200 బ్యాలెట్ పేపర్లు ఎత్తుకెళ్లిన టీడీపీ మూకలు.. దిమ్మతిరిగే షాకిచ్చిన ఓటర్లు! | AP Local Body Elections 2026, TDP Cadre Allegedly Snatch 200 Ballots, Independent Candidate Stuns With 484-Vote Victory | Sakshi
Sakshi News home page

200 బ్యాలెట్ పేపర్లు ఎత్తుకెళ్లిన టీడీపీ మూకలు.. దిమ్మతిరిగే షాకిచ్చిన ఓటర్లు!

Nov 27 2026 10:22 AM | Updated on Nov 27 2026 10:44 AM

TDP Cadre Snatch 200 Ballots,Voters Hit Back with a Shocking Verdict

సాక్షి,అనంతపురం: స్థానిక సంస్థల ఎన్నికల పోరులో అనంతపురం జిల్లా రాప్తాడు మండలం ప్రసన్నాయనపల్లి గ్రామంలో అత్యంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ మూకలు అధికార బలం ప్రయోగించి బ్యాలెట్ పేపర్లను ఎత్తుకెళ్లినా, స్వతంత్ర అభ్యర్థిని పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించినా ప్రజల తీర్పు ముందు అవేవీ నిలవలేదు. అన్ని అడ్డంకులను అధిగమించి ఇండిపెండెంట్ అభ్యర్థి మహానందరెడ్డి భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఎన్నికల పోలింగ్ ప్రారంభం కావడానికి కేవలం కొన్ని గంటల ముందు ప్రసన్నాయనపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గెలుపుపై అనుమానంతో టీడీపీ నేతలు పోలింగ్ సిబ్బంది నుంచి సుమారు 200 బ్యాలెట్ పేపర్లను బలవంతంగా లాక్కెళ్లారు. అంతటితో ఆగకుండా, పోలింగ్ కేంద్రం వద్ద అభ్యర్థి ఉంటే తమ వ్యూహాలు ఫలించవని భావించిన ప్రత్యర్థి వర్గం.. ఇండిపెండెంట్ అభ్యర్థి మహానందరెడ్డిని పోలీసులతో అరెస్ట్ చేయించి స్టేషన్‌కు తరలించేలా చక్రం తిప్పారు.  

స్టేషన్‌లో అభ్యర్థి.. బ్యాలెట్ బాక్సుల్లో ప్రజాతీర్పు
ఓవైపు అభ్యర్థి పోలీస్ స్టేషన్‌లో నిర్బంధంలో ఉండటం, మరోవైపు బ్యాలెట్ పేపర్ల చోరీ ఘటనతో గ్రామంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. అయితే, ఓటర్లు మాత్రం ఏమాత్రం వెరవకుండా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచే మహానందరెడ్డి స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచారు. తుది ఫలితాలు వెలువడే సరికి టీడీపీ అభ్యర్థిపై ఏకంగా 484 ఓట్ల భారీ మెజారిటీతో మహానందరెడ్డి విజయం సాధించారు.

కుటుంబ సభ్యుల చేతికి డిక్లరేషన్ ఫారం
ఫలితాలు వెలువడే సమయానికి కూడా మహానందరెడ్డి పోలీస్ స్టేషన్ నిర్బంధంలోనే ఉండటంతో, ఎన్నికల అధికారులు విజేతగా ఆయన పేరును అధికారికంగా ప్రకటించి డిక్లరేషన్ ఫారాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు. బ్యాలెట్ పేపర్ల చోరీ, అభ్యర్థి అరెస్ట్ వంటి పరిణామాల నడుమ ఒక స్వతంత్ర అభ్యర్థి ఇంతటి భారీ మెజారిటీతో గెలుపొందడం ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement