దేశంలో విదేశీ వర్శిటీల ఏర్పాటు ఎంవోయూలతోనే సరి
2023లోనే యూజీసీ ప్రత్యేక నిబంధనలు
ఇంకా ఏర్పాటు కాని క్యాంపస్‌లు నిబంధనల
సడలింపు కోరుతున్న విద్యాసంస్థలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సహా దేశవ్యాప్తంగా విదేశీ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ప్రభుత్వాలు చేస్తున్న కృషి కార్యాచరణకు నోచుకోవడం లేదు. గత గ్లోబల్ సమ్మిట్‌లో దాదాపు 24 విదేశీ విద్యాసంస్థలతో ఎంవోయూలు చేసుకున్నారు. వీటిల్లో ఏ ఒక్కటీ ఇప్పటివరకు క్యాంపస్‌ల ఏర్పాటుకు ముందుకు రాలేదు.
వాస్తవానికి యూజీసీ 2023లో విదేశీ విద్యాలయాల ఏర్పాటుకు ప్రత్యేక నిబంధనలను తీసుకొచ్చింది. అవి అమల్లోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా ఆశించిన స్థాయిలో విదేశీ వర్సిటీల క్యాంపస్‌లు దేశంలో విస్తరించలేదు. మరోవైపు కొన్ని అంతర్జాతీయ విద్యాసంస్థలు భారత్‌లో అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపుతున్నా.. నియంత్రణ పరమైన నిబంధనలు, ఆర్థిక సాధ్యత, మౌలిక సదుపాయాలు, నిర్వహణ స్వేచ్ఛ వంటి అంశాలు సవాళ్లుగా మారుతున్నాయి.
నిబంధనల్లో ఏముంది?
2023 నవంబర్ 7న యూజీసీ రూపొందించిన నిబంధనల ప్రకారం.. భారత్‌లో క్యాంపస్ ఏర్పాటు చేసుకోవాలంటే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్–500లో ఉండాలి. లేదా సంబంధిత సబ్జెక్టు విభాగంలో టాప్–500లో స్థానం సంపాదించి ఉండాలి. దరఖాస్తు చేసుకున్న తర్వాత స్టాండింగ్ కమిటీ సిఫారసుల ఆధారంగా యూజీసీ మొదట ప్రాథమిక అనుమతి, లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేస్తుంది.
అనంతరం క్యాంపస్ నిర్మాణం, సిబ్బంది, విద్యా వసతులు, ఇతర ఏర్పాట్లను పరిశీలించి కార్యకలాపాలు ప్రారంభించేందుకు లెటర్ ఆఫ్ అప్రూవల్ ఇస్తుంది. ఎల్‌వోఐ వచ్చిన రెండేళ్లలో క్యాంపస్‌ను సిద్ధం చేయాలి. ప్రవేశాల విధానం, ఫీజుల నిర్ణయం, అధ్యాపకుల నియామకం, వారి వేతనాలు, ఉద్యోగ నిబంధనలను సొంతంగా నిర్ణయించుకోవచ్చు. మాతృదేశంలోని క్యాంపస్ ప్రమాణాలకు అనుగుణంగా విద్యను అందించాలి. ఇవి ప్రదానం చేసే డిగ్రీలకు భారత్‌లోని ప్రధాన క్యాంపస్ డిగ్రీలతో సమాన గుర్తింపు ఉంటుంది.
నిబంధనల అడ్డు
విదేశీ విశ్వవిద్యాలయాలకు అకడమిక్ స్వేచ్ఛ కల్పించినప్పటికీ కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ప్రతి కొత్త కోర్సును ప్రారంభించే ముందు యూజీసీ అనుమతి తీసుకోవాలి. ఆన్‌లైన్, ఓపెన్, డిస్టెన్స్ లెరి్నంగ్ విధానాల్లో కోర్సులు నిర్వహించడానికి అనుమతి లేదు. అలాగే విదేశీ విశ్వవిద్యాలయాలు తమ సొంత భూమి, భవనాలు, మానవ వనరులతో క్యాంపస్‌లను ఏర్పాటు చేసుకోవాలి.
భారతీయ విశ్వవిద్యాలయాల మౌలిక సదుపాయాలను పంచుకుని క్యాంపస్ నిర్వహించుకునే వెసులుబాటు లేదు. ప్రతి క్యాంపస్‌కు ప్రత్యేక దరఖాస్తు అవసరం. ఈ నిబంధనలు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలకు ప్రారంభ పెట్టుబడుల భారాన్ని భారీగా పెంచుతున్నాయి. అందువల్ల నిబంధనల్లో పలు సడలింపులను, నిర్వహణలో మరింత స్వేచ్ఛను వర్సిటీలు కోరుతున్నాయి.
విదేశీ నిధుల విషయంలో సంక్లిష్టత
విదేశీ విశ్వవిద్యాలయాలు భారత్‌లో క్యాంపస్ ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలంటే విదేశీ పెట్టుబడులకు సంబంధించిన నిబంధనలు అడ్డుపడుతున్నాయి. క్యాంపస్ నిర్వహణకు అవసరమైన విదేశీ నిధుల రాక, ఇక్కడి ఆదాయాన్ని మాతృదేశానికి బదిలీ చేయడం, పరిశోధనలకు అంతర్జాతీయ గ్రాంట్లు పొందడం వంటి అంశాల్లో ఫారిన్ ఎక్సే్ఛంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఎఫ్‌ఈఎంఏ), విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) తదితర చట్టాల్లోని నిబంధనలు సంక్లిష్టంగా ఉన్నాయి.
2026 ఆగస్టు నాటికి యూజీసీ విదేశీ వర్సిటీలకు 16 లెటర్ ఆఫ్ ఇంటెంట్‌లు జారీ చేసింది. ఆ్రస్టేలియా, ఇటలీ, బ్రిటన్, అమెరికాకు చెందిన విశ్వవిద్యాలయాలు వీటిలో ఉన్నాయి. యూనివర్సిటీ ఆఫ్ యార్క్, యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్, యూనివర్సిటీ ఆఫ్ అబెర్డీన్, ఇల్లినాయిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలకు ముంబైలో, యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్‌కు గురుగ్రామ్‌లో, యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్‌కు బెంగళూరులో కార్యకలాపాలు ప్రారంభించేందుకు అనుమతులు లభించాయి.
విద్యార్థులపై ఫీజుల భారం ఎంత?
విదేశీ వర్సిటీల్లో ఫీజులు ఎంత ఉంటాయన్నది కూడా కీలకం. విదేశాల్లో చదవడంతో పోలిస్తే, ఇక్కడి విదేశీ వర్సిటీల్లో చదివితే ప్రయాణం, వసతి, ఇతర జీవన వ్యయాలు తగ్గుతాయి. కానీ క్యాంపస్ ఏర్పాటుకు భారీగా పెట్టుబడులు పెట్టిన వర్సిటీలు ఆ వ్యయాన్ని ఫీజుల రూపంలో విద్యార్థుల నుంచి వసూలు చేసే అవకాశముంది. ఫలితంగా సామాన్య, మధ్యతరగతి విద్యార్థులకు ఈ కోర్సులు అందుబాటులో ఉంటాయా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.


