పెట్టుబడులు, పర్యావరణం రెండు కళ్లు | Investments and Environment Are the Two Eyes of Telangana: Revanth Reddy | Sakshi
Sakshi News home page

పెట్టుబడులు, పర్యావరణం రెండు కళ్లు

Nov 28 2026 1:17 AM | Updated on Nov 28 2026 1:17 AM

Investments and Environment Are the Two Eyes of Telangana: Revanth Reddy

ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్‌కు జ్ఞాపికను బహూకరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. చిత్రంలో వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా డాక్టర్‌ రాజేంద్రసింగ్, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క

రెండింటికీ సమాన ప్రాధాన్యం: సీఎం రేవంత్‌రెడ్డి

ప్రకృతి పరిరక్షణ విషయంలోనూ ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఉంటుంది 

వచ్చిన సలహాలు, సూచనలతో ప్రత్యేక పాలసీని రూపొందిస్తున్నాం 

సమష్టిగా కరువును ఎదుర్కోవాలి 

రైతులపైనా బాధ్యత ఉంది... రాష్ట్రంలో పాలసీ పెరాలసిస్‌ లేదు 

తెలంగాణ క్లైమేట్‌ కాన్‌క్లేవ్‌–2026 కర్టెన్‌ రైజర్‌ కార్యక్రమం

సాక్షి, హైదరాబాద్‌: తమకు పర్యావరణం, పెట్టుబడులు రెండూ రెండు కళ్ల వంటివని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. పెట్టుబడుల సదస్సుతోపాటు పర్యావరణానికి కూడా తాము సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని, ఈ రెండింటినీ సమతుల్యం చేయాలని భావించామన్నారు. ‘సహజ వనరులను చెరబట్టి విధ్వంసం చేస్తే వచ్చే పరిణామాలే సునామీలు, కరువు వంటి ప్రకృతి విపత్తులు. సమతుల్యత పాటించకపోతే భవిష్యత్‌ తరాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది’ అని అన్నారు. 

అందుకే ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ శ్రీశ్రీ రవిశంకర్, వాటర్‌మన్‌ ఆఫ్‌ ఇండియా డా.రాజేంద్ర సింగ్‌తోపాటు పర్యావరణవేత్తల నుంచి పెట్టుబడుల ఆకర్షణతోపాటు పర్యావరణ పరిరక్షణ కోసం సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నామన్నారు. వచ్చిన సలహాలు, సూచనలతో ప్రత్యేక పాలసీని రూపొందిస్తున్నామని తెలిపారు. శుక్రవారం ఐటీసీ కాకతీయ హోటల్‌లో తెలంగాణ క్లైమేట్‌ కాన్‌క్లేవ్‌–2026 కర్టెన్‌ రైజర్‌ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ పెట్టుబడుల కోసమే ఈ సదస్సును నిర్వహించడం లేదన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం అనుభవజు్ఞలతో చర్చించి ఒక విధానాన్ని రూపొందించడానికే ఈ కాన్‌క్లేవ్‌ను ఏర్పాటు చేశామన్నారు. 

తెలంగాణది చెరువుల చరిత్ర 
‘వందేళ్ల క్రితం కొమురం భీం బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా జల్, జమీన్, జంగల్‌ కోసం పోరాటం చేశారు. జల్, జమీన్, జంగల్‌ కోసం త్యాగాలు చేసిన చరిత్ర మనది. రేచర్ల రుద్రదేవుడు, రాణి రుద్రమదేవి వరంగల్‌లో అనేక చెరువులను తవి్వంచారు. రామప్ప, పాకాల వంటి చెరువులు నిర్మించారు. మేము ఎవరి నుంచి నకలు చేయాల్సిన అవసరం లేదు. గుజరాత్‌ మోడల్‌ను కాపీ చేయాల్సిన అవసరం లేదు. మన చరిత్ర నుంచే స్ఫూర్తి పొందుతున్నాం. మహమ్మద్‌ బిన్‌ ఖిల్జీని రేచర్ల రుద్రదేవుడు మూడుసార్లు ఓడించారు.

కాకతీయుల కాలంలో గొలుసుకట్టు చెరువులను నిర్మించారు. తెలంగాణది చెరువుల చరిత్ర’ అని అన్నారు. ‘‘చెరువులను ఆక్రమించడం వల్ల వరద నీరు వెళ్లడానికి దారి లేక కాలనీల్లోకి ప్రవేశించి ముంచెత్తుతోంది. ఈ విషయంలో పేదలకు ఎలాంటి అన్యాయం జరగనివ్వడం లేదు. నష్టపోయిన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నాం. మూసీ మురికికూపంలా మారింది. భవిష్యత్తులో అత్యంత సుందరమైన మూసీ నదిని తీర్చిదిద్దుతాం. మూసీపై అనేక అభ్యంతరాలు వచ్చినా వెనక్కి తగ్గలేదు. భావి తరాల కోసం పనిచేస్తున్నాం..అందుకే గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహిస్తున్నాం’ అని రేవంత్‌ తెలిపారు.  

కోవిడ్‌ తరహాలోనే ఎదుర్కోవాలి... 
‘భవిష్యత్‌ తరాల కోసం ఈ కార్యక్రమాలను చేపడుతున్నాం. ఫలితాలు ఈరోజు రావొచ్చు.. రేపు రావొచ్చు. సునామీలు, భూకంపాలు వస్తే నష్టం వెంటనే జరుగుతుంది. కానీ కరువు అలా కాదు. ఎల్‌నినో ప్రభావం ఒక్క తెలంగాణలోనే లేదు. ప్రపంచంలోని అనేక దేశాల్లో దీని ప్రభావం ఉంది. వాతావరణ మార్పులను ఎదుర్కోవాలి. 2 గంటల్లో 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అందరం వాతావరణ మార్పులపై దృష్టి పెట్టాలి. వచ్చే రెండేళ్లకు సరిపోయే తిండి గింజలు ఉన్నాయి. ప్రభుత్వం సరఫరా చేస్తుంది. కానీ నీళ్లు లేవు. ఈ సమస్యలను అధిగమించాలి. కరువును రాజకీయాలకు అతీతంగా ఎదుర్కోవాలి. కోవిడ్‌ తరహాలోనే కలిసికట్టుగా అంతా కలిసి ఎల్‌నినోను ఎదుర్కోవాలి’ అని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. 

తప్పు చేసినవాళ్లను వదలం.. 
‘రైతులు ఒక పంటను త్యాగం చేస్తే పశుపక్ష్యాదులకు నీళ్లు ఉంటాయి. మానవాళిని కాపాడుకునే బాధ్యత రైతులకు ఉంది. రైతుల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. తెలంగాణ సమ్మిట్‌కు దేశవిదేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు’ అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ‘రాష్ట్రంలో పాలసీ పెరాలసిస్‌ లేదు. అనేక పాలసీలు తెచ్చాం. 3 వేల మందితో ఈగల్‌ ఫోర్స్‌ డ్రగ్స్‌ను నియంత్రిస్తోంది. కేంద్రం కూడా ఈగల్‌ ఫోర్స్‌ను అభినందించింది. ఆహార కల్తీ నియంత్రణకు టీజీ సేఫ్‌ తీసుకువచ్చాం. చెరువుల పునరుద్ధరణకు హైడ్రా తెచ్చాం. ఈ మూడు సంస్థలు దేశంలో ఎక్కడా లేవు’ అని అన్నారు.

‘డ్రగ్స్‌ను కఠినంగా అణచివేస్తున్నాం.. వారిని వదలడం లేదు. డ్రగ్స్‌ వల్ల పంజాబ్‌ తీవ్రంగా నష్టపోయింది. సీఎం కుర్చీలో నేను ఉన్నంతకాలం తప్పు చేసినవాళ్లను వదలం’ అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఎస్‌ సంజయ్‌జాజు, అటవీశాఖ స్పెషల్‌ సీఎస్‌ జయేశ్‌రంజన్, పీసీసీఎఫ్‌ వినయ్‌కుమార్, పద్మశ్రీ చింతల వెంకటరెడ్డి, పదినగరాల మేయర్లు, పదిమంది సర్పంచ్‌లు, పాడి, తోటరైతులు, మహిళాసంఘాల ప్రతినిధులు, ఎన్జీవోలు, వివిధరంగాల నిపుణులు చర్చల్లో పాల్గొన్నారు.

ఈ కాంక్లేవ్‌ కర్టన్‌రైజర్‌లో భాగంగా ‘పట్టణ వాతావరణమార్పుల సవాళ్లు–ప్రజారోగ్యం’, నీటి భద్రత, నీటిపారుదలరంగం, జీవవైవిధ్యం, అడవులు పర్యావరణ వ్యవస్థ, పునరుత్పాదక ఇంథనం, సర్క్యులర్‌ ఎకానమీ తదితర అంశాలపై రైతులు, పర్యావరణవేత్తలు, ఎన్జీవోలు, సర్పంచ్‌లు, అధికారులు, నిపుణులు ఐదు బృందాలుగా ఏర్పడి జరిపిన సమాలోచనల ఆధారంగా పలు సూచనలను ప్రభుత్వానికి అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement