సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామంలో సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటు కోసం కేటాయించిన భూమిలో సరైన నిర్మాణాలు చేపట్టకపోయినా, సెమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.500 కోట్ల భారీ రుణం ఎలా మంజూరు చేసిందో అర్థం కావడం లేదని శుక్రవారం హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. రుణం మంజూరు చేసే సమయంలో రుణగ్రహీత ఆదాయ వనరులు, తిరిగి చెల్లించే సామర్థ్యం తదితర అంశాలపై బ్యాంకు తగిన పరిశీలన చేయాలి కదా అని జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం ప్రశ్నించింది.
కేవలం తనఖా లేదా పూచీకత్తును ఆధారంగా చేసుకుని ఇంత భారీ రుణం మంజూరు చేయడం సమంజసం కాదంది. రూ.500 కోట్ల భారీ రుణం ఇస్తున్నప్పుడు ఎస్బీఐ తగిన జాగ్రత్తలు తీసుకోలేదని వ్యాఖ్యానించింది. దీనిపై పూర్తి వివరాలు అవసరమని భావిస్తూ.. సీబీఐని సుమోటోగా ప్రతివాదిగా చేర్చింది. ప్రస్తుత వ్యాజ్యానికి సంబంధించిన పూర్తి పత్రాలు, గతంలో కంపెనీ దాఖలు చేసిన వ్యాజ్యం, వాటిపై ఇచ్చిన ఉత్తర్వుల ప్రతులను సీబీఐ న్యాయవాదికి వెంటనే అందజేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది. రావిర్యాలలోని ఫ్యాబ్‌సిటీ సెజ్‌లో సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటుకు కేటాయించిన భూమిని తిరిగి స్వా«దీనం చేసుకుంటూ ప్రభుత్వం జారీ చేసిన లేఖను సవాల్ చేస్తూ హైకోర్టులో ఎస్బీఐ పిటిషన్ దాఖలు చేసింది.
2006లో ఎంఓయూ: 2006లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంఎస్ సెమ్ ఇండియా ఫ్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు 2007లో ప్రభుత్వం 100 ఎకరాలను 66 ఏళ్ల లీజుకు కేటాయించింది. పరిశ్రమ ఏర్పాటులో పురోగతి లేకపోవడంతో 2010లో 78 ఎకరాలను వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. మిగిలిన 22 ఎకరాలను సవరించిన లీజు నిబంధనలతో కంపెనీకి కొనసాగించింది. ప్రభుత్వ ఎన్‌ఓసీల ఆధారంగా కంపెనీకి సుమారు రూ.500 కోట్ల రుణమిచ్చామని, 2011, ఆగస్టు 20న భూమిపై తనఖా హక్కులు పొందామని ఎస్బీఐ పేర్కొంది. అయితే.. 2010లోనే 78 ఎకరాలను వెనక్కి తీసుకుంటే.. 2011లో బ్యాంకు రుణం ఎలా మంజూరు చేసిందని న్యాయమూర్తి ప్రశ్నించారు.


