హైదరాబాద్/ముంబై: తెలంగాణ ప్రభుత్వం రూపొందించి, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (CGG) సాంకేతిక సహకారంతో అభివృద్ధి చేసిన సమీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ‘ప్రజావాణి’ (Prajavani) జాతీయ స్థాయి గుర్తింపు పొందింది. శుక్రవారం ముంబైలో జరిగిన ఏఐ ట్రాన్స్‌ఫర్మేషన్ కాన్‌క్లేవ్ వేదికగా నిర్వహించిన ‘పరివర్తన్ అవార్డ్స్ 2026’ (Parivartan Awards 2026)లో భాగంగా 'ప్రజావాణి' పోర్టల్‌కు ప్రతిష్టాత్మక ‘డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఎక్సలెన్స్’ అవార్డు లభించింది. సాంప్రదాయ పద్ధతిలో కాగితాలపై జరిగే ఫిర్యాదుల ప్రక్రియ స్థానంలో పూర్తిస్థాయి ఆధునిక, పారదర్శక డిజిటల్ వ్యవస్థను తీసుకొచ్చి, ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచినందుకుగాను ఈ పురస్కారం దక్కింది.
తెలంగాణ ప్రభుత్వం, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తరపున రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్మెంట్ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డైరెక్టర్ జనరల్ రవి గుప్తా, ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి కే విద్యాసాగర్ ఈ పురస్కారాన్ని మహారాష్ట్ర లోని ముంబై లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో అందుకున్నారు.
విప్లవాత్మక మార్పులు
ప్రజల సమస్యలను సకాలంలో, జవాబుదారీతనంతో పరిష్కరించే లక్ష్యంతో రూపొందించిన ‘ప్రజావాణి’ పోర్టల్; రాష్ట్ర స్థాయి ప్రజాభవన్ మొదలుకొని జిల్లా కలెక్టరేట్లు, ఆర్డీఓ, కార్యాలయాలు, మండల పరిషత్ స్థాయి వరకు అన్ని పరిపాలనా విభాగాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది.
ఈ డిజిటల్ వేదిక ప్రధాన విశేషాలు
* బహుళ-స్థాయి ఆటోమేటెడ్ రూటింగ్
పౌరులు సమర్పించిన అర్జీలు నేరుగా సంబంధిత శాఖాధిపతులు (HODs), క్షేత్రస్థాయి అధికారులకు ఆటోమేటిక్‌గా చేరేలా స్మార్ట్ వర్క్‌ఫ్లో విధానం.
* రియల్-టైమ్ ట్రాకింగ్ & పారదర్శకత
ప్రతి ఫిర్యాదుకు ప్రత్యేక రసీదు సంఖ్య (Acknowledgement ID), ఎస్ఎంఎస్ (SMS) అలర్ట్‌ల ద్వారా, ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే తమ అర్జీ స్థితిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో తెలుసుకునే వెసులుబాటు.
* డేటా ఆధారిత పర్యవేక్షణ: పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను సమీక్షించడానికి, గడువులోగా పరిష్కారం జరిగేలా చూడటానికి ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లకు ఉపయోగపడే రియల్-టైమ్ అనలిటికల్ డ్యాష్‌బోర్డులు.
* విస్తృత స్థాయి ప్రభావం
ఇప్పటివరకు లక్షకు పైగా ప్రజా ఫిర్యాదులను అత్యధిక పరిష్కార రేటుతో విజయవంతంగా పరిష్కరించి, వికేంద్రీకృత ప్రజా సేవలందించడంలో ‘ప్రజావాణి’ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన సుపరిపాలన అందించాలనే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి, అలాగే అత్యుత్తమ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నిర్మించడంలో CGG పాత్రకు, తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధికి ఈ జాతీయ గుర్తింపు నిదర్శనమని నిర్వాహకులు పేర్కొన్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వం పౌర సంబంధాల శాఖ కమిషనర్ బీజే సింగ్, ఐ లాంచ్ నిర్వాహకులు ఈ అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, పేరెన్నిక కలిగిన ఐ.టి. ఆధారిత పారిశ్రామిక ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏ.ఐ. ఆధారిత సేవల ద్వారా మరింత మెరుగైన అవకాశాలను చర్చించారు. ప్యానల్ డిస్కషన్ లో రవి గుప్తా పాల్గొని తమ సలహాలను అందించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సాంకేతిక ఆధారిత ప్రజా ప్రయోజనాల విధానాన్ని వివరించారు.


