అర్హత ఉన్నా.. కొందరికే | - | Sakshi
Sakshi News home page

అర్హత ఉన్నా.. కొందరికే

Nov 28 2026 1:26 AM | Updated on Nov 28 2026 1:26 AM

30న అర్హుల జాబితా విడుదల

కార్పొరేట్‌ కార్యాలయ పరిధిలో బదిలీకి అర్హులైన ఉద్యోగుల జాబితాను నవంబర్‌ 30న ఎంప్లాయి పోర్టల్‌లో అందుబాటులో ఉంచుతారు. జాబితాపై అభ్యంతరాలను స్వీకరించి, వాటిని పరిష్కరిస్తారు. ఉద్యోగులు డిసెంబర్‌ 7 ఉదయం 10 గంటల నుంచి 9వ తేదీ వరకు తమకు కావాల్సిన ప్రాంతాల ఆప్షన్లను సమర్పించాలి. డిసెంబర్‌ 18వ తేదీలోగా బదిలీ ఉత్తర్వులు అందజేయాలని సంస్థ నిర్ణయించింది. బదిలీ అయిన ఉద్యోగులంతా డిసెంబర్‌ 22లోగా కొత్త స్థానాల్లో విధుల్లో చేరాల్సి ఉంటుంది. డిసెంబర్‌ 19 నుంచి బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుంది.

నల్లగొండ : తెలంగాణ దక్షిణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీజీఎస్‌పీడీసీఎల్‌) పరిధిలో ఉద్యోగుల బదిలీలు చేపట్టనున్నారు. ప్రస్తుత పోస్టులో 2026 అక్టోబర్‌ 31 నాటికి మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులను బదిలీలకు అర్హులుగా పరిగణించనున్నారు. అర్హులైన ఉద్యోగులందరికీ బదిలీ తప్పనిసరి కాకుండా ఈసారి ప్రతి కేడర్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యలో 40 శాతానికి మించకుండా బదిలీ చేయనున్నారు.

సర్కిల్‌ పరిధిలో పలు కేడర్లకు బదిలీలు..

జిల్లాలో విద్యుత్‌శాఖలో అన్ని విభాగాలు కలిపి మొత్తం పోస్టులు 1362 ఉండగా.. ప్రస్తుతం 1030 మంది పని చేస్తున్నారు. నిబంధనల ప్రకారం వీరిలో సుమారు 400 మంది వరకు బదిలీ కానుంది. సబ్‌ ఇంజినీర్లు, జేఏఓ స్థాయి వరకు అకౌంట్స్‌ సిబ్బంది, ఓఅండ్‌ఎం సిబ్బంది, ఎఫ్‌ఎం, ఎస్‌ఎల్‌ఐ, జనరల్‌ సర్వీసెస్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలను సంబంధిత సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ చేపడతారు. డివిజన్‌ పరిధిలో ఎల్‌ఐ కేడర్‌ వరకు ఓ అండ్‌ ఎం సిబ్బంది బదిలీలను డివిజనల్‌ ఇంజినీర్‌ చేపడతారు. ఏఈ, ఏఏఈ, ఏడీఈ, ఏఈఈ, డీఈ, ఈఈ, ఏఏఓ, ఏఓ, ఎస్‌ఏఓ వంటి కేడర్ల బదిలీలు కార్పొరేట్‌ కార్యాలయ పరిధిలో ఉంటాయి. ప్రస్తుత పోస్టులో చేసిన సర్వీసు కాలం, కేడర్‌లో సీనియారిటీ, అందుబాటులో ఉన్న ఖాళీలు తదితర అంశాల ఆధారంగా బదిలీలను ఖరారు చేయనున్నారు. ఇద్దరు ఉద్యోగులకు సమాన సర్వీసు ఉన్నప్పుడు ప్రస్తుత కేడర్‌లో సీనియర్‌గా ఉన్న ఉద్యోగిని బదిలీకి పరిగణిస్తారు.

దివ్యాంగులు, వితంతువులకు ప్రాధాన్యం..

ఒకే ప్రాంతానికి ఒకరి కంటే ఎక్కువ మంది ఉద్యోగులు బదిలీ కోరినప్పుడు ప్రత్యేక ప్రాధాన్యత క్రమాన్ని పాటించనున్నారు. మొదట భార్యాభర్తల కేసులకు ప్రాధాన్యం ఇస్తారు. అయితే నిర్దేశించిన విధానం ప్రకారం దంపతుల్లో ఒకరినే బదిలీ చేస్తారు. అనంతరం 2027 డిసెంబర్‌ 31లోగా పదవీ విరమణ చేసే ఉద్యోగులు, 70 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న ఉద్యోగులు, మానసిక వైకల్యం కలిగిన పిల్లలున్న ఉద్యోగులు, వితంతువులకు ప్రాధాన్యం కల్పిస్తారు. వైద్య కారణాలతో బదిలీ కోరుకునే ఉద్యోగులకు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. గుర్తించిన యూనియన్లు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు బదిలీల నుంచి రక్షణ కల్పించనున్నారు. డిస్కం అధ్యక్షుడు, కార్యదర్శికి ఒక్కొక్కరికి, ప్రతి సర్కిల్‌ ప్రాంతీయ అధ్యక్షుడు, కార్యదర్శికి ఒక్కొక్కరికి ఈ రక్షణ వర్తిస్తుంది.

ఫ విద్యుత్‌శాఖ ఉద్యోగుల బదిలీల మార్గదర్శకాలు విడుదల

ఫ మూడేళ్ల సర్వీసు ప్రాతిపదికన.. 40 శాతానికే పరిమితం

ఫ డిసెంబర్‌ 18 లోగా బదిలీ ప్రక్రియ పూర్తి చేసేలా ప్రణాళిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement