అక్రమంగా పాస్ పుస్తకం పొందిన, దానికి సహకరించిన సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవు. నా పరిధిలో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తా. అక్రమాలు పాల్పడింది ఎంతటి వారైని ఉపేక్షించేది లేదు.
– రమణారెడ్డి, మిర్యాలగూడ ఆర్డీఓ
మిర్యాలగూడ : పట్టా ల్యాండ్ అయినా.. పోరంబోకై నా.. ప్రభుత్వ భూమైనా వారి కన్ను పడిందంటే జాగాలో పాగా వేయాల్సిందే. మిర్యాలగూడ పట్టణ పరిసర ప్రాంతాల్లో భూముల ఆక్రమణ జోరుగా సాగుతోంది. రెవెన్యూలో ఉన్న లొసుగులను అండగా చేసుకోని కొందరు అక్రమాలకు తెరలేపుతున్నారు. ఇలా 28 ఏండ్ల క్రితం ఒక వ్యక్తి పట్టణ సమీపంలో ఉన్న ఒక కాలనీలో 27గుంటల భూమిని విక్రయించాడు. ఆ రోజుల్లో నాలా కన్వర్షన్ సైతం చేయించాడు. దాన్ని ప్లాట్లుగా మార్చి పలువురికి విక్రయించాడు. సాధారణంగా పట్టణంలో చాలా వరకు సేల్ డీడ్ జరిగిన తరువాత పహాణీలలో మార్పిడి చేసుకోకపోవడం వల్ల భూమిని విక్రయించని వ్యక్తి పేరు మీదనే రెవెన్యూ రికార్డుల్లో భూమి కంటిన్యూగా వస్తుంది. ఇదే అదునుగా చేసుకోని ఆ వ్యక్తి వారసుడు రెవెన్యూ అధికారుల అండదండలతో 28గుంటల భూమికి మళ్లీ నాలా కట్టుకుని పాస్‌బుక్ సైతం పొందాడు. ఇప్పడు ఆ భూమి తనదేనంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. అక్కడ అక్రమంగా నిర్మాణాలు చేపడుతూ ప్లాట్ల యజమానులను భయాందోళనకు గురిచేస్తున్నాడు.
28 ఏళ్ల క్రితమే కొనుగోలు చేసినా..
రెవెన్యూ అధికారులు తలుచుకుంటే ఏదైనా సాధ్యమేనని స్థానికులు చర్చించుకుంటున్నారు. 1998లో నంబర్ నంబర్ 827లో 27గుంటల భూమి నాలా కన్‌వర్షన్ కాగా.. వ్యవసాయ భూమి రికార్డుల నుంచి తొలగించి కమర్షియల్‌గా మార్చారు. అక్కడ ప్లాట్లు కొనుగోలు చేసిన యజమానులు పహాణీలో మార్చుకోకపోవడంతో.. 2025లో సదరు భూమికి తాను వారసుడినంటూ నాలా కన్వర్షన్ చేశారు. ఇందుకు సహకరించినందుకు ఒక రెవెన్యూ అధికారికి 8 గుంటల భూమిని తాయిలంగా సమర్పించినట్లు తెలిసింది. రెవెన్యూ అధికారి నాలా కన్వర్షన్ చేసే ముందు ఆ వ్యక్తికి సంబంధించిన పాస్ బుక్, ఈసీ పరిశీలంచాల్సి ఉన్నా అవేమీ పట్టించుకోలేదని తెలుస్తోంది. 1998లోనే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో భూ యజమాని ద్వారా పలువురు సేల్ డీడ్ చేయించుకోని 28 ఏండ్లుగా భూమిపై కబ్జాలో ఉన్నారు. కొనుగోలు చేసి దస్తావేజులు ఉండడంతోపాటు ఈసీలో కూడా వారి పేర్లు వస్తున్నాయి. ఇవేమీ గమనించకుండా సదరు రెవెన్యూ అధికారి నాలా కన్‌వర్షన్ చేసి లేని భూమికి హక్కులు కల్పించి పాస్‌బుక్ అందించడం ఏంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై డీఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు.
ఫ మిర్యాలగూడ పట్టణంలో
భూములు వివాదాస్పదం
ఫ ఎలాంటి విచారణ చేపట్టకుండా రెండోసారి నాలా కన్వర్షన్


