సదస్సులో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం భట్టి. చిత్రంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్
రూ.25,096 కోట్ల డీపీఆర్‌లకు 60 రోజుల్లో ఆమోదం తెలపాలి
పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అందించాలి
విద్యుత్ మంత్రుల సదస్సులో కేంద్రానికి డిప్యూటీ సీఎం భట్టి విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి, ప్రసార, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు కేంద్రం పూర్తి సహకారం అందించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కోరారు. శుక్రవారం న్యూఢిల్లీలోని అశోకా హోటల్‌లో కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి మనోహర్‌లాల్ అధ్యక్షతన జరిగిన రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రుల సదస్సులో భట్టి పాల్గొని పలు అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.
⇒ రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (ఆర్‌డీఎస్‌ఎస్) కింద స్మార్ట్ మీటర్లు, పంపిణీ నష్టాల తగ్గింపు, ఆధునికీకరణకు రూ.25,096 కోట్ల విలువైన డీపీఆర్‌లను మే 27న పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు సమరి్ప ంచామని భట్టి తెలిపారు. ఇప్పటివరకు కేవలం రూ.72 కోట్లు మాత్రమే అందాయని, పెండింగ్ డీపీఆర్‌లకు 60 రోజుల్లో ఆమోదం తెలిపి, పనుల గడువును 2028 మార్చి 31 వరకు ఇవ్వాలని కోరారు.
⇒ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు చేపట్టే పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు మెగావాట్‌కు రూ.కోటి చొప్పున వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) అందించాలని భట్టి విజ్ఞప్తి చేశారు. టీజీ జెన్‌కో చేపట్టనున్న కల్లూరు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు సీఈఏ త్వరితగతిన ఆమోదం తెలపాలని, 2,000 మెగావాట్ అవర్ల బ్యాటరీ నిల్వ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయాలన్నారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించడంతో కృతజ్ఞతలు తెలిపారు.
⇒ అంతర్రాష్ట్ర విద్యుత్ ప్రసార ఛార్జీల లెక్కింపును ప్రతినెలా వెల్లడిస్తూ, ఏడాదికి ఒక్కసారి సర్దుబాటు చేసే పారదర్శక విధానం తేవాలని భట్టి సూచించారు. పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులకు ప్రసార ఛార్జీల మినహాయింపును 2030 మార్చి 31 వరకు పొడిగించాలన్నారు. రాయ్‌గఢ్–పుగళూర్–త్రిస్సూర్ హెచ్‌వీడీసీ లైన్‌కు పూర్తి జాతీయహోదా ఇవ్వడంతోపాటు సేడం–పరిగి 400 కేవీ లైన్, మహేశ్వరం–2 సబ్‌స్టేషన్లను అంతర్రాష్ట్ర ప్రాజెక్టులుగా చేపట్టాలన్నారు.
⇒ రానున్న వేసవిలో విద్యుత్ కొరత నివారణకు 2027 ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 30 వరకు దేశంలోని అన్ని గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలను అందుబాటులో ఉంచేలా విద్యుత్ చట్టం సెక్షన్–11 కింద ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సదస్సులో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్, టీజీ ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్ పాల్గొన్నారు.
రూ.200 లక్షల కోట్ల పెట్టుబడి అవకాశాలు: కేంద్ర మంత్రి ఖట్టర్
రాబోయే రెండు దశాబ్దాల్లో దేశ విద్యుత్ రంగంలో రూ.200 లక్షల కోట్ల భారీ పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ప్రైవేట్ రంగం సమష్టిగా కృషి (టీమ్‌వర్క్) చేస్తేనే ఈ లక్ష్యాన్ని సాధించగలమని కేంద్ర విద్యుత్, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్పష్టం చేశారు. సదస్సులో ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ ఉత్పత్తి, స్టోరేజ్, ట్రాన్స్‌మిషన్, పంపిణీ వ్యవస్థలను ఒకే ఏకీకృత విధానంలో ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లాలన్నారు.


