ఎల్‌నినో వేళ తెలంగాణ ముందస్తు చర్యలు భేష్‌: ఐఎండీ | Telanganas proactive measures during El Nino are commendable IMD | Sakshi
Sakshi News home page

ఎల్‌నినో వేళ తెలంగాణ ముందస్తు చర్యలు భేష్‌: ఐఎండీ

Nov 27 2026 10:25 PM | Updated on Nov 27 2026 10:25 PM

Telanganas proactive measures during El Nino are commendable IMD

హైదరాబాద్‌: ఎల్‌నినో ప్రభావంతో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు ముందస్తు ప్రత్యామ్నాయ ప్రణాళికలు, రైతు అవగాహన కార్యక్రమాలు, సమన్వయంతో కూడిన జల నిర్వహణ చర్యలు చేపడుతున్న తెలంగాణ ప్రభుత్వ విధానం ప్రశంసనీయమని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొంది. డిసెంబర్‌ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ క్లైమేట్‌ కాన్‌క్లేవ్‌–2026 కర్టెన్‌ రైజర్‌ ప్రారంభ సమావేశంలో ఐఎండీ హైదరాబాద్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌.స్టెల్లా ప్రసంగించారు.

వాతావరణ పరిస్థితులను ముందుగానే అంచనా వేసి సకాలంలో చర్యలు తీసుకోవడం, శాస్త్రీయ ప్రణాళికలు రూపొందించడం, ప్రజలను భాగస్వాములను చేయడం ద్వారా ఎల్‌నినో ప్రభావాన్ని గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సమక్షంలో డాక్టర్‌ స్టెల్లా సమగ్ర ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ప్రతివారం నిర్వహిస్తున్న ‘రైతు నేస్తం’ కార్యక్రమాల ద్వారా రైతులకు అవగాహన కల్పించడంతోపాటు శాస్త్రీయ సూచనలను క్షేత్రస్థాయికి చేరవేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలను ఆమె ప్రత్యేకంగా అభినందించారు.

మార్చి వరకు ఎల్‌నినో పరిస్థితులు
ప్రస్తుతం బలమైన ఎల్‌నినో పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ చేపట్టిన ముందస్తు సన్నద్ధత చర్యలకు అత్యంత ప్రాధాన్యం ఉందని డాక్టర్‌ స్టెల్లా పేర్కొన్నారు. ఈ పరిస్థితులు 2027 మార్చి వరకు కొనసాగే అవకాశముందని, జూన్‌ నాటికి సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందని వివరించారు.

ఎల్‌నినో ప్రభావంతో రానున్న వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడంతోపాటు నీటి వనరులపై అదనపు ఒత్తిడి ఏర్పడే అవకాశముందని తెలిపారు. అయితే ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడిన ప్రతిసారీ కరవు తప్పనిసరిగా వస్తుందని భావించడం సరికాదని స్పష్టం చేశారు. శాస్త్రీయ వాతావరణ సూచనలను పాటించడం, నీటి లభ్యతకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవడం, జల సంరక్షణ చర్యలు చేపట్టడం, సకాలంలో ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రతికూల ప్రభావాన్ని తగ్గించవచ్చన్నారు. వేసవిలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు, వ్యవసాయ కూలీలు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికులకు వడగాలులపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.

గ్రామస్థాయిలోనే పంటల ప్రణాళిక
వ్యవసాయ నిపుణుడు డాక్టర్‌ జి.వి.రామాంజనేయులు మాట్లాడుతూ.. వాతావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు తెలంగాణ వ్యవసాయ విధానాల్లో మౌలిక మార్పులు అవసరమన్నారు. వాతావరణ మార్పులను తక్షణమే వెనక్కి మళ్లించే ప్రయత్నాల కంటే, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ రంగాన్ని సిద్ధం చేయడం మరింత ఆచరణాత్మకమని పేర్కొన్నారు.

గ్రామస్థాయిలోనే నీటి లభ్యత, నేల స్వభావం, వాతావరణ అనుకూలత ఆధారంగా పంటల ప్రణాళిక రూపొందించాలని సూచించారు. వరి వంటి అధిక నీటి అవసరమున్న పంటలకే పరిమితం కాకుండా చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఉద్యాన పంటలు, వ్యవసాయ–అటవీ విధానాల వైపు రైతులను ప్రోత్సహించాలన్నారు.

నేల ఆరోగ్యాన్ని పునరుద్ధరించడం, నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం, సమర్థవంతమైన పంటల బీమా అమలు, కౌలు రైతులకు సంస్థాగత సహాయం, ప్రత్యామ్నాయ పంటలకు భరోసాతో కూడిన కొనుగోలు వ్యవస్థ అవసరమని డాక్టర్‌ రామాంజనేయులు పేర్కొన్నారు. నీటి లభ్యత, వాతావరణ అనుకూలత, మార్కెట్‌ డిమాండ్‌, దీర్ఘకాలిక సుస్థిరతలను ప్రాతిపదికగా చేసుకొని వ్యవసాయ ప్రణాళికలను రూపొందిస్తేనే రైతాంగాన్ని వాతావరణ సవాళ్ల నుంచి రక్షించగలమని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement