ఇదీ అమెరికాలో ఉద్యోగాల పరిస్థితి! | US Job Openings Rise to 7 52 Million in September And Quits Increase to 3 4 Million | Sakshi
Sakshi News home page

ఇదీ అమెరికాలో ఉద్యోగాల పరిస్థితి!

Nov 4 2026 6:53 AM | Updated on Nov 4 2026 6:58 AM

US Job Openings Rise to 7 52 Million in September And Quits Increase to 3 4 Million

అమెరికా జాబ్ మార్కెట్‌లో.. సెప్టెంబర్ నెలలో కొన్ని ఆసక్తికరమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకవైపు కొత్త ఉద్యోగ అవకాశాలు పెరుగుతుంటే.. మరోవైపు ఉద్యోగులు స్వచ్ఛందంగా తమ ఉద్యోగాలను వదిలి వెళ్లే వారి సంఖ్య కూడా పెరిగింది. ఈ విషయాన్ని అమెరికా బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్(BLS) విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.

ఉద్యోగ అవకాశాలు
ఉద్యోగ అవకాశాల విషయానికి వస్తే.. సెప్టెంబర్‌లో అమెరికాలో మొత్తం 7.52 మిలియన్ల ఉద్యోగ ఖాళీలు నమోదైనట్లు నివేదిక చెబుతోంది. ఆగస్టులో ఈ సంఖ్య 7.19 మిలియన్లుగా ఉంది. అంటే.. ఒక్క నెలలోనే 3.33 లక్షల ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. ఉద్యోగ అవకాశాల రేటు కూడా 4.3 శాతం నుంచి 4.5 శాతానికి చేరుకుంది. అయితే, ఈ పెరుగుదల ఉన్నప్పటికీ ఉద్యోగ మార్కెట్‌లో పెద్దగా మార్పు కనిపించలేదని బీఎల్ఎస్ పేర్కొంది.

ఈ రంగంలోనే ఎక్కువ
కొత్త ఉద్యోగ నియామకాలు కూడా కొంత పెరిగాయి. సెప్టెంబర్‌లో సుమారు 54.02 లక్షల మంది కొత్తగా ఉద్యోగాల్లో చేరారు. ఆగస్టులో ఈ సంఖ్య 52.71 లక్షలుగా ఉంది. ముఖ్యంగా.. హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార సేవల రంగంలో కొత్త నియామకాలు ఎక్కువగా జరిగినట్లు సమాచారం. ఈ ఒక్క రంగంలోనే 1.58 లక్షల నియామకాలు పెరిగాయి. దీన్ని బట్టి చూస్తే.. ఈ రంగంలో ఉద్యోగుల అవసరం పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఉద్యోగ రాజీనామాలు
ఉద్యోగ రాజీనామాల విషయానికి వస్తే.. సెప్టెంబర్‌లో సుమారు 33.65 లక్షల మంది తమంతట తాముగా ఉద్యోగాలను వదిలేశారు. ఆగస్టులో ఈ సంఖ్య 30.44 లక్షలుగా ఉంది. అంటే.. ఒక్క నెలలోనే మరో 3.21 లక్షల మంది ఉద్యోగాలకు రాజీనామా చేశారన్నమాట. సాధారణంగా ఉద్యోగులు తమకు మెరుగైన జీతం, మంచి ఉద్యోగం లేదా కెరీర్‌లో ఎదుగుదలకు అవకాశం లభిస్తుందని భావించినప్పుడు ప్రస్తుత ఉద్యోగాన్ని వదిలి కొత్త అవకాశాల కోసం ప్రయత్నిస్తుంటారు. అయితే.. రాజీనామాలు పెరగడానికి కారణాలు ఏమిటనేది స్పష్టంగా వెల్లడికాలేదు.

కంపెనీలు ఇలా..
అయితే.. కంపెనీలు ఉద్యోగులను తొలగించే సంఖ్య మాత్రం తగ్గినట్లు నివేదిక చెబుతోంది. సెప్టెంబర్‌లో సుమారు 16.41 లక్షల మంది ఉద్యోగులు తొలగింపులకు గురయ్యారు. ఆగస్టులో ఈ సంఖ్య 17.68 లక్షలుగా ఉంది. దీన్నిబట్టి చూస్తే.. ఉద్యోగుల తొలగింపులు తగ్గినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా.. ఆరోగ్య సంరక్షణ, సామాజిక సేవల రంగంలో తొలగింపులు 70 వేల మేర తగ్గడం గమనార్హం.

మొత్తం మీద.. ఒక్క మాటలో చెప్పాలంటే, అమెరికాలో ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. ఉద్యోగులు కొత్త అవకాశాల కోసం ప్రస్తుత ఉద్యోగాలను వదులుకుంటున్నారు. కంపెనీలు మాత్రం భారీగా ఉద్యోగులను తొలగించే పరిస్థితిలో లేవు. ఈ పరిణామాలన్నీ అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఫెడరల్ రిజర్వ్ తీసుకునే తదుపరి నిర్ణయాలకు కీలకంగా మారనున్నాయి.

ఇదీ చదవండి: కుక్కలను వాకింగ్‌కు తీసుకెళ్తే గంటకు రూ.1,900 జీతం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement