దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్ల సమాచారానికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది. సిరియసిమ్ అనే పేరుతో.. ఓ గుర్తుతెలియని హ్యాకర్ల బృందం ఎస్‌బీఐ కస్టమర్లకు సంబంధించిన సమాచారం తమ వద్ద ఉన్నట్లు పేర్కొంది. ఇందులో.. వ్యక్తిగత వివరాలు, రుణ దరఖాస్తులు, బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు సమర్పించిన డాక్యుమెంట్స్ ఉన్నాయని ఆరోపించింది.
సైబర్‌పల్స్56 అనే సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన సోషల్ మీడియా ఖాతా.. ఈ విషయాన్ని ఎక్స్ (X) వేదికగా వెల్లడించింది. ఇందులో సిరియసిమ్ బృందం వద్ద సుమారు 3.8 లక్షల డేటా రికార్డులు, మరో 2,722 పీడీఎఫ్ డాక్యుమెంట్లు ఉన్నాయని పేర్కొంది.
కస్టమర్లకు ప్రమాదం ఉందా?
ఒకవేళ లీక్ అయిన డేటా నిజమైనదని తేలితే.. దాన్ని ఉపయోగించి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు, బ్యాంకు అధికారులమని చెప్పుకుంటూ ఫోన్ చేసి కస్టమర్లను నమ్మించడం, వ్యక్తిగత వివరాలు అడగడం, నకిలీ సందేశాలు పంపడం వంటివి చేయవచ్చు. అంతే కాకుండా.. కస్టమర్ల చిరునామాలు, లోన్ దరఖాస్తుల వివరాలు ఇతరుల చేతుల్లోకి వెళితే వాటిని ఉపయోగించి ఆర్థిక మోసాలకు పాల్పడే ప్రమాదం ఉంది.
నిజంగానే ఎస్‌బీఐ డేటా లీక్ అయిందా?
హ్యాకర్ల బృందం చేసిన ఆరోపణలు, సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల ఆధారంగా ఎస్‌బీఐ సర్వర్లు హ్యాక్ అయ్యాయని కచ్చితంగా చెప్పలేము. ఈ డేటా అసలు ఎక్కడి నుంచి వచ్చింది?, నిజంగా బ్యాంకుకు చెందినదేనా?, ఎంతమంది కస్టమర్ల సమాచారం ప్రభావితమైంది?, అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.
సైబర్ భద్రతపై ఆందోళనలు
ప్రస్తుతం బ్యాంకింగ్ సేవల్లో ఎక్కువ భాగం డిజిటల్ రూపంలో అందుబాటులోకి వచ్చింది. మొబైల్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ లావాదేవీలు, డిజిటల్ రుణ దరఖాస్తులు పెరుగుతున్నాయి. దీంతో కస్టమర్ల సమాచారాన్ని రక్షించడం బ్యాంకులకు మరింత కీలకంగా మారింది.
ఈ నేపథ్యంలో.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా బ్యాంకుల సైబర్ భద్రతకు సంబంధించిన నిబంధనలను మరింత పటిష్టం చేసే చర్యలు చేపట్టింది. బ్యాంకులు తమ వ్యవస్థలను సురక్షితంగా ఉంచడంతో పాటు, కస్టమర్ల సమాచారాన్ని దుర్వినియోగం కాకుండా రక్షించాల్సిన అవసరం ఉంది.
ఎస్‌బీఐ కస్టమర్లకు సూచనలు
➤ప్రస్తుతానికి డేటా లీక్ ఆరోపణలు నిర్ధారణ కాలేదు. అయినప్పటికీ.. కస్టమర్లు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
➤బ్యాంకు అధికారులమని ఫోన్ చేసే అపరిచిత వ్యక్తులకు ఓటీపీ, ఏటీఎం పిన్, పాస్‌వర్డ్‌లు చెప్పకూడదు.
➤అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయకూడదు.
➤ఖాతాలో జరిగే లావాదేవీలను ఎప్పటికప్పుడు పరిశీలించాలి.
➤ఏదైనా అనధికార లావాదేవీ కనిపిస్తే వెంటనే బ్యాంకును సంప్రదించాలి.
ఇదీ చదవండి: బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్.. ఇక ఏం జరగనుంది?


