మహిళా నేతల్లో పెరుగుతున్న ఆశలు
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు ఈసారైనా ఆమోదం పొందుతుందా? నియోజకవర్గాల పునర్విభజనకు పార్లమెంట్ పచ్చజెండా ఊపుతుందా? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఈ అంశాలపై ఉత్కంఠ నెలకొంది. గత ఏప్రిల్‌లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్లతో ముడిపడిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ సాధించలేకపోయింది. దీంతో కేంద్ర ప్రభుత్వం మరోసారి ఈ అంశాన్ని ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 30 నుంచి డిసెంబరు 3 వరకు పార్లమెంట్ సమావేశాలు నిర్వహించనుండటంతో మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులపై మరోసారి చర్చ మొదలైంది.
మారనున్న రాజకీయ ముఖచిత్రం
ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. పునర్విభజనలో భాగంగా అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు ప్రతిపాదన అమలైతే ఉమ్మడి జిల్లాలో నియోజకవర్గాల సంఖ్య 18కి పెరుగనుంది. ప్రస్తుతం నల్లగొండలో ఆరు నియోజకవర్గాలు ఉండగా అవి ఎనిమిదికి పెరుగనున్నాయి. సూర్యాపేటలో ప్రస్తుతం నాలు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఆరుకు పెరిగే అవకాశం ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ ప్రస్తుతం రెండు అసెంబ్లీ స్థానాలు ఉండగా, అక్కడ నాలుగు స్థానాలకు పెరిగే అవకాశం ఉంది. ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరు కొత్త నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంటుంది.
మహిళలకు చట్టబద్ధమైన అవకాశాలు
కొత్తగా ఏర్పాటయ్యే నియోజకవర్గాలతో కలిపి మొత్తం 18 నియోజకవర్గాలు కానుండగా, అందులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే.. ఆరు స్థానాలు మహిళలకు దక్కే అవకాశం ఉంది. నల్లగొండలో మూడు, సూర్యాపేటలో రెండు, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒకటి చొప్పున మహిళలకు దక్కుతాయని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. నియోజకవర్గాల్లో పార్టీ టికెట్ల కేటాయింపు నుంచి ఎన్నికల వ్యూహాల వరకు రాజకీయ పార్టీల లెక్కలు మారనున్నాయి. మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే, రిజర్వ్ అయ్యే నియోజకవర్గాలు ఏవి? రొటేషన్ ఎలా ఉంటుంది? ప్రస్తుత మహిళా నాయకుల్లో ఎవరికి రాజకీయంగా అవకాశం దక్కుతుంది? అన్నది ఆసక్తికరంగా మారింది. వీటన్నింటిపై పునర్విభజన, రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయిన తర్వాతే స్పష్టత రానుంది.
లోక్‌సభలోనూ పెరగనున్న వాటా
ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో ప్రస్తుతం భువనగిరి, నల్లగొండ రెండు లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. పునర్విభజనలో రాష్ట్రానికి కేటాయించే స్థానాల సంఖ్య పెరిగి, జిల్లాకు మరో పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడితే మొత్తం మూడు స్థానాలు కానున్నాయి. ఈ మూడు స్థానాల్లో మూడో వంతు లెక్కన ఒక స్థానం మహిళలకు దక్కుతుంది. తద్వారా పార్లమెంట్‌లోనూ ఉమ్మడి జిల్లా నుంచి మహిళా ప్రాతినిధ్యానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే, జిల్లాకు కొత్త పార్లమెంట్ స్థానం ఏర్పాటవుతుందా? మహిళలకు ఏ స్థానం కేటాయిస్తారు? అన్నది అధికారిక పునర్విభజన ప్రక్రియలోనే తేలనుంది.
మహిళా రిజర్వేషన్ల అమలుపై ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల మహిళా నాయకుల్లో ఆశలు పెరుగుతున్నాయి. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలవుతున్నప్పటికీ అసెంబ్లీ, పార్లమెంట్ స్థాయిలో వారి ప్రాతినిధ్యం ఆశించిన స్థాయిలో లేదు. ఇప్పుడు 33 శాతం రిజర్వేషన్లు అమలైతే రాజకీయాల్లో మహిళలకు మరింత ప్రాధాన్యం లభించనుంది. పార్టీ పదవులు, ఎన్నికల టికెట్ల కేటాయింపు, రాజకీయ నిర్ణయాల్లోనూ మహిళల పాత్ర పెరిగే అవకాశం ఉంటుంది.
ఫ నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం కసరత్తు
ఫ ఉమ్మడి జిల్లాలో ఆరు అసెంబ్లీ స్థానాలపై మహిళల ఆశలు
ఫ ఒక ఎంపీ స్థానం పెరిగితే.. మూడింట ఒకటి మహిళలకు దక్కే అవకాశం
ఫ పునర్విభజనతో 18కి చేరనున్న అసెంబ్లీ స్థానాలు
ఫ పార్లమెంట్ ఆమోదంపై
సర్వత్రా ఆసక్తి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ :


