2019-24 మధ్య పెట్టుబడులు రాలేదన్నది విషప్రచారమే: దువ్వూరి కృష్ణ | Duvvuri Krishna on investments made between 2019 and 2024 | Sakshi
Sakshi News home page

2019-24 మధ్య పెట్టుబడులు రాలేదన్నది విషప్రచారమే: దువ్వూరి కృష్ణ

Nov 27 2026 3:01 PM | Updated on Nov 27 2026 3:19 PM

Duvvuri Krishna on investments made between 2019 and 2024

తాడేపల్లి: ఏపీలోని కూటమి ప్రభుత్వ తీరుపై వైఎస్సార్‌సీపీ పీఏసీ మెంబర్‌ దువ్వూరి కృష్ణ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలోనే రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వచ్చాయని తెలిపారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వచ్చిన పెట్టుబడులను కూడా చంద్రబాబు తన ప్రభుత్వ ఖాతాలో వేసుకుంటున్నారని చెప్పారు. వైఎస్‌ జగన్‌ కృషితోనే రాష్ట్రానికి పెట్టుబడులు వస‍్తున్నాయని వివరించారు. వైఎస్సార్‌సీపీ హయాంలోనే జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ కడపకు వచ్చిందని చెప్పారు. కాకినాడలో ఏర్పాటు చేస్తున్న ఏఎం గ్రీన్‌ కో వైఎస్సార్‌సీపీ హయాంలోనే వచ్చిందని అన్నారు.

వైఎస్సార్‌సీపీ హయాంలోనే ఎన్‌టీపీసీ వచ్చిందని చెప్పారు. కూటమి వచ్చాక అనేక పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయని వివరించారు. కూటమి ప్రారంభిస్తున్న అనేక ప్రాజెక్టులు వైఎస్సార్‌సీపీ హయాంలోనే వచ్చాయని తెలిపారు. పెట్టుబడులపై కూటమి ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతోందని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం కంటే గత వైఎస్సార్‌సీపీ హయాంలో పెట్టుబడులు వచ్చాయని వివరించారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ఎక్కడ విధ్వంసం జరిగిందో కూటమి చెప్పాలని సవాలు విసిరారు. మోండల్‌ జెడ్‌ కూడా వైఎస్సార్‌సీపీ హయాంలోనే ప్రారంభమైందన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ పనిగట్టుకుని అబద్ధాలు చెబుతున్నారని తెలిపారు. కూటమి అబద్ధాలు చెప్పడంలో స్పీడ్‌.. పనిచేయడంలో స్లోగా ఉందని చెప్పారు.

కూటమి ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకుంటోంది.. 
ఏపీకి 2019–24 మధ్య పెట్టుబడులు రాలేదన్నది విషప్రచారమేనని దువ్వూరి కృష్ణ తెలిపారు. ‘‘గత ప్రభుత్వంలో జరిగిన పారిశ్రామిక ప్రగతిని కూటమి ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకుంటోంది. 2014–19 మధ్య కంటే 2019–24లోనే తయారీ రంగంలో మెరుగైన వృద్ధి నమోదైంది. 2017, 2018 సీఐఐ సమ్మిట్ల పెట్టుబడుల్లో వాస్తవ రూపం దాల్చింది కేవలం 7 నుంచి 17 శాతమే. వైఎస్‌ జగన్ హయాంలో 2023 గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో కుదిరిన ఒప్పందాల్లో 75 శాతం వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. వైఎస్‌ జగన్ హయాంలో కుదిరిన ఒప్పందాలు, వచ్చిన అనుమతులు, ప్రారంభమైన నిర్మాణ పనులకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం క్రెడిట్ కొట్టేస్తోంది. రూ.2.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే పునాదులు పడ్డాయి. కడప స్టీల్ ప్లాంట్‌కు 2023 మార్చి 4నే జేఎస్‌డబ్ల్యూ సంస్థతో ఒప్పందం జరిగింది.

కాకినాడ గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు అవసరమైన రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులకు జగన్ ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది. అదానీ పంప్డ్ స్టోరేజ్, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టులకు జగన్ హయాంలోనే కీలక అనుమతులు, భూ ఒప్పందాలు జరిగాయి. రామాయపట్నం పోర్టును జగన్ తేవటం వలనే  బీపీసీఎల్ పెట్టుబడికి మార్గం సుగమమైంది. రూ.1.10 లక్షల కోట్ల ఏబీసీ క్లీన్‌టెక్ పెట్టుబడికి సంబంధించి 2023లోనే ఒప్పందం జరిగింది. మళ్లీ కొత్తగా ఎంఓయూ ఎందుకు? బ్రూక్‌ఫీల్డ్ పెట్టుబడి ప్రతిపాదనలు కూడా 2023లోనే వెలుగులోకి వచ్చాయి.

హీరో ఫ్యూచర్ ఎనర్జీ, జేఎస్‌డబ్ల్యూ నియో, గ్రీన్‌కో, రెన్యూ పవర్ వంటి సంస్థల పెట్టుబడి ప్రతిపాదనలు వైఎస్‌ జగన్ హయాంలోనే వచ్చాయి. గత ప్రభుత్వంలో వచ్చిన జీఓలను రద్దు చేస్తూ.. ఇప్పుడు కొత్త పెట్టుబడులుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇండోసోల్ సోలార్ తయారీ ప్రాజెక్టు నుంచి గ్రీన్ హైడ్రోజన్ వరకు.. మొత్తం రెన్యూవబుల్ ఎనర్జీ వాల్యూ చైన్‌కు వైఎస్‌ జగన్ హయాంలోనే పునాదులు పడ్డాయి. శ్రీ సిమెంట్, రామ్‌కో సిమెంట్ వంటి పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు, నిర్మాణాలు, కార్యకలాపాలు జగన్ ప్రభుత్వ హయాంలోనే ముందుకు సాగాయి. పెట్టుబడులపై కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాలే గత ప్రభుత్వ పనితీరుకు సాక్ష్యం.  2019–24 మధ్య ఏపీలో తయారీ రంగ స్థిర మూలధన వృద్ధి 5.94 శాతం కాగా, 2014–19లో 4.9 శాతమే. పెట్టుబడి మూలధనంలో 2014–19లో రూ.60 వేల కోట్ల వృద్ధి ఉంటే, 2019–24లో రూ.1.12 లక్షల కోట్ల వృద్ధి నమోదైంది. తయారీ రంగంలో ఉపాధి కల్పన, స్థూల ఉత్పత్తి విలువలోనూ గత ఐదేళ్లలో మెరుగైన వృద్ధి నమోదైంది’’ అని తెలిపారు.

పారిశ్రామికవేత్తల్లో నమ్మకం కల్పించాలి.. 
కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ సంక్షేమం, అభివృద్ధిని సమతుల్యం చేస్తూ వైఎస్‌ జగన్ ప్రభుత్వం పారిశ్రామిక ప్రగతిని కొనసాగించిందని చెప్పారు. ‘‘పెట్టుబడిదారులకు కావాల్సింది రాజకీయ ప్రచారం కాదు.. స్థిరమైన విధానాలు, మౌలిక సదుపాయాలు, ఆర్థిక భరోసా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దకుండా అప్పులు పెంచుతూ గత ప్రభుత్వంపై నిందలు వేయడం కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారింది.  గత ప్రభుత్వంలో ఫైనాన్స్ కమిషన్ పరిమితుల కంటే తక్కువ అప్పులు చేస్తే.. ప్రస్తుత ప్రభుత్వంలో పరిమితులు దాటి అప్పులు చేస్తున్నారు. 

రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే గత ప్రభుత్వాన్ని తిట్టడం కాదు.. పారిశ్రామికవేత్తల్లో నమ్మకం కల్పించాలి. పరిశ్రమల రక్షణ చట్టం పేరుతో వైఎస్సార్‌సీపీపై భయభ్రాంతుల ప్రచారం చేయడం రాజకీయ డ్రామా కాదా? వైఎస్‌ జగన్ హయాంలో పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తలే నేటికీ ప్రాజెక్టులను కొనసాగిస్తున్నారు. మరి అప్పట్లో రాష్ట్రంలో పెట్టుబడిదారులు భయపడ్డారన్న ప్రచారం ఎలా నిజమవుతుంది? నారా లోకేశ్‌ చూపించిన ఖాళీ ఏపీ మ్యాప్‌కు సమాధానం.. అధికారిక పత్రాలు, గణాంకాలను చూస్తే సరిపోతుంది. గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని దాచిపెట్టి, ఇప్పుడు తమ ఘనతగా చెప్పుకోవడం కూటమి ప్రభుత్వ రాజకీయ ప్రచారమే’’ అని ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి: బాబు సర్కార్‌ ప్రజల విశ్వాసం కోల్పోయింది: ధర్మాన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement