వామ్మో.. ఇదేమి ఘోరం! | Large amount of rotten meat found in Tirupati | Sakshi
Sakshi News home page

వామ్మో.. ఇదేమి ఘోరం!

Jun 13 2026 4:45 AM | Updated on Jun 13 2026 4:45 AM

Large amount of rotten meat found in Tirupati

కుళ్లిపోయిన మాంసం, తలలు, కాళ్లను బయటకు తీసిన సిబ్బంది

తిరుపతిలో పెద్ద ఎత్తున కుళ్లిన మాంసం లభ్యం

పలు షాపుల్లో అధికారుల సోదాలు 

పొరుగు రాష్ట్రాల నుంచి పొట్టేలు, మేక తలలు, కాళ్లు, మాంసం తీసుకొచ్చి నిల్వ చేసినట్లు గుర్తింపు 

సుమారు అర టన్ను కుళ్లిన మాంసం స్వాధీనం చేసుకున్నట్లు అధికారుల ప్రకటన 

మరింత ఎక్కువగానే పాడైపోయిన మటన్‌ ఉంటుందని అంచనా 

ఉలిక్కిపడిన తిరుపతి నగర వాసులు

తిరుపతి తుడా: తిరుపతి నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పెద్ద ఎత్తున కుళ్లిన మాంసం చూసి జనం వామ్మో... ఇదేమి ఘోరం.. అంటూ నివ్వెరపోయారు. నగరపాలక సంస్థ ఆరోగ్యశాఖ అధికారులు శుక్రవారం నగరంలోని పలు దుకాణాల్లో సోదాలు చేశారు. ఫ్రిజ్‌లు, వెలుపల పెద్ద ఎత్తున నిల్వ చేసిన మాంసాన్ని గుర్తించారు. పలుచోట్ల కుళ్లిపోయి, పాచిపట్టి, పురుగులు ఉండడంతో అధికారులు ఖంగుతిన్నారు.  

పీర్ల చావిడి స్లాటర్‌ హౌస్‌పై మెరుపు దాడి 
నగరంలో కుళ్లిన మాంసం నిల్వ చేశారంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రజా ఆరోగ్య శాఖ అధికారులు కృష్ణాపురం పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని పీర్ల చావడి స్లాటర్‌ హౌస్‌పై దాడులు నిర్వహించారు. ఐదారు షాపుల్లో పొట్టేలు, మేకల తలకాయలు, కాళ్లు, ఇతర అవయవాలు నిల్వలను గుర్తించారు. ఇవన్నీ రోజుల తరబడి అపరిశుభ్రమైన ప్రదేశంలో డంప్‌ చేయడంతోపాటు ప్రీజర్లలో నిల్వ ఉంచడాన్ని గుర్తించి స్వాదీనం చేసుకున్నారు. కుళ్లిపోయి, పురుగులు పట్టి దుర్వాసన వస్తున్నాయి.  

పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి 
తిరుపతిలోని కొందరు మాంసం విక్రయించే వ్యాపారులకు చెన్నై, హైదరాబాద్‌తో లింకులు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. మెట్రో నగరాల్లో నిల్వ ఉంచిన, గడువు ముగిసిన మాంసాన్ని రసాయనాలు చల్లి తిరుపతి మార్కెట్‌కు దిగుమతి చేసుకుంటున్నట్లు నిర్ధారణకు వచ్చారు. లేబుళ్లు, తయారీ తేదీలు లేకుండా కుళ్లిపోయి, రంగు మారిన స్థితిలో ఉన్న తలలు, కాళ్లను పలు హోటళ్లకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని తేల్చారు.

నిల్వ ఉంచిన మాంసం విక్రయిస్తే చర్యలు: హెల్త్‌ ఆఫీసర్‌  
కుళ్లిన, నిల్వ ఉంచిన మాంసం, ఆహార పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, జరిమానాలు విధించడంతోపాటు వ్యాపా­రుల ట్రేడ్‌ లైసెన్స్‌లు రద్దు చేస్తామని తిరుపతి నగరపాలక సంస్థ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ యువ అన్వేష్‌ చెప్పారు. పలు షాపుల్లో తమ సిబ్బందితో కలిసి తనిఖీలు చేయగా, అర టన్ను మేర నిల్వ ఉంచిన పొట్టేళ్లు, మేకల తలకాయలు, కాళ్లు, ఇతర భాగాల మాంసం గుర్తించి సీజ్‌ చేశామని తెలిపారు. ఫ్రీజర్‌లో కుళ్లిపోయి దుర్వాసన వస్తున్న మాంసాన్ని ఇనుప చువ్వలతో లాగాల్సిన పరిస్థితి ఏర్పడిందని, పరిసరాలు కూడా అపరిశుభ్రతతో దారుణంగా ఉందని వివరించారు. కాగా, అధికారులు చెప్పిన దాని­కన్నా మరింత ఎక్కువగానే కుళ్లిన మాంసం ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement