సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు చేపల మార్కెట్లలో ఆహార భద్రతా ప్రమాణాలను ఉల్లంఘిస్తున్న వ్యాపారులపై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ (టీజీ-సేఫ్) విభాగం అధికారులు కొరడా ఝుళిపించారు. ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా వెటర్నరీ అధికారులతో కలిసి ఈరోజు బేగంబజార్, రాంనగర్, ముషీరాబాద్ ప్రాంతాల్లోని మార్కెట్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో మానవ వినియోగానికి ఏమాత్రం పనికిరాని, తీవ్రంగా పాడైపోయిన చేపలను పెద్ద ఎత్తున గుర్తించి అక్కడికక్కడే పారబోశారు.

తనిఖీల్లో భాగంగా బేగంబజార్‌లోని జీఎన్‌బీ శ్రీనివాస ఫిష్ మర్చంట్ దుకాణంలో సుమారు 70 కిలోల కుళ్లిన బొచ్చె (కట్ల) చేపలను అధికారులు తొలగించారు. అలాగే రాంనగర్‌లోని బిన్సన్స్ ఫిషరీలో 65 కిలోలు, ముషీరాబాద్‌లోని జీబీకే ఫిషరీస్‌లో 30 కిలోలు, ఎస్వీఆర్ షాపులో 35 కిలోల తిలాపియా చేపలతో పాటు ఇతర దుకాణాల్లో అపరిశుభ్రంగా నిల్వ ఉంచిన చేపలను గుర్తించి సీజ్ చేశారు. నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించిన రాంనగర్‌లోని రెండు వ్యాపార సంస్థలకు అధికారులు క్లోజర్ నోటీసులు జారీ చేశారు.

చేపలు ఎక్కువ రోజులు తాజాగా కనిపించేందుకు వ్యాపారులు ఫార్మాలిన్, నైట్రేట్ వంటి హానికర రసాయనాలను వాడుతున్నారా అనే కోణంలో అధికారులు ప్రాథమిక పరీక్షలు చేపట్టారు. మరింత సమగ్ర విశ్లేషణ కోసం చేపల నమూనాలను సేకరించి స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపించారు. తప్పనిసరిగా ఉండాల్సిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సులు లేకుండా, అపరిశుభ్ర పరిస్థితుల్లో విక్రయాలు సాగిస్తున్న పలువురు వ్యాపారులకు నోటీసులు అందజేశారు. నిబంధనలు పాటించకుండా కుళ్లిన ఆహార పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: అర్ధరాత్రి హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం


