సాక్షి, శ్రీకాకుళం: చంద్రబాబూ.. మీ పాలన ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని ఈ ఎన్నికలతో మీరే నిరూపించుకున్నారంటూ వైఎస్సార్‌షీపీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో హింసను ప్రేరేపించి, అక్రమార్కులైన అధికారులను నియమించుకున్నారు. ఓటర్ లిస్ట్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఆరు ఓట్లను ఆరు డివిజన్లలోకి మార్చి అక్రమాలకు తెరలేపారంటూ ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
‘‘మీ అభ్యర్థులు గెలవడానికి అనుకూలంగా వార్డుల విభజన చేసి నిబంధనలకు తూట్లు పొడిచారు. తప్పుడు లెక్కలతో మీకు అనుకూలంగా రిజర్వేషన్లు మార్చి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. బలమైన ప్రతిపక్ష అభ్యర్థులను ముందే బెదిరించి.. వారి వ్యాపారాలు, వృత్తులను దెబ్బతీస్తామని భయపెట్టారు. తెగించి నామినేషన్ వేసిన అభ్యర్థుల తలలు పగలగొట్టించి రాక్షస పాలన సాగించారు. కొన్ని చోట్ల అభ్యర్థుల అనుమతి లేకుండానే రిటర్నింగ్ అధికారులతో నామినేషన్లు విత్‌డ్రా చేయించారు
..పోలింగ్ రోజున నియామక పత్రాలు ఉన్న ఏజెంట్లను కూడా పోలీసుల ద్వారా స్టేషన్లలో నిర్బంధించారు. పోలీస్ స్టేషన్ల వద్ద ఎవరూ లేకుండా చూసి అధికార పార్టీ దౌర్జన్యాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. రెండున్నర ఏళ్ల పాలనపై నమ్మకం లేకే హింస, అధికార దుర్వినియోగంతో గెలవాలని చూశారు. మోదీ కంటే సీనియర్‌ని అని చెప్పుకునే చంద్రబాబు ఇమేజ్ ఈ ఎన్నికలతో దేశవ్యాప్తంగా డ్యామేజ్ అయింది. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ప్రజాస్వామ్య హక్కులను హరించడమే మీ సీనియారిటీనా?
..స్థానిక ఎన్నికలను సజావుగా నిర్వహించలేని చంద్రబాబు అసమర్థతను జాతీయ మీడియా ఎండగట్టింది. మీ దుర్మార్గపు చర్యల వల్ల అనేక కుటుంబాలపై అక్రమ కేసులు నమోదై, ప్రాణాలు పోయాయి. ఇన్ని అక్రమాలు చేసినా ప్రముఖులు ఉన్న జిల్లాల్లోనూ ప్రజలు మీకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. జనరల్ ఏజెంట్‌గా వెళ్తానన్న నన్ను అక్రమంగా గృహ నిర్బంధం చేసే అధికారం మీకు ఎవరిచ్చారు?. రాజ్యాంగ పరిరక్షణ దినం నాడే నన్ను నిర్బంధించి మీరు రాజ్యాంగ వ్యతిరేక చర్యకు పాల్పడ్డారు
..నన్ను హౌస్ అరెస్ట్ చేయడానికి ఏ అధికారి అయినా ఆన్ పేపర్ ఆదేశాలు ఇవ్వగలరా?. ఎన్నికల నిబంధనలను అతిక్రమించింది నేను కాదు.. మీ అధికారులే నిబంధనలను తుంగలో తొక్కారు. 2029 ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతాయి.. అప్పుడు మీ ఆటలు సాగవు. ఇప్పుడు చేస్తున్న అరాచకాలతో 2029లో మీ ఓటమికి మీరే బలమైన పునాది వేసుకుంటున్నారు. గతంలో పోటీ చేయని స్థానిక ఎన్నికల్లో వైఎస్ జగన్ అక్రమాలు చేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో ఏనాడూ ప్రజలను హింసించే చర్యలకు పాల్పడలేదు.
..మీ ప్రత్యర్థులు గెలిచిన చోట.. కౌంటింగ్ హాళ్లలో లైట్లు ఆర్పేసి, కట్టలు కలిపేసి రీకౌంటింగ్ పేరుతో ఓడిన మీ వారికి సర్టిఫికెట్లు ఇస్తున్నారు. చిన్న ఘర్షణ నెపంతో కౌంటింగ్ హాళ్లలోకి పోలీసులను పంపి ప్రతిపక్ష ఏజెంట్లను బయటకు లాగేస్తున్నారు. మీ కుమారుడి మాటలు వినో, మరెవరి బోధనలతోనో అనుభవాన్ని స్వల్ప ప్రయోజనాలకు వాడుతున్నారు. అక్రమ కేసులతో భయపెట్టి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా మీరు భ్రష్టు పట్టిస్తున్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు.. 2029 తర్వాత మీరు ప్రతిపక్షంలో కూర్చోక తప్పదు. అసెంబ్లీలో మా సీట్లు లెక్కేయకండి.. మొన్నటి ఎన్నికల్లో 40 శాతం ఓట్లు సాధించిన బలమైన ప్రతిపక్షం మాది.
..రాష్ట్రంలో జరిగిన హింసకు, మరణాలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబే పూర్తి బాధ్యత వహించాలి. శ్రీకాకుళంలో పోలింగ్ సందర్బంగా నన్ను నిబంధనలకు విరుద్ధంగా నిర్బంధించడం ఘోర తప్పిదం, కౌంటింగ్‌ను అడ్వకేట్లు, నేషనల్ మీడియా సమక్షంలో అత్యంత పకడ్బందీగా వ్యవహరిస్తాం. అక్రమాలకు పాల్పడే అధికారులపై ప్రైవేట్ కేసులు వేస్తాం.. 2029 తర్వాత వారంతా శిక్ష అనుభవిస్తారు’’ అని ధర్మాన ప్రసాదరావు హెచ్చరించారు.
ఇదీ చదవండి: పంచాయతీ ఎన్నికల్లో ఫ్యాన్ జోరు


