క్షుద్ర పూజలు చేస్తాం.. నీ కూతురు తిరిగొస్తుంది! | Cheated of 50 Lakh: Black Magic Fraud in Keesara | Sakshi
Sakshi News home page

క్షుద్ర పూజలు చేస్తాం.. నీ కూతురు తిరిగొస్తుంది!

Nov 28 2026 12:44 AM | Updated on Nov 28 2026 12:44 AM

Cheated of 50 Lakh: Black Magic Fraud in Keesara

వివరాలను వెల్లడిస్తున్న ఏసీపీ చక్రపాణి

అలా జరగకుంటే ఆమెను పెళ్లాడిన వ్యక్తిని చంపేస్తాం 

ఓ వ్యక్తికి ఆలయ పూజారి దంపతుల రూ.50 లక్షల టోకరా 

ప్రధాన నిందితుడు అరెస్ట్, మరో ఇద్దరు పరారీ

కీసర: ప్రత్యేక తాంత్రిక క్షుద్ర పూజలు, ఇతర ఆచారాల సాకుతో ఓ వ్యక్తి నుంచి రూ. 50 లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడ్డ ప్రధాన నిందితుడిని కీసర పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. ఏసీపీ చక్రపాణి, కీసర పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓ ఎలక్షన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కుందనపల్లి గ్రామానికి చెందిన మణికంఠ రాము (53) కుమార్తె బ్రహ్మణి ఈ నెల 6న తుడుము రాముని ప్రేమ వివాహం చేసుకోవడంతో తండ్రి తీవ్ర మనో వేదనకు గురయ్యాడు. మానసిక ప్రశాంతత కోసం కీసరలోని కాళీమాత ఆలయాన్ని సందర్శించిన రాముకు ఆలయ పూజారి కాళం క్రాంతికుమార్, అతడి భార్య రత్న పరిచయమయ్యారు.

ఇతడి పరిస్థితిని ఆసరాగా చేసుకొని ప్రత్యేక పూజలు, తాంత్రిక ఆచారాలు నిర్వహించడం ద్వారా అతడి కుమార్తె మనసు మార్చి తిరిగి తీసుకువస్తామని, లేదంటే ఆమెను వివాహం చేసుకున్న వ్యక్తిని అంతమొందిస్తామని నమ్మబలికారు. అందుకు రూ.50 లక్షలు ఖర్చు అవుతుందని స్పష్టం చేశారు. పలుమార్లు బాధితుని నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ క్రమంలో పూజారి భార్య రత్న కూడా రూ. 8 లక్షలు తీసుకున్నారు. అదేవిధంగా పూజారి దంపతులకు సహాయకారిగా ఆలయంలో ఉండే పుట్టి సాయి అనే వ్యక్తి ద్వారా కూడా నిందితుడు డబ్బు తీసుకోవడం జరిగింది.

దశలవారీగా డబ్బు తీసుకుంటూ ఈ నెల 9న బాధితుడు రామును రాంపల్లికి తీసుకెళ్లి ఒక పత్రంపై సంతకం చేయించి, మొబైల్‌ ఫోన్‌తో పాటు సిమ్‌ కార్డును తీసుకొని ఆధారాలు దొరక్కుండా ధ్వంసం చేశారు. అదేవిధంగా తిరిగి రాము దగ్గర్నుంచి డబ్బులు వసూలు చేసేందుకు కీప్యాడ్‌ మొబైల్, కొత్త సిమ్‌ కార్డు ఇచ్చారు. అనుమానం వచ్చిన రాము ఆలయం వద్దకు వెళ్లి తనను మోసం చేశారని, డబ్బులు తిరిగి ఇవ్వాలని గొడవకు దిగాడు. వారు తిరిగిఇచ్చేది లేదని చెప్పడం, కూతురు సైతం తిరిగి తన దగ్గరకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో రాము పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ క్రమంలో ఈ నెల 26న కీసరలోని కాళీమాత ఆలయం వద్ద పోలీసులు క్రాంతి కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో రూ. 2.50 లక్షల నగదు, 4.8 గ్రాముల బంగారు ఉంగరం, సుమారు 50 తులాల వెండి బిస్కట్లు, బాధితునికి చెందిన ఏటీఎం కార్డు, రెండు మొబైల్‌ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం క్రాంతి చూపించిన మేరకు రాంపల్లిలోని తన నివాసంలో అదనంగా రూ. 22,52,500 నగదును స్వా«దీనం చేసుకున్నారు. క్రాంతిని అరెస్ట్‌ చేసి, కోర్టులో హాజరు పరిచారు. రత్న, పుట్టి సాయి పరారీలో ఉన్నారు. వీరిని పట్టుకోవడానికి ప్రత్యేక గాలింపు చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement