'ప‌చ్చ‌'ప‌త్రిక‌లో బాబు బండారం బ‌ట్ట‌బ‌య‌లు! | Kommineni Srinivasarao Comment Free Bus Scheme Implementation in AP | Sakshi
Sakshi News home page

బాబు బండారం బ‌య‌ట‌పెట్టిన‌ పెట్టిన ప‌చ్చ‌ప‌త్రిక‌!

Nov 26 2026 12:26 PM | Updated on Nov 26 2026 1:12 PM

Kommineni Srinivasarao Comment Free Bus Scheme Implementation in AP

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఇచ్చిన హామీలు ఎంత అధ్వాన్నంగా అమలు అవుతున్నది అప్పుడప్పుడు ఎల్లో మీడియాలో వచ్చే కొన్ని కథ‌నాలు కూడా వెల్లడిస్తుంటాయి. ఏ స్వార్ధ ప్రయోజనంతో ఈ స్టోరీలు ఇస్తుంటాయో తెలియదు కాని, కొన్నిసార్లు అయినా ప్రజలకు కొంతమేర నిజం తెలిసే అవకాశం ఉంటుందని చెప్పాలి.

కొద్ది రోజుల క్రితం ఎల్లో మీడియాకు చెందిన ఒక పత్రికలో పాత బస్సులు.. కస్సుబుస్సులు అంటూ ఒక కథ‌నం వచ్చింది. ఇది చదివితే స్త్రీ శక్తి పేరుతో మహిళలకు అమలుచేస్తున్న ఉచిత బస్సు సదుపాయం స్కీమ్ ఎంత అధ్వాన్నంగా తయారైందో అర్ధం అవుతుంది. ఎన్నికల హామీలో ఉచిత బస్సు ప్రయాణం చేయడానికి మహిళలకు ఎలాంటి షరతులు పెట్టలేదు. ఎన్నికల ప్రచార ప్రకటనలలో రాష్ట్రంలో ఎటువైపు నుంచి ఎటు అయినా ఆర్టీసీ బస్సులలో ఫ్రీగా తిరగవచ్చని ప్రచారం చేశారు. తద్వారా తిరుపతి, అన్నవరం, సింహాచలం తదితర అన్ని పుణ్య క్షేత్రాలు చూసి రావచ్చని ఊదరగొట్టారు. చాలా మంది మహిళలు అది నిజమే అనినమ్మారు. అలాగే ఏ బస్సులో అయినా ప్రయాణించవచ్చని చెప్పేవారు. తీరా చూస్తే మొదటే కేవలం ఐదారు రకాల సర్వీసులకే ఫ్రీ బస్సు స్కీమ్‌ను పరిమితం చేశారు. సుదూర ప్రాంతాలకు వెళ్లడం అంటే అది రోజుల తరబడి అన్నట్లు మార్చారన్న భావన ఉంది. దీంతో మహిళలు ఈ స్కీమ్‌పై పెదవి విరవడం ఆరంభించారు.

ఇక బస్సు సర్వీసులను పెంచవలసింది పోయి, తగ్గించడం ఆరంభించారు. దాంతో బస్సులలో ప్రయాణించడానికి మహిళలు సిగపట్లు పట్టుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరు స్త్రీలు అయితే ఈ ఉచిత బస్సు స్కీమ్ తమ ఆత్మాభిమానం దెబ్బకొట్టేలా తయారైందని ఓపెన్ గానే చెబుతున్నారు. వీరి మనోభావాలు అన్నీ వాస్తవమే అని రుజువు చేసే విధంగా ఎల్లో మీడియా ఓ  స్టోరీ ఇచ్చింది. ఉచిత బస్సు స్కీమ్ వచ్చాక మహిళా ప్రయాణికుల సంఖ్య సుమారు ఐదు లక్షల వరకు పెరిగిందట. గతంలో 39 లక్షల మంది ప్రయాణిస్తుంటే, అది 44 లక్షలకు పెరిగిందని లెక్క చెబుతున్నారు. ఈ పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని బస్సు సర్వీస్‌లను పెంచితే ఇబ్బంది ఉండదు. అలా చేయకపోగా 902 బస్సులను తగ్గించారట. ఇంతకుముందు 10851 బస్సులు ఉంటే, అవి ప్రస్తుతం 9949 మాత్రమేనట. దీంతో ప్రయాణికులు నానా పాట్లు పడవలసి వస్తోంది.

ఇదీ చ‌ద‌వండి: సెంటిమెంట్ల రాజకీయం క‌లిసొచ్చేనా?

ఉచిత బస్సు పథ‌కం ఇచ్చినట్లు ఇచ్చి, ఇన్ని యాతనలకు గురి చేస్తారా అని ప్రయాణికులు మండిపడుతున్నారు. అంతేకాక మహిళల సంఖ్య పెరగడంతో పురుష ప్రయాణికులకు సమస్యలు పెరిగాయి. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని బస్సు సర్వీసులను నడపవలసిన ఆర్టీసీ చేతులెత్తేస్తోందని అంటున్నారు. 2500 ఎలక్ట్రికల్ వాహనాలు వస్తే రద్దీ తగ్గించవచ్చని అనుకున్నారు. ఇంతవరకు వాటి జాడ లేదు. అదే సమయంలో ఎలక్ట్రికల్ బస్సులలో ఉచిత స్కీమ్ ఉంటుందా, ఉండదా అన్నదానిపై క్లారిటీ లేదు. ఇప్పటికే ఆర్టీసీ డిపోలను ప్రైవేటు రంగానికి అప్పగించడం ఆరంభించిన ప్రభుత్వం ఈ ఉచిత స్కీమ్‌ను ఎటు తీసుకువెళుతుందో తెలియడం లేదని అంటున్నారు. నిజానికి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలకు ఇలాంటి ఉచిత స్కీములు అమలు చేయడం ఇష్టం ఉండదు. 

డబాయించి అబద్దాలు 
గతంలో ఏది ఉచితం కాదని ఓపెన్‌గానే చెప్పేవారు. కాని ఎన్నికల సమయం వచ్చే సరికి అన్నీ ఉచితం అనడం ఆయన ప్రత్యేకతగా ఉంటుంది. ఏదో రకంగా అధికారం సాధించాక, తాను ఇచ్చిన వాగ్దానాలను ఎగవేయడం, లేదా కోతలు పెట్టడం వంటివి చేస్తుంటారు. ఇప్పుడు కూడా అదే పద్దతి అనుసరిస్తున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది. పైగా సూపర్ సిక్స్ హామీలు అమలు చేసేశామని అబద్దాలు డబాయించి చెబుతుంటారు. ఆడవారికి ఒక్కొక్కరికి 1500 చొప్పున ఇస్తామన్న హామీ ఊసే ఎత్తడం లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లతో పాటు, మంత్రి నిమ్మ‌ల‌ రామానాయుడు ఎన్నికల సమయంలో 'నీకు 1500, నీకు 1500" అంటూ మహిళలను ఊరిస్తూ చేసిన ప్రచారం వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతంటాయి. నిరుద్యోగ భృతి ఎగవేయడానికి లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేశామని కూటమి నేతలు చెబుతుంటే అవునా ! అని వారు ఆశ్యర్యపోతుంటారు.

తల్లికి వందనం స్కీమ్‌లో కోత
మరో సంగతి చెప్పాలి. తల్లికి వందనం స్కీమ్‌లో ఎలాంటి కోతలు పెడుతున్నారో తెలియచేసే కథ‌నాలు మీడియాలో కనిపిస్తుంటాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్ధుల సంఖ్య 78 లక్షలు. వారికి హామీ ఇచ్చిన ప్రకారం పదిహేను వేల రూపాయల చొప్పున పంపిణీ చేస్తే, ప్రభుత్వం రూ.11700 కోట్లు ఖర్చు చేయవలసి ఉంటుంది. కాని ప్రభుత్వం ఈ వ్యయాన్ని రూ.10120 కోట్లకే పరిమితం చేసిందని లెక్కలు చెబుతున్నాయి. ఆ మేరకు ఏదో సాకు చూపుతూ విద్యార్ధులకు చెల్లించవలసిన తల్లికి వందనం స్కీమ్‌లో కోత పెట్టినట్లే కదా అన్న విశ్లేషణలు వస్తున్నాయి.

హామీలకు ఎగనామం
ఇక ఫీజురీయింబర్స్‌మెంట్‌ స్కీమ్ లో ఎన్ని వేల కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్‌లో పెట్టారో వివరిస్తూ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ఒక ప్రకటన చేశారు. దాని ప్రకారం రూ. 9600 కోట్లు ప్రభుత్వం చెల్లించవలసి ఉందట. అయితే విద్యా మంత్రి లోకేష్ దీనికి సూటిగా సమాధానం ఇవ్వకుండా గత ప్రభుత్వం నాలుగువేల కోట్ల బాకాయి పెట్టి వెళ్లిందని ఆరోపించారు. నిజానికి ఎన్నికల కోడ్ వల్ల అప్పట్లో ప్రభుత్వం నిధులు విడుదల చేయలేకపోయిందన్నది వైఎస్సార్‌సీపీ వివరణ. మంత్రి లోకేష్ పాత కబుర్లు, కల్లబొల్లి కబుర్లు చెబితే విద్యార్ధులకు ఏమి ఉపయోగం? ఫీజురీయింబర్స్‌మెంట్‌ రాకపోవడంతో కాలేజీలు విద్యార్ధులపై ఒత్తిడి చేస్తున్నాయి. దాంతో చిత్తూరులో ఇద్దరు విద్యార్ధులు ఆత్మహత్య యత్నం చేసుకోవడం కలకలం రేపింది. ప్రభుత్వం ఇలాంటి వాటిపై చిత్తశుద్దితో వ్యవహరించకుండా మసిపూసి మారేడుకాయ చేయడం వల్ల విద్యార్ధులకు ఏమి ప్రయోజనం ఉంటుంది? ఇలా అనేక హామీలకు ఎగనామం పెట్టడమో, లేక కోతలు పెట్టడమో చేస్తూ కూటమి తన హామీలను ఉల్లంఘిస్తోందన్న విమర్శలు సర్వత్రా ఉన్నాయి. ఈ రకంగా ఆయా వర్గాలను, ముఖ్యంగా మహిళలను మభ్య పెట్టాలనుకుంటే వారు గుర్తించలేకపోతారా!

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement