కేంద్రాలు.. కొనుగోళ్లు.. అంతంతే | Farmers Face Uncertainty Over Paddy Prices: Telangana | Sakshi
Sakshi News home page

కేంద్రాలు.. కొనుగోళ్లు.. అంతంతే

Nov 28 2026 5:23 AM | Updated on Nov 28 2026 5:23 AM

Farmers Face Uncertainty Over Paddy Prices: Telangana

కల్లాల్లోనే కుప్పలుగా ధాన్యం.. రహదారులపైనే ఆరబోత  

తేమ, తాలు సాకుతో కొనుగోళ్లకు బ్రేకులు 

మరికొన్ని చోట్ల గిట్టుబాటు ధర లేక రైతుల ఎదురుచూపు  

గోనె సంచుల కొరత, మిల్లుల ట్యాగింగ్‌ జాప్యం 

వ్యాపారులు, మిల్లర్ల ఇష్టారాజ్యం.. మద్దతు ధర కంటే తక్కువకే కొనుగోళ్లు

నిజామాబాద్‌ జిల్లా దర్పల్లి మండల కేంద్రానికి చెందిన ఐల లక్ష్మి తనకున్న రెండెకరాల్లో సన్న రకం వరి వేసింది. నెల రోజుల కిందటే కోసి, ధాన్యాన్ని ఆరబెట్టి కుప్పగా పోసింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో అమ్ముకుందామన్నా, కొనుగోళ్లు ప్రారంభించక పోవడంతో నెల రోజులుగా ఎదురుచూడాల్సి వస్తోందని వాపోయింది. 

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ము కునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. పంట చేతికొచ్చి వారాలు, నెలలు గడుస్తున్నా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ఊపందుకోవడం లేదు. కొన్ని చోట్ల కేంద్రాలు ప్రారంభించినా కొనుగోళ్లు చేపట్టడం లేదు. మరికొన్ని చోట్ల గోనె సంచుల కొరత పేరుతో జాప్యం చేస్తున్నారు. ఇంకొన్ని చోట్ల మిల్లుల కేటాయింపులు, కొనుగోళ్లకు అనుమతుల పేరుతో జాప్యం జరుగుతోంది. కొను గోళ్లు ప్రారంభించిన కేంద్రాల్లో తేమ శాతం ఎక్కువగా ఉందంటూ జాప్యం చేస్తున్నారు. దీంతో రైతులు రహదారుల వెంట, కల్లాల్లో రోజుల తరబడి ధాన్యాన్ని ఆరబోస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వాతావరణం రైతులను భయపెడుతోంది. వర్షం వస్తే ధాన్యం తడిసిపోతుందన్న భయంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.  

సిండికేట్‌గా వ్యాపారులు, మిల్లర్లు 
వ్యాపారులు, మిల్లర్లు సిండికేట్‌ మారి ధాన్యం ధర తగ్గించేస్తున్నారు. సన్న రకాలకు రూ.500 బోనస్‌తో కలిపి క్వింటా ల్‌కు రూ.2,961 ప్రభుత్వం మద్దతు ధరగా నిర్ణయించింది. ప్రస్తుత పరిస్థితు ల్లో దిగుబడి తగ్గడంతో మొదట్లో సన్నా లు క్వింటాల్‌కు రూ.4 వేల వరకు పెట్టిన మిల్లర్లు, వ్యాపారులు ధర ఇప్పుడు ఒక్కసారిగా తగ్గించేశారు. రూ.2,800 నుంచి రూ.2,900కే కొనుగోలు చేస్తున్నారు. అయినా గత్యంతరం లేక అమ్ముకోవాల్సి వస్తోంది. ఇక దొడ్డు రకం మద్దతు ధర క్వింటాకు రూ.2,460 ఉన్నా, ధర రూ.1,800కు తగ్గించేశారు. ప్రభుత్వ కొనుగోళ్లు సరిగ్గా లేకపోవడంతో వ్యాపారులకు అమ్మాల్సి వస్తోంది. 

తెరిచిన కేంద్రాల్లోనూ.. 
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు ధాన్యం సేకరణ పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. వైరా మండలంలో రెండు వేల ఎకరాల్లో కోతలు పూర్తయినా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించలేదు. కల్లూరు మండలంలో దొడ్డు రకం ధాన్యాన్ని గతంలో రూ.3,200కు కొనుగోలు చేసిన వ్యాపారులు ఇప్పుడు రూ.1,800– 2,000కు ధర తగ్గించేశారు. తాలు, తేమ పేరుతో బస్తాకు కిలో తరుగు తీస్తున్నా తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది. 

సిండికేట్‌గా మారి.. ధర తగ్గించేసి 
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో మిల్లుర్లు సిండికేట్‌గా మారి ధర తగ్గించేశారు. మొదట్లో సన్న ధాన్యానికి క్వింటాకు రూ.3,500 వరకు చెల్లించిన మిల్లర్లు, సిండికేట్‌గా మారి ప్రస్తుతం రూ.2,500 నుంచి రూ.2,800కే కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ కేంద్రాల్లో అమ్ముకుందామనుకుంటే పట్టించుకోవడం లేదు.  

గోనె సంచుల్లేక కాంటాలు నిలిపివేత 
ఉమ్మడి వరంగల్‌లోనూ కొనుగోళ్లు వేగంగా సాగడం లేదు. భూపాలపల్లి ప్రాంతంలో కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి వారం రోజులైనా గోనె సంచులు రాక కాంటాలు వేయడం లేదు. రోజుల తరబడి ధాన్యం ఆరబోసి వేచి చూడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. 

ఆదిలాబాద్‌లోనూ మొదలుకాని సేకరణ 
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 4.95 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, సుమారు 3.70 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు. 700కు పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినా ఎక్కడా కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. మిల్లర్లతో ఒప్పందాలు పూర్తికాలేదు. దీంతో ప్రభుత్వం కొనడం లేదు.  

కొన్నది అంతంతే.. 
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో సన్న రకం 14,28,876 మెట్రిక్‌ టన్నులు, దొడ్డు రకం 6,50,328 మెట్రిక్‌ టన్నులు దిగుబడి వస్తుందని అంచనా వేసినా, ఇప్పటివరకు 289 మెట్రిక్‌ టన్నులే కొనుగోలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం గూడెం ఐకేపీ కొనుగోలు కేంద్రం నెల రోజుల క్రితమే కేంద్రాన్ని ప్రారంభించినా ధాన్యం కొనుగోలు చేయడం లేదు. 

దొడ్డు రకం రైతులకు దిక్కేది? 
నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో సన్న ధాన్యానికి మొదట్లో క్వింటాకు రూ.4 వేల ధర పెట్టిన మిల్లర్లు ఇప్పుడు తగ్గించేశారు. దొడ్డు రకం ధాన్యానికి కూడా మొదట్లో క్వింటాల్‌కు రూ.2,400 వరకు పెట్టిన మిల్లర్లు ఇప్పుడు సిండికేట్‌గా మారి «రూ.1,800–2,000కే కొనుగోలు చేస్తున్నారు. సన్న ధాన్యం ధర కూడా రూ.2,850కి తగ్గించేశారు. కొన్ని ప్రాంతాల్లో కొనుగోళ్లే ప్రారంభించలేదు. యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ అదే పరిస్థితి. 

⇒ ఉమ్మడి మహబూబ్‌నగర్, సంగారెడ్డి జిల్లాల్లో ప్రైవేటు వ్యాపారులే దిక్కయ్యారు. మద్దతు ధరకంటే ఎక్కువ ధర పెడుతుండటంతో ప్రభుత్వ కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. 

ప్రభుత్వం కొనడం లేదు  
పదెకరాల్లో వరి వేశాను. 35 బస్తాలే దిగుబడి వచ్చింది. ధాన్యం రోడ్డుపై పోసి ఆరబెడుతున్నా. వర్షం వస్తే తడిసిపోతుందేమోనని భయమేస్తుంది. ప్రభుత్వ కేంద్రంలో ధాన్యం కొనడం లేదు.  
– బానోతు సీతారాములు, వాచానాయక్‌ తండా(ఖమ్మం (26ఎన్‌ఎల్‌సీ602) 

రెండు నెలలుగా ఎదురుచూపులే  
నాకున్న ఎకరంన్నరలో సన్న ధాన్యం పండించా. రెండు నెలల కిందట కోత పూర్తయింది. ధాన్యం ఆరిన తర్వాత కుప్పలుగా పోసి ఉంచాను. ఎవరు కొనడం లేదు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఇటీవల ధర్నా చేశాం.  
– షేక్‌ వకీల్‌. మోకన్‌పల్లి(నిజామాబాద్‌) (26ఎన్‌ఎల్‌సీ603)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement