ఈ మధ్యకాలంలో స్థానిక ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకటికి రెండుసార్లు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి, ఇది ప్రజా తీర్పు, ప్రజలు తమపై ఉంచిన విశ్వాసమని అనడమే కాకుండా ఈవీఎంల ద్వారా అయినా, బ్యాలెట్ పత్రాల విధానంలో అయినా కూటమిదే గెలుపు అని తేలిందని చెబుతున్నారు. చంద్రబాబు పనికట్టుకుని ఈవీఎంల ప్రస్తావన ఎందుకు తీసుకు వస్తున్నారా? అన్న సందేహం చాలామందికి కలిగింది. 2024 పార్లమెంటు, శాసనసభ ఎన్నికలలో ఏపీలో మోసాలు జరిగాయని ఎక్కువ మంది నమ్ముతున్నారు. 50 లక్షల ఓట్లు అర్ధరాత్రి రెండు గంటల వరకు పోల్ అయినట్లు ఎన్నికల సంఘం లెక్కలు చెబుతున్నాయని, అదంతా బోగస్ అని ఆధార సహితంగా ప్రముఖ మేధావి పరకాల ప్రభాకర్ వంటివారు రుజువు చేస్తుండడంతో చంద్రబాబు వ్యూహాత్మకంగా ఈ కొత్త ప్రచారం ఆరంభించారన్నమాట.
ఈవీఎంలనే మేనేజ్ చేసినవారికి..
తాజాగా చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గంలో 2024 ఎన్నికలలో సాయంత్రం 6 గంటల తర్వాత పోల్ అయిన ఓట్లలో తేడా కనిపించడం సంచలనంగా ఉంది. చంద్రబాబు ఏ అక్రమాన్ని అయినా కవర్ చేయాలనుకుంటే అందుకు ఒక ప్రాతిపదిక తయారు చేసుకుంటారన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో ఉంది. అందుకే స్థానిక ఎన్నికలు అన్నిటిలో పనికట్టుకుని బాలెట్ పద్దతిని అమలు చేశారు. పంచాయతీ ఎన్నికలు మినహాయించి, కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎన్నికల వరకు ఈవీఎంలను ఉపయోగించవచ్చు. కాని ఈసారి అలా చేయలేదు.పైగా బ్యాలెట్ సిస్టమ్‌లో పోలీసు వ్యవస్థ, అధికార వ్యవస్థ నిజాయితీగా లేకపోతే రిగ్గింగ్ చేయడం చాలా సులువు. దానిని కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బాగా వాడుకుంది. ఈవీఎంలనే మేనేజ్ చేసినవారికి బ్యాలెట్లను రిగ్గింగ్ కోవడం పెద్ద కష్టం కాదు. పలు చోట్ల అధికారుల నుంచి బ్యాలెట్ పత్రాలు గుంజుకుని ఎలా దొంగ ఓట్లు వేసుకుంది తెలిపే వీడియోలు అనేకం ప్రత్యక్షం అయ్యాయి.
చంద్రబాబు ఆత్మవంచన
ఈసారి నామినేషన్ల మొదలు ఎన్నికల ఫలితాల వరకు ఎలా అక్రమాలు చేయవచ్చో, పోలీసు వ్యవస్థను ఎంతగా భ్రష్టుపట్టించవచ్చో చంద్రబాబు సర్కార్ చేసి చూపించిందన్న విమర్శలు సర్వత్రా ఉన్నాయి. ఇక హింసాకాండ, ఓటర్లను ఓట్లు వేయకుండా చేయడంవంటివి సరేసరి. ఈ రకంగా జరిగినవి ఎన్నికలు అని, అది ప్రజల తీర్పు అని చంద్రబాబు చెప్పడం ఆత్మవంచన, ప్రజలను వంచించడం కాక మరేమవుతుంది? దీని ద్వారా ఈవీఎంలు అయినా, బ్యాలెట్ అయినా రిగ్గింగ్ చేయగల సామర్ధ్యం కూటమి నేతలకు ఉందని తెలియచేశారని అనుకోవాలన్నమాట. రౌడీయిజం చేసి గెలిచామని ఏకంగా మంత్రి రామప్రసాదరెడ్డి గొప్పగా చెప్పుకుంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తాము రిగ్గింగ్ చేసి టీడీపీని గెలిపించినా, వేరే వ్యక్తికి పదవి ఇచ్చారని ఓ చిన్నస్థాయి టీడీపీ నేత వాపోవడం కూడా వీడియో సహితంగా కనిపించింది.
ఇదీ చదవండి: బాబు బండారం బయటపెట్టిన పెట్టిన పచ్చపత్రిక!
ఇవన్నీ చూసిన తర్వాత గత శాసనసభ ఎన్నికలలో మోసపూరితంగానే టీడీపీ, జనసేన, బీజేపీ గెలిచాయన్న అభిప్రాయం ప్రజలలో ప్రబలుతోంది. అందుకే ఈవీఎంల ద్వారా జరిగిన శాసనసభ ఎన్నికలలో అవకతవకలు జరగలేదని ప్రజలకు చెప్పడానికి చంద్రబాబు తంటాలు పడుతున్నారు. కాని సాక్ష్యాలు మాత్రం అందుకు విరుద్దంగా ఉంటున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన చిత్తూరు ఓట్ల మాయను గమనిస్తే, అది దేశ ఎన్నికల వ్యవస్థకే సవాలు విసురుతున్నట్లు అనిపిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని చెరబట్టడం పెద్ద కష్టం కాదా ? అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
31471 ఓట్ల తేడా ఎలా?
చిత్తూరు పార్లమెంటు నియోజకవ్గర్గానికి, అందులో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు, సాయంత్రం 6 గంటల తర్వాత పోల్ అయిన ఓట్ల తేడా వేల సంఖ్యలో ఉండడం అనుమానాలకు దారి తీస్తోంది. రిపోర్టర్స్ కలెక్టివ్ అనే సంస్థ జర్నలిస్టులు చేసిన పరిశోధనలో ఈ విషయం బయటకు వచ్చింది. పార్లమెంటు సీటుకు పోలింగ్ నిర్ణీత గడువు ముగిశాక కూడా క్యూలైన్‌లో ఉన్న వారి సంఖ్య 56067గా ఉంది. కాని ఆ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ లెక్కల్లో మాత్రం 24596గా ఈసీ చెప్పింది. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు రెండూ ఒకేసారి జరిగినప్పుడు, ఏదైనా పొరపాటున ఒకటి, అరా తేడా వస్తే రావచ్చుకాని ఏకంగా 31471 ఓట్ల తేడా ఎలా వస్తుందన్న సందేహానికి జవాబు దొరకడం లేదు. అంటే ఈ ఓట్లన్ని ఎలా మాయం అయినట్లు? గడువు దాటినా, క్యూలైన్‌లలో ఉన్నవారికి ఒక్క స్లిప్‌నే ఇస్తారు. వారు లోపలకు వెళ్లాక పార్లమెంటుకు ఓటు వేసి అసెంబ్లీకి ఎలా ఓటు వేయకుండా ఉంటారు?అయినా 31471 ఓట్ల తేడా ఎలా వచ్చిందన్నది మిస్టరీ అన్నమాట.
ఈసీ విశ్వసనీయతపై అనుమానాలు
ఒకవైపు అర్ధరాత్రి రెండు గంటల వరకు 50 లక్షల ఓట్లు పోలైనట్లు ఈసీ అప్పట్లో తెలియచేసింది. దానిని విశ్లేషించిన పరకాల ప్రభాకర్ 3500 బూత్‌లలో నిమిషానికి మూడు ఓట్లు ఎవరు వేశారు, ఎలా వేశారు? అసలు అంతమంది జనం క్యూలలో ఉంటే వాటికి సంబంధించిన ఫుటేజీ ఎందుకు చూపడం లేదని ఆయన అడిగారు. ఇంతవరకు ఈసీ దీనిపై నోరెత్తలేదు. అలాగే ఒకప్పుడు ఈవీఎంలను మేనేజ్ చేయవచ్చని వాదించిన చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికలపై వచ్చిన ఆరోపణల మీద నేరుగా స్పందించడం లేదు. దీనికి తోడు అప్పటి రాష్ట్ర ఎన్నికల అధికారి మీనా ఎన్నికలు జరిగిన 10 రోజులకే వీవీపాట్ స్లిప్‌లను దగ్దం చేయాలని ఆదేశాలు ఇవ్వడం, తదుపరి ఈవీఎంలను మరోసారి లెక్కించాలని కోరుతూ కొందరు వైఎస్సార్‌సీపీ అభ్యర్ధులు ఈసీని కోరినా, అందుకు అంగీకరించకపోవడం, డమ్మి ఈవీఎంలనే ప్రదర్శిస్తామని చెప్పడం.. వంటివి గత ఎన్నికల విశ్వసనీయతపై అనుమానాలు లేవనెత్తాయి. 50 లక్షల మంది ఓటర్లు క్యూ లైన్‌లలో ఉండి ఉంటే, వారికి ముందుగానే పంపిణీ చేసిన స్లిప్‌ల రికార్డులు ఎందుకు చూపించరని కొంతమంది ప్రశ్నిస్తున్నారు.
కిమ్మనని ఎన్నికల సంఘం
ఈ నేపథ్యంలో తాజాగా చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గంలో వెలుగులోకి వచ్చిన ఈ లెక్కల గోల్‌మాల్ మరిన్ని సంశయాలకు దారి తీసింది. చంద్రబాబు ప్రాతినిథ్యం వహించే కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం కూడా చిత్తూరు లోక్‌సభ పరిధిలోనే ఉంది. కుప్పంలో పొరుగు రాష్ట్రాలకు చెందిన దొంగ ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలో నమోదు అయ్యారని అప్పట్లో ఆరోపణలు వచ్చేవి. చంద్రబాబు ప్రత్యర్ధిగా పోటీచేసిన మాజీ ఐఎఎస్ అధికారి, దివంగత చంద్రమౌళి చాలా కష్టపడి సుమారు 17వేల దొంగ ఓట్లను ఆ రోజుల్లో తీయించారు. అయినా ఇంకా పాతికవేలకు పైగానే దొంగ ఓట్లు ఉన్నాయని ఆయన చెబుతుండేవారు. ఈ పరిస్థితిలో ఈవీఎం మాయాజాలాలు ఒక్కొక్కటి బయటపడుతుండడం, వాటికి సమాధానం చెప్పకుండా కేంద్ర ఎన్నికల సంఘం దాటవేస్తున్న తీరు విమర్శలకు గురి అవుతోంది. ప్రముఖ మేధావులు ప్రశాంత భూషణ్, యోగేంద్ర యాదవ్ తదితరులు ఎన్నికల అక్రమాలపై నిలదీస్తున్నా, ఎన్నికల సంఘం కిమ్మనడం లేదంటేనే దాల్ మే కుచ్ కాలా హై అన్న మాట నిజమే అనుకోవల్సి వస్తుంది కదా!

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


