Rotten Meat
-
హైదరాబాద్‌లో ఇలాంటి మాంసాన్ని తింటున్నామా?
సాక్షి, హైదరాబాద్: ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి.. కుళ్లిపోయిన మేకలు, గొర్రెల మాంసం విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టయ్యింది. నిల్వ ఉంచిన కుళ్ళిన గొర్రె, మేక మాంసాన్ని (పాయా, ముడి, బీజా, గురుదా, కలేజీ తదితర అవయవాలు) విక్రయిస్తున్న ఒక భారీ నెట్‌వర్క్‌ను హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ (గోల్కొండ టీమ్), హెచ్-ఫాస్ట్ (H-FAST) మరియు మంగళ్‌హాట్ పోలీసులు సంయుక్తంగా ఛేదించారు.మంగళ్‌హాట్‌లోని 'A to Z షీప్ అండ్ గోట్ ఆఫ్ఫల్' స్టోర్‌పై మెరుపు దాడి చేసి సుమారు 12 టన్నుల కుళ్లిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ. పది లక్షలు ఉంటుందని అంచనా. నిందితుడు రఫీ అహ్మద్‌ను అరెస్ట్ చేయగా.. మరో నిందితుడు, స్టోర్ యజమాని మొహమ్మద్ అఫ్రోజ్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.అఫ్రోజ్‌పై గతంలో జీహెచ్ఎంసీ జరిమానా విధించడంతో పాటు, మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. నిందితుడు రఫీ అహ్మద్.. యజమాని అఫ్రోజ్ సహాయంతో హోల్‌సేల్ మార్కెట్ నుండి తక్కువ ధరకు పాడైపోయిన గొర్రె, మేక అవయవాలను సేకరించేవాడు. ఈ మాంసాన్ని మంగళ్‌హాట్, అమాన్ నగర్ కాలనీలోని తమ స్టోర్‌లో నిల్వ చేసేవారు. మాంసం కుళ్లిపోకుండా దుర్వాసన రాకుండా ఉండేందుకు డీప్ ఫ్రీజర్లు, నిల్వ ఉన్న నీటితో నింపిన ప్లాస్టిక్ టబ్బులలో ఎక్కువ కాలం నిల్వ ఉంచేవారు. అనంతరం, ఈ కుళ్లిన మాంసాన్ని తాజా మాంసంగా నమ్మించి హోటళ్లు, శుభకార్యాలకు, ఇతర ఈవెంట్లకు సరఫరా చేసేవారని పోలీసులు తెలిపారు. -
హైదరాబాద్‌లో ఇలాంటి చికెన్ తింటున్నామా..?
సాక్షి, హైదరాబాద్: ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ, నిల్వ ఉంచిన కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తున్న ఓ చికెన్ సెంటర్‌పై వారసిగూడ పోలీసులు దాడి చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ముషీరాబాద్ బాపూజీ నగర్‌లోని 'ఏ-1 ఫ్రెష్ చికెన్ మార్ట్' (A-1 Fresh Chicken Mart) యజమాని షేక్ షకీల్ కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తున్నాడు. అపరిశుభ్రమైన వాతావరణంలో నిల్వ ఉంచిన ఫ్రోజన్ చికెన్‌ను స్థానిక ప్రజలకు, చిన్న వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.దీంతో ఇవాళ మధ్యాహ్నం సమయంలో వారసిగూడ సబ్ ఇన్స్పెక్టర్ కే.రామచంద్రారెడ్డి తన సిబ్బందితో చికెన్ సెంటర్లో తనిఖీలు చేపట్టారు. సుమారు 610 కిలోల చికెన్ అత్యంత అపరిశుభ్రమైన స్థితిలో నిల్వ ఉంచినట్లు గుర్తించారు. నిల్వ ఉంచిన మాంసం పూర్తిగా కుళ్లిపోయి, దుర్వాసన వెదజల్లుతోంది. ఆ ప్రదేశంలో ఎలుకలు, పిల్లుల సంచారం ఉండటంతో మాంసం పూర్తిగా కలుషితమైంది. కాగా, సదరు చికెన్ షాపు ట్రేడింగ్ లైసెన్స్ ఏడాది క్రితమే ముగిసినప్పటికీ, నిందితుడు నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు తేలింది. -
నెల్లూరులో భారీగా కుళ్లిన చికెన్.. అక్కడ వేస్ట్‌గా కొనుగోలు చేసి.. ఇక్కడ ఫ్రెష్‌గా..
కాసుల వేటలో కొందరు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తమిళనాడులో చికెన్ వ్యర్థాలుగా పడేసే లివర్, కందనకాయలతో పాటు నిల్వ చికెన్‌ను వేస్ట్‌గా కొనుగోలు చేసి నెల్లూరులో ఫ్రెష్ చికెన్‌గా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. కొంత కాలం క్రితం నిరంతరం నిఘాతో మున్సిపల్ హెల్త్ అధికారుల దాడులతో సర్దుమణిగిన నిల్వ చికెన్ వ్యాపారం మళ్లీ ఇటీవల కాలంలో పుంజుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా మున్సిపల్ హెల్త్ అధికారుల దాడుల్లో నిల్వ ఉంచిన చికెన్‌తో పాటు లివర్, కందనకాయలు చెన్నై నుంచి తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసి విక్రయాలు చేస్తున్నట్లు వెలుగుచూసింది. కొందరు ముఠాగా ఏర్పడి చెన్నై పరిసరాల నుంచి కొనుగోలు చేసిన ఇలాంటి వ్యర్థాలను హోటల్స్‌కు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సాక్షి, నెల్లూరు: తమిళనాడులో చికెన్ లివర్, కందనకాయలకు డిమాండ్ తక్కువ. ఇక్కడ చికెన్ కేజీ ధరలతోనే లివర్, కందనకాయలను కొనుగోలు చేస్తుంటారు. ఇదే అదనుగా ఓ ముఠా చెన్నై నుంచి నెల్లూరుకు భారీగా చికెన్ లివర్, కందనకాయలను దిగుమతి చేస్తున్నారు. నగరంలోని చికెన్ స్టాల్స్, హోటల్స్, రెస్టారెంట్లకు విక్రయిస్తుంటారు. కేవలం రూ.30 నుంచి రూ.40లకే అక్కడ దొరికే లివర్, కందనకాయలు తీసుకొచ్చి చికెన్ ధరలకు విక్రయిస్తున్నారు. ఈ తంతు గత కొన్నేళ్లుగా జరుగుతోంది. గతంలో ఇప్పటి మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ ఆధ్వర్యంలో పలు దుకాణాలపై దాడులు చేసి గుర్తించిన విషయం తెలిసిందే. తిరిగి వెంకటరమణ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ ముఠా ఆగడాలకు మరోసారి అడ్డుకట్టవేశారు. కేజీ రూ.100లకే విక్రయం తమిళనాడు రాష్ట్రం నుంచి ప్రతి వారం భారీగా నిల్వ చికెన్, లివర్, కందనకాయల మాంసాన్ని రూ.40లకే కొనుగోలు చేసి ట్రక్కుల ద్వారా నెల్లూరుకు తరలిస్తున్నారు. ఈ ముఠా సభ్యులు తమ ఇళ్లలో నిల్వ చేసి చికెన్ స్టాల్స్, హోటల్స్, రెస్టారెంట్లకు రూ.100లకు విక్రయిస్తున్నారు. తమిళనాడులో లివర్, కందనకాయలు తినడం వల్ల అనారోగ్యాలు వస్తాయని వాటిని కొనుగోలు చేయరు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం చికెన్ ధరతో సమానంగా లివర్, కందనకాయలను విక్రయిస్తుంటారు. తమిళనాడులో నిల్వ ఆహారాన్ని నెల్లూరుకు గుట్టుచప్పుడు కాకుండా వివిధ వాహనాల్లో దిగుమతి చేసుకుంటున్నారు. నెల్లూరుతో పాటు ఒంగోలు, గుంటూరు, విజయవాడ ప్రాంతాలకు సైతం ఈ మాంసం తరలివెళుతుంది. విస్తృత తనిఖీలు అవసరం మున్సిపల్ హెల్త్ ఆఫీసర్‌గా వెంకటరమణ గతంలో విధులు నిర్వహించిన సమయంలో నగరంలో అనేక ప్రాంతాల్లో దాడులు చేశారు. బోడిగాడితోట వద్ద కుళ్లిన మాంసం నిల్వలపై, చికెన్ స్టాల్స్, హోటల్స్, రెస్టారెంట్లు, బేకరీలపై వరుస దాడులతో విక్రయదారుల్లో భయాందోళన నెలకొంది. ఆ తర్వాత ఆయన మరో విభాగానికి బదిలీ కావడంతో కొంత కాలం ఈ ముఠా ఆగడాలు మళ్లీ చెలరేగాయి. తిరిగి ఎంహెచ్‌ఓగా వెంకటరమణ బాధ్యతలు తీసుకోవడంతో ఈ ముఠా ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మళ్లీ విస్తృత స్థాయిలో దాడులు చేస్తే ఇలాంటి నిల్వ మాంసం విక్రయాలు గుట్టురట్టు అయ్యే అవకాశం ఉంది. 400 కేజీల నిల్వ మాంసం పట్టివేత ►నోటీసులు జారీ, రూ.25 వేల జరిమానా నగరంలోని మైపాడుగేటు వేణుగోపాల్‌నగర్‌లో ఉన్న ఓ చికెన్ స్టాల్లో గుట్టుచప్పుడు కాకుండా 27వ తేదీ నాటి నిల్వ ఉంచిన చికెన్ లివర్, కందనకాయలను ఆరిఫ్ అనే వ్యక్తి ఓ ఐస్‌క్రీమ్ వాహనం నుంచి దిగుమతి చేసుకుంటుండగా మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వెంటకరమణ తన బృందంతో ఆకస్మిక దాడులు చేశారు. 400 కేజీల చెడిపోయిన మాంసాన్ని గుర్తించారు. దీంతో ఫినాయిల్ పోసి నిర్వీర్యం చేశారు. మాంసాన్ని చెత్త వాహనాల్లో డంపింగ్ యార్డ్‌కు తరలించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ప్రజలు నాణ్యమైన ఆహారం కొనుగోలు చేసేందుకు వస్తారని, ఇలా చెడిపోయిన ఆహారాన్ని విక్రయించడం ద్వారా నమ్మకాన్ని కోల్పోతారన్నారు. ప్రజలకు అనారోగ్య కలిగించే ఆహారాన్ని ఎవరైనా విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చికెన్ స్టాల్‌కు నోటీసులు జారీ చేసి, రూ.25 వేలు జరిమానా విధించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పెంచలయ్య మాట్లాడుతూ 27వ తేదీనాటి మాంసాన్ని నెల్లూరుకు తరలించి దిగుమతి చేయడాన్ని వెంకటరమణ బృందం దాడులు చేసి పట్టుకున్నారని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన ఆహారా న్ని మాత్రమే విక్రయించాలన్నారు. -
రెస్టారెంట్లో బిర్యానీ తింటున్నారా?.. అయితే మీకో చేదు వార్త
కర్నూలు: జిల్లాలోని పలు రెస్టారెంట్లు, హోటళ్లలో పాచిపోయిన ఆహార పదార్థాలను వేడి చేసి వడ్డిస్తున్నట్లు తేలింది. బార్ అండ్ రెస్టారెంట్లు, హోటళ్లలో ఆహార పదార్థాల నాణ్యతపై ఫిర్యాదుల నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి ఆదేశాల మేరకు.. ఆ విభాగం కర్నూలు ప్రాంతీయ అధికారి తిరుమలేశ్వరరెడ్డి నేతృత్వంలో శనివారం కర్నూలు జిల్లాలోని పలు రెస్టారెంట్లు, బార్లు, హోటళ్లలో అధికారులు నిర్వహించిన తనిఖీల్లో పలు అక్రమాలు వెలుగుచూశాయి. కుళ్లిన కూరగాయలు వినియోగించడం, పాచిపోయిన ఆహారాన్ని వేడి చేసి వడ్డిస్తున్నట్లు గుర్తించారు. వంటశాలలు అపరిశుభ్రంగా ఉన్నాయి. మాంసాహార పదార్థాలు రోజుల తరబడి ఫ్రిజ్‌లో ఉంచి అవసరమైనప్పుడు తీసి ఉడికించడం, లేదంటే వేడి చేసి మసాలాలు, రంగులు కలిపి రుచికరంగా తయారు చేసి అందిస్తున్నట్లు గుర్తించి పలు హోటళ్లు, రెస్టారెంట్లకు జరిమానాలు విధించారు. విజిలెన్స్ అధికారులతో పాటు ఫుడ్ సేఫ్టీ, తూనికలు కొలతలు, శానిటరీ సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, సీఐలు నాగరాజు యాదవ్, కేశవరెడ్డి, ఏఏఓ షణ్ముఖ గణేష్, ఏజీ సిద్ధయ్య, ఎఫ్ఎస్ఓ శేఖర్‌రెడ్డి, రాముడు, తూనికలు కొలతల శాఖ అధికారి కుమార్, అనిల్ తదితరులు బృందాలుగా ఏర్పడి కర్నూలుతో పాటు కోడుమూరు, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. కర్నూలులోని ల్యాటిట్యూడ్ రెస్టారెంట్లో ముందు రోజు వండిన ఆహార పదార్థాలు ఫ్రిజ్‌లో పెట్టి అవసరమైనప్పుడు వేడి చేసి వినియోగదారులకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. అలాగే రెడ్ ఫుడ్ కలర్ వాడినట్లు గుర్తించి రూ.5 వేలు జరిమానా విధించారు. అలాగే కర్నూలులోని మసాలా బౌల్ హోటల్, నాగార్జున పార్క్ లేన్ బేకర్స్‌లో వంటశాల అపరిశుభ్రంగా ఉండడంతో రూ.5 వేలు చొప్పున జరిమానా విధించారు. బావార్చీ మల్టీ రెస్టారెంట్లో ముందు రోజు వండిన ఆహార పదార్థాలు ఫ్రిజ్‌లో ఉంచి వేడిచేసి వినియోగిస్తున్నందుకు రూ.10 వేలు, అనిల్ బార్ అండ్ రెస్టారెంట్లో సరైన శుభ్రత లేని కారణంగా రూ.5 వేలు అపరాధ రుసుం విధించారు. అలాగే కోడుమూరు రెడ్డీస్ హోటల్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు వాడుతున్నట్లు గుర్తించి 6ఏ కేసు నమోదు చేశారు. అలాగే కోడుమూరులోని శివ హోటల్లో వాటర్ బాటిళ్లు ఎంఆర్పీ కంటే రూ.5 అధికంగా విక్రయిస్తున్నట్లు గుర్తించి తూనికలు కొలతల శాఖ అధికారులు రూ.2 వేలు ఫైన్ వేశారు. ఎమ్మిగనూరులోని అమృత బార్ అండ్ రెస్టారెంట్, గ్రాండ్ మహల్ హోటళ్లలో వంటశాలలు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించి రూ.10 వేలు, రూ.2 వేలు అపరాధ రుసుం విధించారు. చదవండి: చదివింది ఏడో తరగతి.. వామ్మో ఈమె మామూలు లేడీ కాదు.. షిఫ్ట్ కారులో వచ్చి.. -
మటన్ కొంటున్నారా? జర జాగ్రత్త! విజయవాడలో భారీగా కుళ్లిన మాంసం పట్టివేత
సాక్షి, విజయవాడ: విజయవాడలో మాంసం దుకాణాలపై వీఎంసీ అధికారులు దాడులు చేపట్టారు. కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తున్నారన్న సమాచారంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమలో మాచవరం, బీఆర్టీఎస్ రోడ్డు, ప్రకాష్‌నగర్, కొత్తపేట మార్కెట్లలో సోదాలు జరిపారు. మాచవరంలో 500 కేజీల కుళ్లిన మాంసాన్ని అధికారులు పట్టుకున్నారు. కుళ్లిన మాంసం విక్రయిస్తున్న వ్యాపారిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వెటర్నటీ సర్జన్ డాక్టర్ రవిచంద్ర మాట్లాడుతూ.. మాంసాన్ని కొనే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కుళ్లిపోయిన మాంసాన్ని తినడం వల్ల అనారోగ్యానికి గురవుతారని, తద్వారా అనేక రోగాలు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. మొత్తం పరిశీలన చేసిన తరువాతే మాసం కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. కుళ్లిపోయిన మాంసాన్ని ఎవరైనా విక్రయిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చదవండి: నాపరాళ్లతో వెళ్తున్న లారీ బోల్తా.. ముగ్గురు కూలీలు దుర్మరణం


