సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ సత్తా చాటింది. టీడీపీ గూండాలు దౌర్జన్యకాండ, రిగ్గింగ్ చేసినా, అన్ని విధాలుగా అడ్డంకులు సృష్టించినా సంకల్పం సడలిపోలేదు. వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు ధైర్యంగా పోరాడారు. 1,110 సర్పంచ్‌లు వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు.
వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు గెలిచిన చోట రీకౌంటింగ్ పేరుతో ఫలితాలు తారుమారు చేశారు. రీకౌంటింగ్ పేరుతో టీడీపీ భారీగా అక్రమాలకు తెరతీసింది. పోలీసులు, ఎన్నికల సిబ్బందితో కలిసి అనేక చోట్ల వెన్నుపోటు పార్టీ అక్రమాలు చేసింది. టీడీపీ కుట్రలకు ఎదురునిలిచి 1,110 సర్పంచ్ స్థానాలను వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది.
మరోవైపు, పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు 18 మంది ఘన విజయం సాధించారు. 2029లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మార్పు సుస్పష్టమని.. కుప్పంలో వచ్చిన స్థానిక ఫలితాలతో సంకేతాలు పంపించారు.
కాగా, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతతో బెంబేలెత్తిపోతున్న వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం గురువారం జరిగిన గ్రామ పంచాయతీ, కొన్ని మున్సిపల్ స్థానాల ఎన్నికల్లోనూ బరితెగించి రిగ్గింగ్‌కు పాల్పడింది. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికలు అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు, రిగ్గింగ్, దొంగ ఓట్లు, పోలింగ్ ఏజెంట్లపై దాడులతో అనేక ప్రాంతాలు అట్టుడికాయి.
పోలింగ్ కేంద్రాల్లోకి అధికార పార్టీ నేతల అనుచరులు చొరబడుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. లోపల టీడీపీ ఏజెంట్లు, కార్యకర్తలు రిగ్గింగ్ చేస్తే.. పోలింగ్ కేంద్రాల బయట పోలీసులు కాపలా కాశారు. ఓటర్ల చేతిలో స్లిప్పులను టీడీపీ ఏజెంట్లు లాక్కున్నారు. అడ్డుకున్న ఓటర్లపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.

ఇదీ చదవండి: కుప్పంలో ఫ్యాన్ సునామీ


