూర్తి మద్దతు ప్రకటించినప్పటికీ ఫలితం మాత్రం రిపబ్లికన్లకు ప్రతికూలంగా వచ్చింది.

దక్షిణ కరోలినాలో 28 ఏళ్ల ఆధిపత్యానికి గండి
దక్షిణ కరోలినాలోనూ డెమోక్రాట్లు కీలక విజయాన్ని అందుకున్నారు. దాదాపు 28 ఏళ్లుగా రిపబ్లికన్ల ఆధీనంలో ఉన్న సెనేట్ స్థానాన్ని డెమోక్రటిక్ అభ్యర్థి అన్నీ ఆండ్రూస్ కైవసం చేసుకున్నారు. వైద్యురాలైన ఆమె.. రిపబ్లికన్ అభ్యర్థి డార్లిన్ గ్రాహమ్‌పై విజయం సాధించారు. దివంగత సెనేటర్ లిండ్సే గ్రాహమ్ స్థానాన్ని భర్తీ చేయాలనే లక్ష్యంతో డార్లిన్ బరిలోకి దిగారు. 1998 తర్వాత ఈ రాష్ట్రంలో డెమోక్రాట్లు సెనేట్ ఎన్నికల్లో గెలవడం ఇదే తొలిసారి.

నార్త్ కరోలినాలో ట్రంప్ అభ్యర్థికి ఓటమి
నార్త్ కరోలినాలో ట్రంప్ స్వయంగా ఎంపిక చేసిన అభ్యర్థి మైఖేల్ వాట్లీకి ఓటమి తప్పలేదు. డెమోక్రటిక్ అభ్యర్థి రాయ్ కూపర్ విజయం సాధించి కీలక సెనేట్ స్థానాన్ని తన పార్టీ ఖాతాలో వేసుకున్నారు. 2008 తర్వాత ఈ రాష్ట్రం నుంచి సెనేట్‌కు ఎన్నికైన తొలి డెమోక్రటిక్ అభ్యర్థిగా కూపర్ నిలిచారు. గత 50 ఏళ్లలో ఈ రాష్ట్రం నుంచి ఎన్నికైన నాలుగో డెమోక్రటిక్ సెనేటర్‌గా గుర్తింపు పొందారు.

కాన్సాస్‌లో 94 ఏళ్ల ఓటముల పరంపరకు బ్రేక్
కాన్సాస్‌లోనూ డెమోక్రాట్లు అసాధారణ విజయాన్ని నమోదు చేశారు. డెమోక్రటిక్ అభ్యర్థి ఆడమ్ హామిల్టన్.. రిపబ్లికన్ సెనేటర్ రోజర్ మార్షల్‌ను ఓడించారు. మెథడిస్ట్ చర్చికి చెందిన ప్రముఖ పాస్టర్ అయిన హామిల్టన్ విజయం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రాష్ట్రంలో సెనేట్ ఎన్నికల్లో డెమోక్రాట్లు వరుసగా ఎదుర్కొంటున్న 94 ఏళ్ల ఓటముల పరంపరకు ఆయన తెరదించారు. ట్రంప్‌పై పెరుగుతున్న అసంతృప్తికి ఈ ఫలితం నిదర్శనమని విశ్లేషణలు వెలువడుతున్నాయి.

ఒహియోలోనూ రిపబ్లికన్లకు ఎదురుదెబ్బ
ఒహియో రాష్ట్రంలో మాజీ సెనేటర్ షెరాడ్ బ్రౌన్ మరో కీలక విజయాన్ని అందుకున్నారు. రిపబ్లికన్ సెనేటర్ జాన్ హస్టెడ్‌ను ఓడించి సెనేట్ స్థానాన్ని డెమోక్రాట్లకు దక్కేలా చేశారు. దీంతో ఐదు రాష్ట్రాల్లో రిపబ్లికన్లకు ఎదురైన పరాజయాలు ట్రంప్ నాయకత్వంపై రాజకీయ ప్రభావాన్ని చూపించాయి.

మొత్తంగా.. జీవన వ్యయం పెరగడం, దిగుమతి సుంకాలు, ఇరాన్‌తో యుద్ధం వంటి అంశాలపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించింది. ఎన్నికల ప్రచారంలో ట్రంప్ తనను కూడా బ్యాలెట్‌పై ఉన్న అభ్యర్థిగా భావించి ఓటేయాలని ప్రజలకు పదేపదే పిలుపునిచ్చారు. అయితే అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. మరోవైపు డెమోక్రాట్ల ఆధీనంలోకి కాంగ్రెస్ వెళ్లడంతో.. వారు ఆమోదించే బిల్లులను తన వీటో అధికారంతో అడ్డుకుంటానని ట్రంప్ ప్రకటించారు.

ఇదీ చదవండి: డెమోక్రాట్ల విజయంతో భారత్‌కు ఒరిగేదేమిటి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement