వాషింగ్టన్: అమెరికా రాజకీయ చరిత్రలో అబ్దుల్ ఎల్ సయీద్ సరికొత్త రికార్డు సృష్టించారు. మిషిగన్ సెనేట్ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన రిపబ్లికన్ అభ్యర్థి మైక్ రోజర్స్‌పై విజయం సాధించారు. దీంతో అమెరికా చరిత్రలో తొలి ముస్లిం సెనేటర్‌గా నిలిచారు. ఎల్-సయీద్‌కు 18,72,595 ఓట్లు (50.74 శాతం) రాగా, రోజర్స్‌కు 17,45,183 ఓట్లు (47.29 శాతం) వచ్చాయి. 1,27,412 ఓట్ల ఆధిక్యంతో ఆయన గెలుపొందారు.
42 ఏళ్ల ఎల్ సయీద్ ఈజిప్టు సంతతికి చెందినవారు. వృత్తిరీత్యా వైద్యుడు. గతంలో డెట్రాయిట్, వేన్ కౌంటీ ఆరోగ్య విభాగాలకు సారధ్యం వహించారు. 2018లో మిషిగన్ గవర్నర్ పదవికి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతుతో సెనేట్ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆయన ప్రచారంలో అందరికీ ప్రభుత్వ వైద్యం అందించే మెడికేర్ ఫర్ ఆల్ పథకం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తయారీ రంగంలో ఉద్యోగాల కల్పన, సామాన్యులపై జీవన వ్యయ భారాన్ని తగ్గించడం వంటి అంశాలపైనా దృష్టి పెట్టారు.
ఎల్ సయీద్‌కు భారత్‌తోనూ కుటుంబ అనుబంధం ఉంది. ఆయన భార్య డాక్టర్ సారా జుకాకు కుటుంబ పూర్వీకులు కర్ణాటకలోని భత్కల్‌కు చెందినవారు. ఆమె తాత జుకాకు షంషుద్దీన్ గతంలో మైసూరు రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థిక శాఖ డిప్యూటీ మంత్రిగా పనిచేశారు. దాదాపు 20 ఏళ్లుగా దక్షిణ భారతీయ కుటుంబంలో భాగమయ్యానని ఎల్ సయీద్ గతంలో ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మరోవైపు 2026 మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు సెనేట్‌తో పాటు ప్రతినిధుల సభలోనూ ఆధిక్యం సాధించారు. ఈ పరిణామం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి కాంగ్రెస్ నుంచి ఎదురయ్యే రాజకీయ సవాళ్లను పెంచే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: అమెరికా కాంగ్రెస్‌లోకి భారత సంతతి మహిళ.. ఎవరీ పియా దాండియా?


