అనిల్ అంబానీ గ్రూప్‌నకు మరో బిగ్‌ షాక్.. ఏకంగా మరో రూ.510 కోట్లు | ED Attaches Rs 510 Crore More Assets of Reliance Anil Ambani Group | Sakshi
Sakshi News home page

అనిల్ అంబానీ గ్రూప్‌నకు మరో బిగ్‌ షాక్.. ఏకంగా మరో రూ.510 కోట్లు

Nov 3 2026 9:18 PM | Updated on Nov 3 2026 9:21 PM

ED Attaches Rs 510 Crore More Assets of Reliance Anil Ambani Group

న్యూఢిల్లీ: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి చర్యలు చేపట్టింది. బ్యాంకు మోసం కేసులకు సంబంధించి గ్రూప్‌కు చెందిన సుమారు రూ.510 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. తాజా చర్యతో ఇప్పటివరకు ఈడీ జప్తు చేసిన లేదా స్వాధీనం చేసుకున్న ఆస్తుల మొత్తం విలువ దాదాపు రూ.23,100 కోట్లకు చేరింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ), విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) కింద నమోదైన పలు కేసుల్లో ఈ చర్యలు చేపట్టినట్లు ఈడీ వెల్లడించింది.

మంగళవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ బ్యాంకు మోసం కేసులతో పాటు రిలయన్స్ కమ్యూనికేషన్స్ బ్యాంకు మోసం కేసుకు సంబంధించిన ఆస్తులను జప్తు చేశారు. వీటిలో విమానాలు, బ్యాంకు ఖాతాల్లోని నగదు నిల్వలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, స్థిరాస్తులు, రావాల్సిన బకాయిలు, పెట్టుబడులు ఉన్నాయి.

రిలయన్స్ కమ్యూనికేషన్స్ కేసులో భాగంగా 2 చార్టర్డ్ విమానాలు, మహారాష్ట్రలోని 6 భూముల స్థలాలు, ఒక కార్యాలయ ప్రాంగణాన్ని ఈడీ జప్తు చేసింది. మరోవైపు రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్‌కు సంబంధించిన బ్యాంకు మోసం కేసులో తమిళనాడులోని 2 పవన విద్యుత్ కేంద్రాలు (విండ్‌మిల్లులు), బ్యాంకు నిల్వలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పెట్టుబడులు, రావాల్సిన బకాయిలను స్వాధీనం చేసుకుంది.

సీబీఐ ఢిల్లీ, ఢిల్లీ ఆర్థిక నేరాల విభాగం, ముంబై ఆర్థిక నేరాల విభాగం నమోదు చేసిన పలు ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, రిలయన్స్ పవర్ లిమిటెడ్, రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ సంస్థలు దర్యాప్తు పరిధిలో ఉన్నాయని ఈడీ తెలిపింది.

బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న ప్రజాధనాన్ని పక్కదారి పట్టించడం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం సంస్థల ఆస్తులను రక్షించుకునేందుకు దివాలా పరిష్కార ప్రక్రియ (ఐబీసీ) చట్టాన్ని దుర్వినియోగం చేయడం, భారత్‌లోని ప్రజాధనాన్ని విదేశాల్లోని పన్ను స్వర్గధామాలకు తరలించడం వంటి వ్యవహారాలు దర్యాప్తులో వెలుగుచూశాయని ఈడీ పేర్కొంది. ఇందులో గణనీయమైన మొత్తాన్ని ప్రమోటర్లు, వారి కుటుంబ సభ్యుల వ్యక్తిగత ప్రయోజనాల కోసం వినియోగించినట్లు ఆరోపించింది.

ఈ కేసులకు సంబంధించి ఇప్పటివరకు 10 మందిని అరెస్టు చేసినట్లు ఈడీ వెల్లడించింది. పీఎంఎల్‌ఏ కింద 6 ప్రాసిక్యూషన్ ఫిర్యాదులు దాఖలు చేయగా, ఫెమా నిబంధనల కింద మరో ఫిర్యాదును కూడా సమర్పించింది. తాజా జప్తులతో అనిల్ అంబానీ గ్రూప్‌పై ఈడీ చర్యల పరిధి మరింత విస్తరించింది. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని ఆస్తుల జప్తులు, తదుపరి చట్టపరమైన చర్యలు ఉంటాయా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.

ఇదీ చదవండి: తులం బంగారానికి కేజీ వెండి? తగ్గుతోన్న తేడా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement