క్యూ2లో రూ. 25,361 కోట్లు
నికర వడ్డీ ఆదాయం 15 శాతం అప్
తగ్గిన మొండి బకాయిలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్(ఎస్‌బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. వార్షికంగా జూలై–సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 20 శాతం జంప్‌చేసి రూ. 25,361 కోట్లకు చేరింది. మ్యూచువల్ ఫండ్, ఎన్‌ఎస్‌ఈ ఐపీవోలలో భాగంగా వాటాలు విక్రయించడంతో లాభాలు అధికమైనట్లు బ్యాంక్ పేర్కొంది.
స్టాండెలోన్ నికర లాభం 14 శాతం వృద్ధితో రూ. 23,038 కోట్లను తాకింది. నికర వడ్డీ ఆదాయం సైతం 15 శాతం పుంజుకుని రూ. 49,143 కోట్లకు చేరింది. అడ్వాన్సుల(రుణాలు)లో 18 శాతం వృద్ధి తోడ్పడింది. అయితే నికర వడ్డీ మార్జిన్లు నామమాత్ర క్షీణతతో 2.94 శాతానికి పరిమితమయ్యాయి. దేశీ ఎన్‌ఐఎం 0.11 శాతం నీరసించి 3.11 శాతంగా నమోదైనట్లు బ్యాంక్ చైర్మన్ సీఎస్ శెట్టి వెల్లడించారు. ఎఫ్‌సీఎన్‌ఆర్(బీ)లో భాగంగా 10.9 బిలియన్ డాలర్ల డిపాజిట్లు సమీకరించగా.. ఆర్‌బీఐ పథకంకింద 8.83 బిలియన్ డాలర్లు రుణాలుగా అందించినట్లు వెల్లడించారు.
వాటా విక్రయించినప్పటికీ..
ప్రస్తుత సమీక్షా కాలంలో ఎస్‌బీఐ వడ్డీయేతర ఆదాయం 5 శాతం తగ్గి రూ. 19,066 కోట్లకు పరిమితమైంది. దీనిలో ఐపీవో ద్వారా ఎస్‌బీఐ ఫండ్ మేనేజ్‌మెంట్ వాటా విక్రయంతో రూ. 7,288 కోట్లు అందుకున్నట్లు ఎస్‌బీఐ వెల్లడించింది. ఎన్‌ఎస్‌ఈ ఐపీవోలో వాటా విక్రయం ద్వారా రూ. 2,800 కోట్లు ఆర్జించినట్లు పేర్కొంది. దీంతో పెట్టుబడుల విలువ మెరుగుపడినట్లు తెలియజేసింది. కాగా.. ఈల్డ్స్ బలపడుతున్న కారణంగా ట్రెజరీ కార్యకలాపాలు ప్రభావితమైనట్లు శెట్టి పేర్కొన్నారు. తాజా స్లిప్పేజీలు రూ. 5,227 కోట్లుగా నమోదయ్యాయి.
స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 1.73 శాతం నుంచి 1.39 శాతానికి, నికర ఎన్‌పీఏలు 0.42 శాతం నుంచి 0.36 శాతానికి దిగివచ్చాయి. మొత్తం ప్రొవిజన్లు రూ. 5,400 కోట్ల నుంచి రూ. 4,217 కోట్లకు తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి 16.09 శాతంగా నమోదైంది. అంచనా రుణ నష్టాలకుగాను రూ. 19,500 కోట్లు పక్కనపెట్టినట్లు శెట్టి వెల్లడించారు. మొత్తం డేటా సెంటర్ల రుణ పోర్ట్‌ఫోలియో విలువను రూ. 6,000 కోట్లుగా పేర్కొన్నారు.
ఫలితాల నేపథ్యంలో ఎస్‌బీఐ షేరు బీఎస్‌ఈలో 1.8% నష్టంతో రూ. 970 వద్ద ముగిసింది.


